పురుషులను ‘బట్టతల’ అని పిలవడం లైంగిక వేధింపే!

పనిచేసే చోట ఏ పురుషుడినైనా ‘బట్టతల’ పేరుతో సంబోధిస్తే... అది కచ్చితంగా లైంగిక వేధింపుల కిందకే వస్తుందని ఇంగ్లండ్‌కు చెందిన ఓ ట్రైబ్యునల్‌ శుక్రవారం స్పష్టం చేసింది. వెస్ట్‌ యోర్క్‌షైర్‌ కేంద్రంగా పనిచేసే బ్రిటిష్‌ బంగ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌

Published : 14 May 2022 05:47 IST

ఈ చర్య పనిచేసేచోట వారి గౌరవాన్ని దెబ్బతీస్తుంది
ఇంగ్లండ్‌ ట్రైబ్యునల్‌ తీర్పు

లండన్‌: పనిచేసే చోట ఏ పురుషుడినైనా ‘బట్టతల’ పేరుతో సంబోధిస్తే... అది కచ్చితంగా లైంగిక వేధింపుల కిందకే వస్తుందని ఇంగ్లండ్‌కు చెందిన ఓ ట్రైబ్యునల్‌ శుక్రవారం స్పష్టం చేసింది. వెస్ట్‌ యోర్క్‌షైర్‌ కేంద్రంగా పనిచేసే బ్రిటిష్‌ బంగ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌పై... ఆ సంస్థ మాజీ ఉద్యోగి టోనీ ఫిన్‌ దావా వేశాడు. 24 ఏళ్లపాటు తాను ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ వచ్చానని, సంస్థకు చెందిన సూపర్‌వైజర్‌ తనను బట్టతల అంటూ వేధింపులకు గురిచేశాడని పేర్కొన్నాడు. తనను వివక్షకు గురిచేసి, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని కూడా పిటిషన్‌లో వివరించాడు. దీంతో తలపై జుట్టు తక్కువగా ఉందన్న కారణంగా కార్యాలయాల్లో పనిచేసే పురుషులను ‘బట్టతల’ పేరుతో పిలవడం... అవమానించడమా? లైంగికంగా వేధించడమా? అన్న అంశంపై షెఫీల్డ్‌కు చెందిన ఎంప్లాయ్‌మెంట్‌ ట్రైబ్యునల్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలల్లో వాదోపవాదాలు జరిగాయి. న్యాయమూర్తి జోనాథాన్‌ బ్రెయిన్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ట్రైబ్యునల్‌ విచారణ చేపట్టింది. కంపెనీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... బట్టతల స్త్రీ, పురుషుల్లో ఎవరికైనా ఉండవచ్చని పేర్కొన్నారు. ట్రైబ్యునల్‌ ఈ వాదనతో ఏకీభవిస్తూనే... మహిళలతో పోలిస్తే, పురుషులనే ఎక్కువగా ఈ సమస్య వేధిస్తున్నందున, దీన్ని లైంగిక వేధింపులుగా పరిగణించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ‘బట్టతల’ అని పిలవడం వల్ల వ్యక్తుల గౌరవం దెబ్బతింటుందని, ఇది వారిని భయాందోళనకు గురిచేసే చర్యేనని అభిప్రాయపడింది. బాధితుడిని వేధింపులకు గురిచేసి, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు... సదరు కంపెనీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ మొత్తాన్ని త్వరలోనే నిర్ణయిస్తామంటూ విచారణను వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని