Ukraine Crisis: ఉక్రెయిన్‌ నిస్సైనికీకరణకే ప్రత్యేక ఆపరేషన్‌: పుతిన్‌

ఉక్రెయిన్‌ను నిస్సైనికీకరించి, నాజీల ప్రభావం లేకుండా (డీ-నాజిఫై) చేయడానికే ప్రత్యేక చర్యను చేపట్టినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చెప్పారు. డాన్‌బాస్‌ ప్రాంతంపై ఉక్రెయిన్‌ దళాలు ఏకబిగిన గుళ్ల వర్షం కురిపిస్తుండడంతో తాము రంగంలో

Published : 06 Mar 2022 13:33 IST

మాస్కో: ఉక్రెయిన్‌ను నిస్సైనికీకరించి, నాజీల ప్రభావం లేకుండా (డీ-నాజిఫై) చేయడానికే ప్రత్యేక చర్యను చేపట్టినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చెప్పారు. డాన్‌బాస్‌ ప్రాంతంపై ఉక్రెయిన్‌ దళాలు ఏకబిగిన గుళ్ల వర్షం కురిపిస్తుండడంతో తాము రంగంలో దిగాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. ‘ప్రత్యేక ఆపరేషన్‌కు తీసుకున్న నిర్ణయం అంత సులభమైనదేమీ కాదు. డాన్‌బాస్‌ ఘర్షణను శాంతియుతంగా పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేశాం. అక్కడి ప్రజలు రష్యాభాషను స్వేచ్ఛగా మాట్లాడేందుకు, తమకు నచ్చినట్లు నివసించడానికి ఉక్రెయిన్‌ అనుమతించాలి. అలా కాకుండా ఆ ప్రాంతంపై నిషేధం విధించినట్లు చేశారు. అదే కాదు. ఉక్రెయిన్‌లోని ఒక ప్రాంతం నుంచి ఆందోళనకారులు పేలుడు పదార్థాలు నింపిన జిహాదీ కార్లతో మా సైనిక బలగాలపై దాడికి సిద్ధమవుతున్నట్లుగా గుర్తించాం. ఇంతవరకు ఇలాంటి ప్రయత్నాలేవీ ఫలించలేదు’ అని శనివారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు.

అన్నీ అనుకున్న ప్రకారమే పూర్తి

‘ఉక్రెయిన్‌పై ప్రత్యేక చర్య ఇంతవరకు ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్తోంది. అనుకున్న లక్ష్యాలను మా సైన్యం సాధిస్తుంది. ఆ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అనుకున్న రీతిలోనే అంతా అవుతోంది. సైనిక వ్యవస్థలు మొత్తాన్ని కాకపోయినా పాక్షికంగా నాశనం చేశాం. ప్రధానంగా ఆయుధాలు, పేలుడు సామగ్రి, వాయు రక్షణ వ్యవస్థల్ని ధ్వంసం చేశాం. రష్యా సహా అన్ని దేశాల్లో జాతీయవాదులు ఉంటారు. ఒక్క ఉక్రెయిన్‌లోనే వారు తమ అభిప్రాయాలను బాహాటంగా వ్యక్తం చేస్తుంటారు. ప్రభుత్వ మద్దతూ వారికి ఉంటోంది. రష్యా పౌరుల్ని చంపినవారిని హీరోలుగా చేస్తామా?’ అని పుతిన్‌ ప్రశ్నించారు. రష్యాపై ఆంక్షలు విధించడమంటే తమపై యుద్ధం ప్రకటించడంతో సమానమని అన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని