PM Modi: తుదిశ్వాస దాకా వారణాసికి సేవ చేస్తా: ప్రధాని మోదీ

తాను మరణించేంత వరకూ వారణాసికి సేవ చేస్తూనే ఉంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దాన్ని తనకు దక్కే విశేష 

Published : 28 Feb 2022 10:43 IST

‘కాశీలో నా మరణం కోసం కొందరు ప్రార్థించినప్పుడు సంతోషించా’

వారణాసి: తాను మరణించేంత వరకూ వారణాసికి సేవ చేస్తూనే ఉంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దాన్ని తనకు దక్కే విశేష గౌరవంగా భావిస్తానని అన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వారణాసిలో ఆదివారం నిర్వహించిన సభలో మోదీ ప్రసంగించారు. గత ఏడాది డిసెంబరులో వారణాసిలో కాశీ విశ్వనాథ్‌ నడవాను ప్రారంభించేందుకు మోదీ వచ్చినప్పుడు.. ‘‘చరమాంకంలో ఉన్నవారే కాశీకి వస్తారు’’ అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ వ్యాఖ్యానించారు. అఖిలేశ్‌ పేరును ప్రస్తావించకుండానే.. ఆయన వ్యాఖ్యలపై తాజా సభలో మోదీ స్పందించారు. ‘‘కాశీలో నా మరణం కోసం కొందరు ప్రార్థించినప్పుడు నేను చాలా సంతోషించా. ఎందుకంటే వారణాసిగానీ, ఇక్కడి ప్రజలుగానీ నా నుంచి ఎన్నటికీ వేరు కాలేరు. వారణాసి ప్రజలకు సేవ చేస్తూ కన్నుమూస్తే.. అది నాకు విశేష గౌరవమని భావిస్తా’’ అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల నేతలు పార్టీలను తమ ప్రైవేటు వారసత్వ సంపదగా భావిస్తుంటారని మోదీ ఎద్దేవా చేశారు. అలాంటి వారు భాజపాతో ఎప్పటికీ పోటీ పడలేరని, తమది కార్యకర్తల పార్టీ అని పేర్కొన్నారు. తనకు కార్యకర్తలే విశ్వవిద్యాలయం వంటివాని, వారి నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని