రక్షణ బంధం బలోపేతం

వివిధ రంగాల్లో కొనసాగుతున్న భారత్‌, ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించుకోవాలని, మార్గదర్శన పత్రాన్ని రూపొందించుకొని ముందుకు సాగాలని ఇరు దేశాల అగ్రనేతలు నిర్ణయించారు. రెండు దేశాల స్నేహ

Published : 06 May 2022 05:46 IST

వ్యూహాత్మక రంగాల్లో సహకారం మరింత విస్తృతం
ద్వైపాక్షిక చర్చల్లో భారత్‌ ప్రధాని, ఫ్రాన్స్‌ అధ్యక్షుడి నిర్ణయం
ముగిసిన ప్రధాని మోదీ ఐరోపా పర్యటన

పారిస్‌/దిల్లీ: వివిధ రంగాల్లో కొనసాగుతున్న భారత్‌, ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించుకోవాలని, మార్గదర్శన పత్రాన్ని రూపొందించుకొని ముందుకు సాగాలని ఇరు దేశాల అగ్రనేతలు నిర్ణయించారు. రెండు దేశాల స్నేహ బంధం ప్రపంచ శాంతికి, సుసంపన్నత్వానికి బాటలు వేయాలని ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ఆకాంక్షించారు. పారిస్‌లోని ఎలిసీ ప్యాలెస్‌లో బుధవారం రాత్రి ఇద్దరు నేతలు ముఖాముఖీ భేటీతో పాటు విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కరోనా పరిస్థితుల్లోనూ రఫేల్‌ యుద్ధ విమానాలను నిర్ణీత సమయానికి అందించిన ఫ్రాన్స్‌... రక్షణ రంగంలో మరింతగా సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమం కింద మన దేశంలో రక్షణ ఉత్పత్తుల తయారీపై కీలకమైన ముందడుగు పడినట్లు సమాచారం. ఆధునిక రక్షణ సాంకేతికతలతో పాటు అంతరిక్ష పరిశోధనలు, సముద్ర వాతావరణ ఆర్థిక వ్యవస్థ, పౌర అణు కార్యక్రమం, సౌర విద్యుత్తు, రెండు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు తదితరాలపై మోదీ, మెక్రాన్‌ల మధ్య విస్తృత స్థాయిలో చర్చలు జరిగినట్లు విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇటీవలే రెండవ సారి ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన మెక్రాన్‌ను అభినందించిన మోదీ...ఆయనను భారత పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలిపింది. మెక్రాన్‌తో చర్చలు ఫలవంతంగా జరిగినట్లు ప్రధాని మోదీ ట్వీట్‌లో వెల్లడించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల సాధన కృషిని మరింత ముందుకు తీసుకెళ్లేలా భారత్‌, ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించుకోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు సంయుక్త ప్రకటన పేర్కొంది. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపైనా ఇద్దరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఆహార సంక్షోభానికి, ఎరువుల కొరతకు ఇది దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు. పౌర మరణాలను ఖండించారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించి శాంతి చర్చలు జరపాలని రష్యా, ఉక్రెయిన్‌లకు ఆ ప్రకటనలో సూచించారు. మూడు రోజుల ఐరోపా పర్యటన అనంతరం ప్రధాని మోదీ గురువారం దిల్లీకి చేరుకున్నారు. తొలుత జర్మనీ వెళ్లిన ప్రధాని, ఆ తర్వాత డెన్మార్క్‌, ఫ్రాన్స్‌లలో పర్యటించారు.

* విద్యారంగం, పరిశోధనల్లో పరస్పర సహకారంలో భాగంగా 2025నాటికి భారత్‌కు చెందిన 20వేల మంది విద్యార్థులకు తమ విద్యాలయాల్లో ఉన్నత చదువులను అభ్యసించే అవకాశం కల్పిస్తామని ఫ్రాన్స్‌ తెలిపింది.


వడగాల్పుల్లో జననష్టం నివారించండి: ప్రధాని

దిల్లీ: దేశంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడగాల్పులు, అగ్నిప్రమాదాలతో ఎక్కడా జననష్టం జరగకుండా చూడాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. గురువారం ప్రధాని అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ), జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) అధికారులు గత మార్చి నెల నుంచి దేశంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. ప్రమాదాలు జరిగినపుడు వీలైనంత తొందరగా స్పందించాలని, ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాల తనిఖీలు తప్పనిసరిగా చేయాలని మోదీ పేర్కొన్నారు. అడవులను సైతం అగ్నిప్రమాదాల నుంచి కాపాడుకోవాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఓ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.

గోధుమల సరఫరాపై సమీక్ష

దేశంలో గోధుమల సరఫరా, నిల్వలు, ఎగుమతులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులతో సమీక్షించారు. ఆహార ఉత్పత్తుల రంగంలో భారత్‌ నమ్మదగ్గ వనరుగా మారేలా నాణ్యత ప్రమాణాలపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని