Vande Mataram: ‘వందే మాతరం’ గేయానికి జాతీయగీతం హోదా ఇవ్వాలి

జాతీయ గీతం ‘జన గణ మన..’తో సమానమైన హోదాను ‘వందే మాతరం’ గేయానికి కల్పించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ, కేంద్ర ప్రభుత్వాలకు బుధవారం దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Published : 26 May 2022 10:55 IST

దిల్లీ హైకోర్టులో అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ పిటిషన్‌
కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు

దిల్లీ: జాతీయ గీతం ‘జన గణ మన..’తో సమానమైన హోదాను ‘వందే మాతరం’ గేయానికి కల్పించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ, కేంద్ర ప్రభుత్వాలకు బుధవారం దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై రెండు ప్రభుత్వాలు తమ వైఖరి ఏమిటో తెలపాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విపిన్‌ సంఘి, జస్టిస్‌ సచిన్‌ దత్తా ధర్మాసనం ఆదేశించింది. ఇదే అంశంపై జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్టీ) స్పందన ఏమిటో కూడా తెలియజేయాలని న్యాయస్థానం కోరింది. దేశంలోని అన్ని పాఠశాలలు, విద్యాసంస్థల్లో ప్రతి పని దినాన ‘జన గణ మన’, ‘వందే మాతరం’ గేయాలను ఆలపించేలా కూడా ఆదేశించాలని పిటిషనర్‌ అభ్యర్థించారు. హైకోర్టు విచారణకు చేపట్టక ముందే పిటిషన్‌లోని వివరాలు బహిర్గతం కావడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం ప్రచారం కోసమే పిటిషన్‌ వేశారన్న అభిప్రాయం కలుగుతుందని వ్యాఖ్యానించింది. అయితే, పిటిషనర్‌ తనకు అలాంటి ఉద్దేశంలేదని చెబుతూ జరిగిన దానిపై విచారం వ్యక్తం చేయడంతో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. జాతీయ పాట అయిన ‘వందే మాతరం’ ఆలాపనకు సంబంధించి కచ్చితమైన మార్గదర్శకాలు లేనందున వివిధ పద్ధతుల్లో పాడుతున్నారని, సినిమాల్లో, విందుల్లో దానిని దుర్వినియోగపరుస్తున్నారని బుధవారం వాదనల సందర్భంగా పిటిషనర్‌ పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్ర సముపార్జనలో ‘వందే మాతరం’ చరిత్రాత్మక పాత్ర పోషించిందని చెబుతూ ‘జన గణ మన’ గీతంతో సమాన హోదా కల్పించాలని కోరారు. రాజ్యాంగ సభ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ 1950లో చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. జన గణ మన, వందే మాతరం గేయాలకు సంబంధించి జాతీయ విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని పిటిషనర్‌ అభిప్రాయపడ్డారు. వందే మాతరం గేయాన్ని ఆలపించే ప్రతి సందర్భంలోనూ అత్యంత గౌరవ ప్రతిపత్తులతో ఆలపించుకోవాల్సి ఉందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని