Ukraine Crisis : యుద్ధ నేరాలపై విచారణకు బ్రిటన్‌ తోడ్పాటు

ఉక్రెయిన్‌పై అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) చేపట్టే విచారణకు తోడ్పాటు అందించనున్నట్టు బ్రిటన్‌ వెల్లడించింది. 

Published : 25 Mar 2022 10:30 IST

వాషింగ్టన్, ద హేగ్‌: ఉక్రెయిన్‌పై అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) చేపట్టే విచారణకు తోడ్పాటు అందించనున్నట్టు బ్రిటన్‌ వెల్లడించింది. నిధులతో పాటు నిపుణులను కూడా సమకూర్చనున్నట్టు తెలిపింది. ద హేగ్‌లో గురువారం వివిధ దేశాల మంత్రులతో బ్రిటన్‌ ఉప ప్రధాని డొమినిక్‌ రాబ్‌ మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. రష్యా యుద్ధ నేరాలపై విచారణకు కృషి చేస్తామని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ వెల్లడించిన క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకొంది. రష్యాపై విచారణకు మేజిస్ట్రేట్లు, విచారణాధికారులు, న్యాయ నిపుణులతో పాటు... సుమారు రూ.5.20 కోట్ల నిధులు (5 లక్షల యూరోలు) కూడా సమకూర్చుతామని ఫ్రాన్స్‌ కూడా వెల్లడించింది. ఐసీసీకి బడ్జెట్‌ సమకూర్చే మూడో అతిపెద్ద దేశం ఫ్రాన్సే.

లక్ష మందికి అమెరికా ఆశ్రయం

రష్యా యుద్ధంతో ఉక్రెయిన్‌ నుంచి సుమారు 35 లక్షల మంది శరణార్థులు ప్రపంచ వ్యాప్తంగా చెదిరిపోయారని అమెరికా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే, లక్ష మంది ఉక్రెయిన్‌ శరణార్థులకు అమెరికా ఆశ్రయం ఇవ్వనుందని ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌ నుంచి వచ్చేవారికి ఆశ్రయం కల్పిస్తామని శ్వేతసౌధం వర్గాలు పదేపదే చెబుతున్నా... చాలామంది ఉక్రెయిన్‌ పొరుగు దేశాల్లో ఉండేందుకే మొ గ్గు చూపుతున్నారు. యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి ఉక్రెయిన్‌కు వెళ్లాలనే ఉద్దేశంతోనే చాలా మంది పొరుగు దేశాల్లో తలదాచుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా- వివిధ ప్రాంతాలకు తరలివెళ్లిన శరణార్థులు తాము ఎప్పుడెప్పుడు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటామా అని ఎదురు చూస్తున్నారు. యుద్ధం కొద్ది రోజులే కొనసాగుతుందని తాము అనుకున్నామని, నెల దాటినా రష్యా ఇంకా దాడులు చేస్తోందని పలువురు వాపోతున్నారు. తాము మళ్లీ తిరిగి ఎప్పుడు ఉక్రెయిన్‌ చేరుకుంటామోనని వారు దిగులు చెందుతున్నారు.

‘ఇన్ఫోసిస్‌ను రష్యాలో ఎందుకు కొనసాగిస్తున్నారు?’

లండన్‌: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునక్‌కు మీడియా నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘‘రష్యాపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న మీరు... మీ సతీమణికి వాటాలు ఉన్న ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని మాస్కోలో ఎందుకు కొనసాగిస్తున్నారు?’’ అని ఓ విలేకరి ప్రశ్నించారు. ఇందుకాయన బదులిస్తూ- తనకు ఆ సంస్థతో సంబంధం లేదన్నారు. ఆంక్షలు విధించడం ద్వారా రష్యా దూకుడును అడ్డుకోగలిగామన్నారు. రష్యాలో తమకు చెందిన చిన్నపాటి ఉద్యోగుల బృందం మాత్రమే పనిచేస్తోందని... గ్లోబల్, లోకల్‌ క్లయింట్ల కోసం వారు పనిచేస్తున్నారని ఇన్ఫోసిస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. రష్యా సంస్థలతో తమకు క్రియాశీల వాణిజ్య సంబంధాలేవీ లేవని తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని