Mount Everest: నీరుగారుతున్న ఎవరెస్టు శిఖరాగ్రం.. వేగంగా కరిగిపోతున్న హిమానీనదం

ఎవరెస్టు శిఖరాగ్రానికి దగ్గరల్లో ఉన్న ఒక హిమానీనదం వేగంగా కరిగిపోతోంది. ఈ హిమం ఏర్పడటానికి వేల సంవత్సరాలు

Updated : 06 Feb 2022 11:09 IST

కాఠ్‌మాండు: ఎవరెస్టు శిఖరాగ్రానికి దగ్గరల్లో ఉన్న ఒక హిమానీనదం వేగంగా కరిగిపోతోంది. ఈ హిమం ఏర్పడటానికి వేల సంవత్సరాలు పట్టింది. వాతావరణ మార్పుల కారణంగా గత పాతికేళ్లలో అది బాగా తరిగిపోతున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. సౌత్‌ కోల్‌ అనే ఈ హిమానీనదంపై ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు అమెరికాలో శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. గత 25 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో 55 మీటర్ల మేర ఐస్‌ తగ్గిపోయిందని అందులో వెల్లడైంది. ఈ మంచు పైపొరను ‘కార్బన్‌ డేటింగ్‌’ విధానంతో విశ్లేషించినప్పుడు అది రెండు వేల సంవత్సరాల కిందట ఏర్పడినట్లు తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అది ఏర్పడటానికి పట్టిన సమయంతో పోలిస్తే 80 రెట్లు వేగంగా కరిగిపోతోందని పేర్కొన్నారు. ఈ లెక్కన చూస్తే అది కొన్ని దశాబ్దాల్లోనే అంతర్థానమయ్యే అవకాశం ఉందన్నారు. సౌత్‌ కోల్‌ హిమానీనదం.. సముద్రమట్టానికి 7,900 మీటర్ల ఎత్తులో ఉంది. హిమాలయాల్లోని పలు హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. ఫలితంగా పర్వతపాదాల వద్ద వందలాది సరస్సులు ఏర్పడ్డాయి. అవి కట్టలు తెంచుకొని వరదలు విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉంది. 1994 నుంచి రికార్డు స్థాయిలో 25 సార్లు ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన నేపాలీ పర్వతారోహకుడు కామి రీటా షెర్పా కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఈ పర్వతంపై అనేక మార్పులు కనిపిస్తున్నాయని చెప్పారు. ఎప్పుడూ భారీ మంచుతో నిండి ఉండే ప్రాంతాల్లోనూ ఇప్పుడు శిలలు కనిపిస్తున్నాయన్నారు. ఇది ఆందోళనకరమని చెప్పారు. హిమాలయాల్లోని హిమానీనదాలు దాదాపు 200 కోట్ల మందికి నీటి వనరు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని