Punjab Elections 2022: చిచ్చుపెట్టడమే కాంగ్రెస్‌ పని: సీఎం చన్నీ వ్యాఖ్యలపై మోదీ మండిపాటు

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఒకరినొకరు కొట్టుకొనేలా చేయడమే కాంగ్రెస్‌ పని అంటూ ఆ పార్టీపై ప్రధాన మంత్రి నరేంద్ర 

Published : 18 Feb 2022 09:38 IST

యూపీ వాసులను పంజాబ్‌లోకి రానివ్వరా?

అబోహర్‌(పంజాబ్‌): ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఒకరినొకరు కొట్టుకొనేలా చేయడమే కాంగ్రెస్‌ పని అంటూ ఆ పార్టీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. గురువారం ఆయన పంజాబ్‌లోని అబోహర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా యూపీ, బిహార్, దిల్లీ నుంచి వచ్చిన వారిని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాలని పరోక్షంగా ఆమ్‌ ఆద్మీ పార్టీని ఉద్దేశించి ఇటీవల ఓ సభలో సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ చేసిన వ్యాఖ్యలపై మోదీ మండిపడ్డారు. ఆ సమయంలో వేదికపై నించొని చప్పట్లు కొట్టిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీనీ విమర్శించారు. ‘‘బిహార్, యూపీ ప్రజలు కష్టించి పనిచేయని గ్రామాలు పంజాబ్‌లో ఉన్నాయా..? వారిపై చన్నీ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఓ కుటుంబ పార్టీ అధినేత కూడా ఉన్నారు. ఆమె చప్పట్లు కొట్టారు. ఇది దేశమంతా చూసింది. సంత్‌ రవిదాస్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో పుట్టారు. మరి రవిదాసీయులను, ఇతర యూపీ వాసులను పంజాబ్‌ నుంచి వెళ్లగొడతారా? గురు గోవింద్‌ సింగ్‌ పట్నా సాహిబ్‌లో జన్మించారు. మరి బిహార్‌ వాసులను పంజాబ్‌లోకి రానీయ్యరా? ఇలా ప్రజలను విభజించి రాజకీయాలు చేసే వారికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదు’’ అని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల విషయంలోనూ కాంగ్రెస్‌ మోసపూరితంగానే వ్యవహరించిందని అన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్‌ ఉందని, కానీ కాంగ్రెస్‌ ఆ పని చేయలేదని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్‌ సిఫార్సులను అమలు చేశామని చెప్పారు. భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపుర్‌ ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు. త్రిపుల్‌ తలాఖ్‌ అంశాన్ని ప్రస్తావించారు. దీనికి వ్యతిరేకంగా తాము చట్టం చేసినపుడు ప్రతిపక్షాలన్నీ కలిసి తమపై దాడి చేశాయని అన్నారు. 

ఆప్‌ను అడ్డుకునేందుకు కుమ్మక్కు: కేజ్రీవాల్‌

గురుదాస్‌పుర్‌: ‘పంజాబ్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ని ఓడించేందుకు కాంగ్రెస్, భాజపా, శిరోమణి అకాలీదళ్‌ పార్టీలు కుమ్మక్కు అయ్యాయి.. మేము అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ఈ పార్టీల ధ్యేయం’ అని ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ విపక్షాలపై ధ్వజమెత్తారు. ఆ పార్టీల దోపిడీని, అవినీతిని అడ్డుకునేందుకు పంజాబ్‌ ఓటర్లు కూడా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గురుదాస్‌పుర్‌కు చేరుకొన్న కేజ్రీవాల్‌ వీధుల్లో తిరుగుతూ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఆప్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. 

పూర్తిస్థాయి మెజారిటిపైనే మా దృష్టి: మాయావతి

బాందా (యూపీ): ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, ఉద్యోగాల కోసం రాష్ట్రం నుంచి యువత వలసలను నివారిస్తుందని మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. బీజేపీ నియంతృత్వ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు 2007లో మాదిరి పూర్తిస్థాయి మెజారిటీ సాధనే తమ ధ్యేయమన్నారు. బాందాలో గురువారం జరిగిన బీఎస్పీ ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలో బాందా, చిత్రకూట్‌ ప్రాంతాలను బందిపోట్లు పాలించేవారని, బీఎస్పీ అధికారంలోకి వచ్చాక వారిని ఏరివేసిందన్నారు.

సమాజ్‌వాదీ వైపు ప్రపంచం చూపు:ములాయం

కర్హాల్‌ (యూపీ): ‘అమెరికా సహా ఇతర దేశాలు సైతం ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ వైపు చూస్తున్నాయి. ఇక ప్రజలే నిర్ణయించాలి. మీ ఆకాంక్షలు నెరవేరాలంటే అది మా పార్టీతోనే సాధ్యమవుతుంది. రైతులు, యువత, వ్యాపారవర్గాల సమష్టి కృషితోనే ఈ రాష్ట్రం, దేశ ప్రగతి పరిపూర్ణం అయ్యేది. ఈ మూడు వర్గాలకు మేము అండగా నిలుస్తాం’ అని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక నేత ములాయంసింగ్‌ యాదవ్‌ తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి జరుగుతున్న తాజా ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా గురువారం సమాజ్‌వాదీ వేదికపై ఈ వృద్ధనేత కనిపించారు. మూడోదశ కింద ఈ నెల 20న పోలింగు జరగనున్న కర్హాల్‌ నియోజకవర్గ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. 

నేతాజీనీ లాక్కొచ్చారు: అమిత్‌ షా విమర్శ

మైన్‌పురీ: ‘అఖిలేశ్‌ యాదవ్‌ టీవీలో మాట్లాడుతుండగా చూశా. ఎన్నికల ఫలితాలు ప్రకటించే మార్చి 10న మాత్రమే తన నియోజకవర్గమైన కరహల్‌కు వస్తానని చెప్పారు. ఆరు రోజులు తిరక్కముందే ఇక్కడ సభ పెట్టి, నేతాజీ (ములాయం)ని కూడా తీసుకువచ్చారు. ప్రారంభమే ఇలా ఉంటే.. ఇక ముగింపు ఎలా ఉంటుందో ఆలోచించండి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఓటర్లను కోరారు. సమాజ్‌వాదీ పార్టీకి గట్టి పట్టున్న కరహల్‌ నియోజకవర్గంలో గురువారం అమిత్‌ షా ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. 

తొలి రెండు దశల్లోనే 100: అఖిలేశ్‌

ఫిరోజాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలి రెండు దశల ఎన్నికల్లోనే సమాజ్‌వాదీ పార్టీ 100 స్థానాల్లో విజయం సాధించిందని, నాలుగో దశ అయ్యేసరికి ప్రభుత్వ ఏర్పాటుకు తగ్గ సంఖ్యను చేరుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ చెప్పారు. ఫిరోజాబాద్‌లో గురువారం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఫిరోజాబాద్‌ ప్రజలు ఈసారి భాజపా కళ్లు తెరిపిస్తారని చెప్పారు.

వేదికపై పడిపోయిన రాజ్‌నాథ్‌ సింగ్‌

ఫరీద్‌కోట్‌: పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో భాజపా శ్రేణుల అత్యుత్సాహంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఒకింత ఇబ్బంది పడ్డారు. గురువారం ఫరీద్‌కోట్‌లో ప్రచారానికి వచ్చిన ఆయనకు గజమాల వేసేందుకు అభిమానులు వేదికపైకి వచ్చారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో రాజ్‌నాథ్‌ సోఫాలో కూలబడ్డారు. 
కాంగ్రెస్‌లో భాగస్వామిని: మనీష్‌ తివారీ 

దిల్లీ: కాంగ్రెస్‌ను వీడి వెళ్లాలనే ఆలోచన లేదని ఆ పార్టీ ఎంపీ మనీష్‌ తివారీ మరోసారి స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌లో అద్దెకున్నవాడినేమీ కాదనీ, ఆ పార్టీలో ఒక భాగస్వామినని చెప్పారు. ఒకవేళ ఎవరో తనను బయటకు పంపాలని భావిస్తే అది వేరే విషయమన్నారు. పార్టీ కోసం 40 ఏళ్లుగా పనిచేస్తున్నాననీ, దేశ ఐక్యతకు తమ కుటుంబం రక్తం చిందించిందని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు పంజాబ్‌ మాజీ ఎమ్మెల్యే కేవల్‌సింగ్‌ ధిల్లాన్‌ను పార్టీ నుంచి బహిష్కరించడంపై తివారీ స్పందించారు. కనీసం నోటీసు ఇవ్వకుండా అలా ఉద్వాసన పలకడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. 

విద్యార్థినులకు స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు 

ఇంఫాల్‌: మణిపుర్‌ ఎన్నికల మేనిఫెస్టోను భాజపా గురువారం విడుదల చేసింది. వృద్ధాప్య పింఛను అయిదు రెట్లు పెంచి, రూ.వెయ్యి చేస్తామని హామీ ఇచ్చింది. మంచి మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, స్కూటీలు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులకు రూ.25 వేల ఆర్థికసాయం, ఏడాదికి రెండు ఉచిత సిలిండర్లు ఇస్తామని పేర్కొన్నారు.

ఆప్‌ నేతలను ఉద్దేశించే భయ్యా వ్యాఖ్యలు: చన్నీ

చండీగఢ్‌: ఎన్నికల ర్యాలీలో తాను చేసిన ‘భయ్యా’ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పంజాబ్‌ సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ వివరణిచ్చారు. తాను ఆ వ్యాఖ్యలను ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌ వాసులను ఉద్దేశించి చేయలేదని అన్నారు. తన మాటలను వక్రీకరించారని, ఆప్‌ నేతలు కేజ్రీవాల్, దుర్గేశ్‌ పాఠక్, సంజయ్‌సింగ్‌ తదితరులను దృష్టిలో ఉంచుకొని ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. పంజాబ్‌లో ఉపాధి కోసం వలస వచ్చిన వారు పంజాబ్‌ను అభివృద్ధి చేశారని చెప్పారు. వారంటే తనకు చాలా ప్రేమ, గౌరవం అని పేర్కొన్నారు. ఇటీవల ఓ ఎన్నికల సభలో ‘యూపీ, బిహార్, దిల్లీ కే భయ్యా’ అని చన్నీ వ్యాఖ్యానించారు. భయ్యా అనే పదాన్ని బిహార్, యూపీ నుంచి వలస వచ్చేవారిని అవమానించే రీతిలో వాడతారు. అంతకుముందు చన్నీ వ్యాఖ్యలపై బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ‘‘అలాంటి మాటలెవరైనా ఎలా అంటారు? పంజాబ్‌లో ఎంతమంది బిహారీలు నివసిస్తున్నారో ఆయన(చన్నీ)కు తెలుసా. ఆ రాష్ట్రానికి వారు ఎంతో సేవ చేశారు’’ అని అన్నారు. భయ్యా వ్యాఖ్యలపై బిహార్‌ కోర్టులో ఫిర్యాదు కూడా దాఖలైంది. చన్నీ వ్యాఖ్యలతో బిహార్‌లోని నివసిస్తున్న ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని ఫిర్యాదు నమోదు చేసిన సామాజిక కార్యకర్త తమన్నా హష్మీ పేర్కొన్నారు.  

చన్నీపై కోర్టులో ఫిర్యాదు

‘యూపీ, బిహార్‌ కే భయ్యా’ అంటూ పంజాబ్‌ సీఎం చన్నీ చేసిన వ్యాఖ్యలపై బిహార్‌ కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. చన్నీ వ్యాఖ్యలతో బిహార్‌లోని నివసిస్తున్న ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని ఫిర్యాదు నమోదు చేసిన సామాజిక కార్యకర్త తమన్నా హష్మీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని