Russia-Pakistan: గుట్టుగా పాక్, రష్యాల మధ్య లేఖల రాయబారం

పాకిస్థాన్‌ కొత్త ప్రభుత్వానికి, రష్యాకు నడుమ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి గుట్టుచప్పుడు కాకుండా పరస్పరం లేఖల రాయబారం నడిచింది.

Published : 25 Apr 2022 10:09 IST

ఉక్రెయిన్‌పై యుద్ధంతోనే గోప్యత

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ కొత్త ప్రభుత్వానికి, రష్యాకు నడుమ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి గుట్టుచప్పుడు కాకుండా పరస్పరం లేఖల రాయబారం నడిచింది. ఈ విషయాన్ని పెద్దగా ప్రచారం చేయకుండా రెండు దేశాలు  వ్యూహాత్మక మౌనం పాటించినట్లు ‘ది ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌’ పత్రిక ఆదివారం కథనాన్ని అందించింది. షెహబాజ్‌ షరీఫ్‌ పాక్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండోరోజే అభినందనలు తెలుపుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ లేఖ పంపారు. పేరు వెల్లడించవద్దని కోరిన పాకిస్థాన్‌ విదేశాంగశాఖ సీనియర్‌ అధికారి ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రష్యా అధ్యక్షుడి కార్యాలయం ఉన్న క్రెమ్లిన్‌ భవనం మాత్రం ఈ లేఖను మీడియా ద్వారా బహిర్గతం చేయడం గమనార్హం. ‘మీ పాలనలో మన దేశాల మధ్య పరస్పరం స్నేహపూర్వక, నిర్మాణాత్మక సంబంధాలు ఉన్నత శిఖరాలను చేరాలి. అఫ్గాన్‌ సర్దుబాటులో భాగస్వామ్యం, అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం వంటి అంశాల్లోనూ మనం కలిసి సాగాలి’ అని పుతిన్‌ లేఖలో కోరారు. తనకు శుభాకాంక్షలు పంపిన పుతిన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ షెహబాజ్‌ కూడా లేఖ రాశారు.

‘నో-ఫ్లై’ జాబితా నుంచి షెహబాజ్‌ పేరు తొలగింపు

పాకిస్థాన్‌ ప్రభుత్వం ‘నో-ఫ్లై’ జాబితా నుంచి దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సహా పలువురు ప్రముఖుల పేర్లను ఆదివారం తొలగించింది. రాణా సనావుల్లా అధ్యక్షతన గత వారం జరిగిన కేబినెట్‌ తొలి సమావేశం ‘ఎగ్జిట్‌ కంట్రోల్‌ లిస్ట్‌’ (ఈసీఎల్‌)ను సమీక్షించే అధికారం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖకు అప్పగించింది. అనుమతి లేకుండా దేశం వదిలి వెళ్లకూడదన్న వ్యక్తుల పేర్లు ఈ జాబితాలో ఉంటాయి. సమీక్ష అనంతరం తీసుకొన్న నిర్ణయం మేరకు.. ప్రధానితోపాటు ఆయన భార్య నుస్రత్‌ షెహబాజ్, అన్న కుమార్తె మరియం నవాజ్, మాజీ ప్రధాని షహీద్‌ ఖాకాన్‌ అబ్బాసీ, ఈయన కుమారుడు అబ్దులా ఖాకాన్, ఆర్థికమంత్రి మిఫ్తా ఇస్మాయిల్‌ల పేర్లు జాబితా నుంచి తక్షణం తొలగించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా ఈ జాబితాలో పలువురి పేర్లు చేర్చినట్లు సనావుల్లా మీడియాకు తెలిపారు. ఈ సమీక్ష ద్వారా మరో 3,500 మంది లబ్ధి పొందనున్నట్లు వెల్లడించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని