వర్సిటీల్లోనూ కేంద్ర, రాష్ట్ర రాజకీయ చిచ్చు

విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకాలు.. ఈ మధ్యకాలంలో కేంద్ర రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ముఖ్యంగా భాజపా పరిపాలనలో లేని రాష్ట్రాల్లో ఇవి వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవల

Published : 04 Jul 2022 06:17 IST

నియామకాలపై పడుతున్న ప్రభావం

దిల్లీ: విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకాలు.. ఈ మధ్యకాలంలో కేంద్ర రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ముఖ్యంగా భాజపా పరిపాలనలో లేని రాష్ట్రాల్లో ఇవి వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌కు మధ్య రవీంద్ర భారతి యూనివర్సిటీ ఉపకులపతి నియామకం రగడకు దారితీసింది.  రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నింటికీ ముఖ్యమంత్రిని కులపతిగా నియమిస్తూ.. పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఏకంగా చట్ట సవరణ కూడా చేసింది. బెంగాల్లోనే కాదు.. కేరళ, తమిళనాడు, ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్రల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. గవర్నర్లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయవైరాలకు విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా మారుతున్నాయి. ‘‘ఉపకులపతుల నియామకం.. రాజకీయ నియామకాలుగా మారింది. గవర్నర్లు.. రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు తీసుకోవడం లేదు’’ అని దిల్లీ యూనివర్సిటీ అకడమిక్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యురాలు అబాదేవ్‌ హబీబ్‌ తెలిపారు. ‘‘గవర్నర్లంతా భాజపా వ్యక్తులే. వారు తమకు సన్నిహితులుగా ఉన్నవారినే నియమించుకుంటున్నారు’’ అని ఆమె ఆరోపించారు. సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌ ఉన్నతాధికారి మాత్రం ఇదేమీ కొత్త కాదు అన్నారు. ‘‘కేంద్ర, రాష్ట్రాల మధ్య ఈ వివాదాలు గతంలోనూ జరిగాయి. విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలంటే మనం సీఎం, గవర్నర్లను దాటి ఆలోచించాలి’’ అని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల స్వతంత్ర ప్రతిపత్తి గురించి చర్చ జరగాలని జేఎన్‌యూ ప్రొఫెసర్‌ అయేషా కిద్వాయ్‌ అభిప్రాయపడ్డారు. విద్యాపరమైన నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛ విద్యావేత్తలకు ఇవ్వాలన్నది ఆమె వాదన. ‘‘దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తికి ప్రమాదం ఏర్పడింది. విద్యాస్వేచ్ఛ ఉండాలి. ప్రజలతో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలే విధానాలు రూపొందించాలి’’ అని ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని