Indonesia: కొత్త నగరానికి.. ఇండోనేసియా రాజధాని!

ద్వీపసమూహ దేశం ఇండోనేసియా... తన రాజధానిని జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలోని తూర్పు కాలిమంటన్‌ ప్రావిన్స్‌కు తరలిస్తోంది!

Updated : 28 Jan 2022 12:20 IST

ప్రపంచ స్థాయిలో పోటీపడేలా నిర్మాణం
రంగంలోకి అబుదాబీ యువరాజు మహమ్మద్‌ బిన్, బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌

జకార్తా: ద్వీపసమూహ దేశం ఇండోనేసియా... తన రాజధానిని జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలోని తూర్పు కాలిమంటన్‌ ప్రావిన్స్‌కు తరలిస్తోంది! అక్కడి బాలిక్‌పాపన్‌ ఓడరేవు సమీపంలో కొత్త రాజధాని కొలువుదీరనుంది. ప్రపంచ స్థాయి రాజధానులతో పోటీపడేలా, అత్యాధునిక వసతులతో దీన్ని నిర్మించాలన్నది అధ్యక్షుడు జోకో విడొడొ కల. దీన్ని సాకారం చేసేందుకు అబుదాబి యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్, బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ వంటి ఉద్ధండులు రంగంలోకి దిగారు. ఇంతకీ... జకార్తా నుంచి రాజధానిని ఎందుకు తరలించాల్సి వచ్చింది? కొత్త రాజధాని ఎలా ఉంటుంది? అన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఎందుకు మార్చాల్సి వచ్చింది?

ఇండోనేసియాలో 17 వేలకు పైగా ద్వీపాలున్నాయి. మొత్తం జనాభా 27 కోట్లు. ఇందులో 54% మంది ఒక్క జావా ద్వీపంలోనే నివసిస్తున్నారు. జకార్తా కూడా ఇక్కడే ఉంది. నానాటికీ జనంతో కిక్కిరిసిపోతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా సముద్రంలో మునిగిపోతున్న ప్రాంతం కూడా ఇదే. 2050 నాటికి ఇక్కడి మూడింట ఒక వంతు భూభాగం జావా సముద్రంలో కలిసిపోతుందని అంచనా. భూగర్భ జలాలు అడుగంటిపోయి, తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొంది. జల, వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. వాతావరణ మార్పుల ప్రభావంతో తరచూ భూకంపాలు, సునామీలు, వరదలు సంభవిస్తున్నాయి. ముప్పేట సవాళ్లు ముసురుకోవడంతో... 1949 నుంచి జకార్తాలో కొనసాగుతున్న ఫెడరల్‌ క్యాపిటల్‌ను బోర్నియోకు తరలించాలని విడొడొ యోచించారు. ఇందుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది.

కొత్త రాజధాని ‘నూసంటారా’

జకార్తా నుంచి తూర్పు కాలిమంటన్‌కు 2 వేల కిలోమీటర్ల దూరం. ప్రస్తుతం అక్కడ 7 లక్షల మంది జనాభా ఉన్నారు. కొత్త రాజధానిని విడొడొ ‘నూసంటారా’గా పేర్కొన్నారు. ‘ద్వీపసముదాయం’ అని దీనర్థం. రాజధాని తరలింపునకు వీలుగా ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్, పార్లమెంటు భవనం, ప్రభుత్వ కార్యాలయాలను, రహదారులను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు మొత్తం 1,38,800 ఎకరాలను గుర్తించి, ప్రాథమిక ప్రణాళికనూ రూపొందించారు. 2024 నాటికి అధ్యక్ష భవనం, సచివాలయంతో పాటు... హోం, విదేశీ, రక్షణ శాఖల కార్యాలయాలను తరలించాలని యోచిస్తున్నారు. 

రంగంలోకి ఉద్ధండులు 
అత్యాధునిక సాంకేతిక వసతులతో కూడిన హరిత ఇండోనేసియాను ఆవిష్కరించేలా నూతన రాజధాని ఉండాలని విడొడొ లక్ష్యం నిర్దేశించారు. ఆ బాధ్యతను ఉద్ధండుల చేతిలో పెట్టారు. రాజధాని నిర్మాణ కమిటీకి అబుదాబీ యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌ పర్యవేక్షకునిగా వ్యవహరిస్తున్నారు. బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, జపాన్‌కు చెందిన హోర్డింగ్‌ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మసయోషి సన్‌ వంటి హేమాహేమీలు కూడా ఈ క్రతువులో పాలుపంచుకోనున్నారు. కొత్త రాజధాని నిర్మాణ ప్రాజెక్టుకు సుమారు రూ.2,55,750 కోట్లు (34 బిలియన్‌ డాలర్లు) ఖర్చవుతుందని అంచనా. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని