విలువల తారక మంత్రం

విద్యావిధానంలో మార్పు తీసుకురావాలని ఎన్టీఆర్‌ పదేపదే అనేవారు. ‘ఎర్న్‌ అండ్‌ లెర్న్‌’ విధానం రావాలనేవారు. 

Updated : 28 May 2022 11:59 IST

క్రమశిక్షణ ఎన్టీఆర్‌ ఆరోప్రాణం

విద్యావిధానంలో మార్పు తీసుకురావాలని ఎన్టీఆర్‌ పదేపదే అనేవారు. ‘ఎర్న్‌ అండ్‌ లెర్న్‌’ విధానం రావాలనేవారు. డా.రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ ద్వారా గ్లాస్కో వంటి అంతర్జాతీయ సంస్థల్ని ఆకట్టుకున్న అంజిరెడ్డికి ఈ కొత్త విద్యావిధానం రూపకల్పన బాధ్యత అప్పగించారు. అంజిరెడ్డి.. విద్యాశాఖ కార్యదర్శి పీకే దొరస్వామి కలసి సీఎం కలలకు రూపం ఇచ్చారు. 

- ‘ఎన్టీఆర్‌తో నేను’ పుస్తకంలో మాజీ డీజీపీ హెచ్‌.జె.దొర 60 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను చూసిన ముఖ్యమంత్రులందరికీ మార్కులు వేశాను. ఎన్టీఆర్‌కు.. నీతి నిబద్ధతలో 90 మార్కులు, సంక్షేమ పథకాల అమల్లో సమర్థతకు 85 మార్కులు ఇచ్చాను.

- తన రాజకీయ ప్రస్థానంపై రాసిన పుస్తకంలో ఎన్టీఆర్‌ మంత్రివర్గ సహచరుడు హరిరామజోగయ్య  

ఎన్టీఆర్‌ చదువుకుంటూనే తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవారు. ఉదయమే సైకిల్‌పై వెళ్లి హోటళ్లకు పాలు పోసేవారు. సినిమాలతో తీరిక లేకుండా ఉన్న సమయంలో రోజుకు మూడు షిఫ్టులలో పనిచేసేవారు ఎన్టీఆర్‌. పిల్లలకు తక్కువ సమయమే కేటాయించినా దాన్ని సద్వినియోగం చేసేలా వారితో గడిపేవారు. క్రమశిక్షణ అంటే ప్రాణం పెట్టే ఆయన.. పిల్లలూ అలాగే ఉండాలనుకునేవారు. ఇంట్లో శుభకార్యాలు జరిగితే వచ్చినవారిని పలకరించడం, తీసుకెళ్లి కూర్చోబెట్టడం వంటి బాధ్యతలన్నీ పిల్లల్లో ఒక్కొక్కరికి ఒక్కోటి అప్పజెప్పేవారు. ఎన్టీఆర్‌ తెల్లవారుజామున రెండున్నరకే నిద్రలేచి దిన చర్య ప్రారంభించేవారు. పిల్లలెవరైనా పొద్దెక్కాక లేస్తే ఊరుకునేవారు కాదు. ‘సూర్యుడు ఉదయించడం మీరు చూడాలిగానీ, మీరు ఉదయించడం సూర్యుడు చూడకూడదు’ అనేవారు. నిత్యం ఇంట్లో ఉదయం 6 గంటలకల్లా పూజ జరగాలి. 

సున్నితంగానే క్రమశిక్షణ!

ఆయన ఎప్పుడూ పిల్లలపై చెయ్యెత్తడం, గట్టిగా తిట్టడం చేసేవారు కాదు. ‘ఆయనకు ఎక్కువగా కోపం వస్తే ఏం మనకు మతులు పోతున్నాయా? అనేవారు. మేం చాలా పెద్ద తప్పు చేశామన్న భావన కలిగేది. ఎప్పుడైనా మేం లైట్లు ఆపడం మర్చిపోతే నాన్న పిలిచేవారు. మమ్మల్ని ఆపాలని చెప్పేవారు కాదు. మేం చూస్తుండగానే ఆయన ఆపేసి వెళ్లేవారు. తన చర్యల ద్వారానే క్రమశిక్షణ, పొదుపు, విలువల్ని నేర్పించేవారు. భయపెట్టో, బెదిరించో నేర్పాలనుకునేవారు కాదు’ అని ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి వెల్లడించారు. ‘ఆయనతో ఎప్పుడున్నా... ఏదో ఒకటి నేర్చుకున్నామన్న భావన కలిగేలా చూసేవారు. అబిడ్స్‌లోని ఇంట్లో పెద్ద అక్వేరియం ఉండేది. అప్పుడు నాకు ఎనిమిదేళ్లు ఉంటాయేమో. ఒక రోజు అక్వేరియం దగ్గర నిలబడి చేపల్ని చూస్తుంటే... ఆయన వెనుక నుంచి వచ్చారు. గోల్డ్‌ ఫిష్‌ కనిపిస్తోందా? జెల్లీ ఫిష్‌ కనిపిస్తోందా? అని అడుగుతుంటే... నేను సమాధానం చెబుతున్నాను. అలా అడుగుతూనే ఆయన సెల్ఫిష్‌ కనిపిస్తోందా అని అడిగారు. నేను వెతుకుతుంటే ఆయన నవ్వుతూ ఒక మొట్టికాయ వేసి, అది నీలోనే ఉందేమో వెతుక్కోవాలని చెప్పారు. ‘సెల్ఫిష్‌’గా ఉండకూడదని చెప్పడానికి ఆ సందర్భాన్ని ఆయన ఉపయోగించుకున్నారు’ అని వివరించారు. 

మెతుకు కింద పడితే కళ్లకు అద్దుకుని తినాలి

ఎన్టీఆర్‌ సినీ తారగా రూ.కోట్లు సంపాదించినా పొదుపుగా ఉండేవారు. పిల్లలు భోజనం చేసేటప్పుడు ఒక్క మెతుకు కింద పడినా ఊరుకునేవారు కాదు. తీసి కళ్లకు అద్దుకుని తినమనేవారు. ఆ ఒక్క మెతుకు కోసం తాను ఎంత కష్టపడుతోందీ చెప్పేవారు. పళ్లెంలో వడ్డించుకుని తినకుండా వదిలేయడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. బజారు నుంచి ఏమైనా తీసుకురమ్మని పనివాళ్లకు పురమాయిస్తే... తిరిగొచ్చాక బిల్లుతో సహా ప్రతి పైసాకూ లెక్క అడిగేవారు. వారికి ఏదైనా అవసరం ఉంటే విడిగా డబ్బులు ఇవ్వమనే వారే తప్ప.. లెక్క కచ్చితంగా ఉండాలనేవారు.

బసవతారకం బోరున ఏడ్చేశారు

1983 ఎన్నికలకు ముందు ఎన్టీఆర్‌ చైతన్యరథంపై విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ఆయన కుమారులు బాలకృష్ణ, రామకృష్ణల వివాహమైంది. ఎన్నికల బిజీలో బాలకృష్ణ, రామకృష్ణల పెళ్లిళ్లకు ఆయన హాజరు కాలేదు. ఫోన్‌లోనే ఆశీర్వదించారు. ఆ వివాహాలు పూర్తయ్యాక.. బసవతారకం ఆయనను చూడాలనుకున్నారు. నెల్లూరు వస్తున్నారని తెలిసి పురందేశ్వరిని వెంటబెట్టుకుని వెళ్లారు. షెడ్యూల్‌ ప్రకారం ఆయన మధ్యాహ్నం 2 గంటలకు రావాల్సి ఉండగా రాత్రి 11కు వచ్చారు. సరిగ్గా భోజనం, విశ్రాంతి లేక బాగా అలసిపోయి ఉన్నారు. బాగా నల్లబడిపోయారు. ఆయనను చూడగానే బసవతారకం బోరున ఏడ్చేశారు. మనకు రాజకీయాలు వద్దు... మద్రాసు వెళ్లిపోదాం అన్నారు. ఎన్టీఆర్‌ ఆమెకు నచ్చజెప్పారు.

పిల్లల ఆసక్తుల్ని బట్టే చదువులు

ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు 12 మంది సంతానం. 8 మంది కుమారులు, నలుగురు కుమార్తెలు. పెద్ద కుమారుడు రామకృష్ణ చిన్న వయసులోనే మరణించారు. ఆయనపై ప్రేమతో... ఎన్టీఆర్‌ తన స్టూడియోకు, థియేటర్‌కు, ఇతర సంస్థలకు ఆయన పేరే పెట్టారు. పిల్లల ఆసక్తుల్ని బట్టి చదువులు నిర్ణయించుకునే వెసులుబాటు ఇచ్చేవారు ఎన్టీఆర్‌. పెద్ద కుమార్తెను డాక్టర్‌ చేయాలని, పురందేశ్వరిని ఐఏఎస్‌ చదివించాలని, భువనేశ్వరిని లాయర్‌ను చేయాలని అనుకునేవారు. ఆయన అనుకున్నట్టే పెద్దమ్మాయి డాక్టరయ్యారు. పురందేశ్వరి బీఏ లిటరేచర్‌ చదివారు. ఆమెకు నాట్యంపై ఆసక్తి ఉందని తెలుసుకుని కూచిపూడి, భరతనాట్యం నేర్పించారు. ఎన్టీఆర్‌ సినిమాలు చూసి బాలకృష్ణ అనుకరిస్తుండటంతో నటనలో ఆసక్తి ఉందని గమనించి, ఆ రంగంలోకి తీసుకొచ్చారు.

పనివాళ్లయినా గౌరవించాల్సిందే!

ఇంట్లో పనివాళ్లనూ ఎన్టీఆర్‌ గౌరవంగా చూసుకునేవారు. తన పిల్లలూ అలాగే ఉండాలని కోరుకునేవారు. ‘మమ్మల్ని రోజూ స్కూల్‌కు తీసుకెళ్లి, తీసుకొచ్చేందుకు కృష్ణ అని ఒక డ్రైవర్‌ ఉండేవారు. మేం స్కూల్‌ నుంచి రాగానే.. కృష్ణకు థ్యాంక్స్‌ చెప్పారా? అని అడిగేవారు. అతను చేసిన పనికి జీతం ఇస్తున్నాం కదా.. మళ్లీ థ్యాంక్స్‌ దేనికి అని పిల్లలు అడిగితే వారిని మందలించేవారు. ‘అతనికి జీతం ఇస్తోంది నేను. మీరు కాదు కదా. అతను మీకు సర్వీస్‌ చేసినందుకు థ్యాంక్స్‌ చెప్పాల్సిందే’ అనేవారు.

బ్లూ బుక్‌ నిబంధనలు మార్చాల్సి వచ్చింది..

ఎన్టీఆర్‌ ప్రజల్లోకి ఎప్పుడు వచ్చినా జనం పోటెత్తేవారు. ఆయనకు భద్రత కల్పించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది. ‘పోలీసు శాఖ బ్లూ బుక్‌లోని నిబంధనల ప్రకారం జనసమీకరణ బాగా ఉండే ప్రధానమంత్రి సభలకు మాత్రమే ప్రత్యేక పోలీసులు బందోబస్తు ఇస్తుండేవాళ్లు. ముఖ్యమంత్రికి కూడా అదే స్థాయిలో బందోబస్తు ఇవ్వాల్సిన సందర్భం అంతవరకూ ఏర్పడలేదు. ఎన్టీఆర్‌ వచ్చాక బ్లూ బుక్‌ నిబంధనలే మార్చుకోవాల్సి వచ్చింది. సీఎంకు ముఖ్య భద్రతాధికారి ఒకరే ఉండేవారు. ఎన్టీఆర్‌ వచ్చాకే వారి సంఖ్య పెంచాల్సి వచ్చింది’ అని ఎన్టీఆర్‌తో అనుబంధంపై రాసిన పుస్తకంలో మాజీ డీజీపీ హెచ్‌.జె.దొర పేర్కొన్నారు.

రాజకీయ నియామకాలకు చెల్లు చీటీ 

విశ్వవిద్యాలయాలు, సంస్థలు, కార్పొరేషన్లకు వీసీలు, ఛైర్మన్లు వంటి పోస్టులను రాజకీయ నాయకులకు ఇచ్చే సంస్కృతికి ఎన్టీఆర్‌ చరమగీతం పాడారు. విద్యావేత్తలు, ఆయా రంగాల్లో నిపుణులకే పదవులు కట్టబెట్టేవారు. 

* కాన్పుర్‌ ఐఐటీలో పనిచేసిన దయారత్నాన్ని హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ వీసీగా, విశిష్ట విద్యావేత్తగా పేరొందిన నవనీతరావును ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా నియమించారు. 

ఓపెన్‌ యూనివర్సిటీకి వైస్‌ఛాన్స్‌లర్‌గా ఆర్‌.వి.ఆర్‌.చంద్రశేఖరరావును, ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా ప్రొఫెసర్‌ వెంకటస్వామిని అలాగే ఎంపిక చేశారు. 

అమెరికాలో ప్రఖ్యాత రేడియాలజిస్ట్‌గా ఉన్న కాకర్ల సుబ్బారావును తీసుకొచ్చి నిజాం ఆర్థోపెడిక్‌ ఆస్పత్రి బాధ్యతలు అప్పగించారు. ఆయన హయాంలోనే అది ‘నిమ్స్‌’ గా మారింది.

మతఘర్షణలపై ఉక్కుపాదం

ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చే వరకు హైదరాబాద్‌ పాతబస్తీ తరచూ మతకలహాలు, అల్లర్లు, అలజడులు, కర్ఫ్యూలతో అట్టుడికిపోయేది. అమాయకులు బలయ్యేవారు. ఆస్తులు ధ్వంసమయ్యేవి. కొన్ని పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం మతకలహాల్ని ప్రేరేపించేవన్న  ఆరోపణలుండేవి. ఎన్టీఆర్‌ పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, పాతబస్తీలో అల్లర్లను ఉక్కుపాదంతో అణచివేశారు. ‘నిజాయతీ, నిబద్ధత, సమర్థత కలిగిన పోలీసు అధికారుల్ని గుర్తించి, మతఘర్షణల్ని అణచివేసే బాధ్యత వారికి అప్పగించేవారు. వారి విధుల్లో జోక్యం చేసుకునేవారు కాదు. అందువల్లే ఎన్టీఆర్‌ హయాంలో హైదరాబాద్‌లో మతఘర్షణలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి’ అని అప్పట్లో హైదరాబాద్‌లో పనిచేసిన మాజీ డీజీపీ జె.వి.రాముడు తెలిపారు. ‘నేను గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు ఒక ఎస్సైపై కొంత మంది దాడి చేశారు. దానిలో ప్రమేయం ఉందన్న అనుమానంతో ఎన్టీఆర్‌ సమీప బంధువు ఒకర్ని అరెస్ట్‌ చేశారు. అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్‌ గుంటూరు పర్యటనకు వచ్చినప్పుడు అతని తల్లి వచ్చి అరెస్టు విషయంపై ఫిర్యాదు చేశారు. ఇంకెవరైనా అయితే.. ఎస్పీని తప్పుపట్టడమో, మందలించడమో చేస్తారు. ఎన్టీఆర్‌ మాత్రం నా వైపు తిరిగి ‘మీరు అరెస్ట్‌ చేసిన పిల్లాడికి 30 ఏళ్లుగా మతిస్థిమితం లేదు. అతణ్ని చూపించని ఆస్పత్రి లేదు. దయచేసి అన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకోండి’ అని విన్నవింపుగా చెప్పారు’’ అని రాముడు వెల్లడించారు. 

వివాదాస్పద నిర్ణయాలు, సంచలనాలు 

ఎన్టీఆర్‌ భోళామనిషి. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు నిపుణులతో ఒకటికి రెండుసార్లు చర్చించేవారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే మిన్నువిరిగి మీదపడ్డా వెనకడుగు వేసేవారు కాదు. ఆఘమేఘాల మీద దాన్ని అమలు చేయాలని చూడటంతో  కొన్నిసార్లు వివాదాస్పదమయ్యేవి. 

* ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చేసరికి శాసనమండలిలో కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ ఉండేది. ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా మండలి తిరస్కరించేది. విసిగిపోయిన ఎన్టీఆర్‌ మండలి రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. సాహిత్య, సంగీత, నాటక అకాడమీల రద్దూ ఇలాగే వివాదాస్పదమైంది. 

యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వోద్యోగుల పదవీవిరమణ వయసు 58 నుంచి 55 ఏళ్లకు తగ్గించడంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 

ఉద్యోగులకు పీఆర్సీ అమలులోనూ వివాదం ఏర్పడి 50 రోజులకుపైగా సమ్మె చేశారు. కొందరు ఉద్యోగులు సీఎం ఛాంబర్‌లోకి చొరబడి ఎన్టీఆర్‌పై దాడికి ప్రయత్నించడం సంచలనమైంది. 

1989-90 బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించాక.. శాసనసభలో ప్రవేశపెట్టకముందే దానిలో కొన్ని కేటాయింపు వివరాలు లీకయ్యాయి. దాన్ని వ్యవస్థాగత క్రమశిక్షణ రాహిత్యంగా భావించిన ఎన్టీఆర్‌ మొత్తం 31 మంది మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకున్నారు.

భయం.. అభయం 

మంత్రివర్గ సహచరులు, ఉద్యోగులకు ఆయనంటే సింహస్వప్నం. ఎంత గంభీరంగా ఉండేవారో, అంతే ప్రేమ, ఆప్యాయత చూపేవారు. కష్టసుఖాలు పంచుకునేవారు. అతిథులొస్తే కొసరి కొసరి వడ్డించేవారు..

వాచకాలు మార్పించారు

పాఠశాల విద్యలో ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రాథమిక వాచకాల్ని మార్పించారు. ఆ తెలుగు పుస్తకాలకు తెలుగు భారతి అని స్వయంగా పేరు పెట్టడమే కాదు.. ప్రతి తరగతి వాచకానికీ ముందు మాట కూడా రాశారు. 

తెలుగు, తమిళం నేర్పించారు

ఎన్టీఆర్‌ పిల్లలు చెన్నైలోని మిషనరీ స్కూల్‌లో ఆంగ్ల మాధ్యమంలో చదివేవారు. వారికి హిందీ ద్వితీయ భాషగా ఉండేలా చూశారు. కానీ మాతృభాష తెలుగు నేర్చుకోవాల్సిందేనంటూ ఇంట్లో ప్రత్యేకంగా ఒక టీచర్‌ను పెట్టారు. తమిళనాడు తనకు ఆశ్రయమిచ్చిందని, దానికి కృతజ్ఞతగా తమిళం నేర్చుకోవాలని... పిల్లలకు అదీ నేర్పించారు.

వంటవాళ్లు చేస్తే గుర్తుపట్టేసేవారు!

బసవతారకం వంటలు బాగా చేసేవారు. ఆమె చేసే వంటలంటే ఎన్టీఆర్‌కు ప్రాణం. ఏ రోజైనా ఆమె కాకుండా, వంటవాళ్లు వంట చేస్తే రుచిని బట్టి ఎన్టీఆర్‌ గుర్తించేవారు. ఆయన ముఖ్యమంత్రయ్యాకా మధ్యాహ్నం పూట బసవతారకం క్యారేజీ తీసుకుని సచివాలయానికి వెళ్లేవారు. 

క్రమశిక్షణకు మారుపేరు 

ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రయ్యాక కూడా తెల్లవారుజామున 2.30కే నిద్ర లేచేవారు. వ్యాయామం, యోగాసనాలు, పూజ పూర్తయ్యాక 4.40- 4.45 మధ్య భోజనం పూర్తి చేసేవారు. ఐదు గంటలకల్లా కార్యాలయంలో సిద్ధంగా ఉండేవారు. ఏదైనా మాట్లాడాలనుకుంటే కుటుంబసభ్యులూ ఆ సమయంలోనే కలవాలి. ఉదయం ఆరు గంటల నుంచే అధికారిక కార్యకలాపాలు మొదలయ్యేవి. 10 గంటలకల్లా సచివాలయానికి చేరుకునేవారు. 

ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన మరికొన్ని ముఖ్యమైన పథకాలు, కార్యక్రమాలు 


తెలుగు గ్రామీణ క్రాంతిపథం
తెలుగు గిరిజన మాగాణ సమారాధన
తెలుగు మహిళా బహిర్భూమి పథకం
ఇంటింటా దీపం 
చెట్టు - పట్టా పథకం
తెలుగుబాల - మహిళా ప్రగతి ప్రాంగణం
ప్రగతిపథం   
తెలుగు శ్రమదళం
పల్లె పల్లెకూ బస్సు
తెలుగు బాలల క్షీర సంక్షేమ పథకం
సొంత రిక్షా పథకం
సంచార న్యాయస్థానం  
విముక్తి
ప్రసూతి సహాయ పథకం
సంచార శిశు సంరక్షణాలయాల పథకం
యువశక్తి పథకం  
రైతుబంధు పథకం

ఒకసారి నిఘా విభాగం వారు వచ్చి ఆయన వాడుతున్న కారు పికప్‌ బాలేదని, మార్చాలని చెప్పారు. నేను కూడా కొత్త కారు కొందామన్నాను. ఆయన డబ్బు వృథా అని అంగీకరించలేదు. ముఖ్యమంత్రి కార్యాలయ భవనం ఆధునికీకరణకూ రూపాయి ఖర్చు పెట్టలేదు. సామాన్యుల విషయంలో మాత్రం ఖర్చు రూ.వెయ్యి కోట్లవుతుందన్నా... పోనివ్వండి అనేవారు’ 

తెలుగు గంగతో చెన్నై గొంతు తడిపారు.. 

తమిళనాడు రాజధాని చెన్నైకి తాగునీరు, రాయలసీమ జిల్లాలకు సాగునీరు సరఫరా చేసేందుకు ‘తెలుగుగంగ’ పథకానికి రూపకల్పన చేశారు. రూ.600 కోట్ల ఖర్చుతో గాలేరు-నగరి గ్రావిటీ కెనాల్‌ ప్రాజెక్టుకు, అనంతపురం జిల్లాలో లక్ష ఎకరాలకు నీరందించేందుకు హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఎన్టీఆర్‌ శంకుస్థాపన చేశారు. వంశధార, శ్రీరామ్‌సాగర్‌ ఫేజ్‌-2 వంటి పలు సాగునీటి ప్రాజెక్టుల్నీ చేపట్టారు. 

అసెంబ్లీలో భీషణ ప్రతిజ్ఞ

ఎన్టీఆర్‌కు సన్నిహితుడైన జమ్మలమడుగు ఎమ్మెల్యే శివారెడ్డి 1993 ఆగస్టు 7న బాంబుదాడిలో చనిపోయారు. ఆయన హత్యపై సిటింగ్‌ జడ్జితో విచారణ జరపాలని ఎన్టీఆర్‌ అసెంబ్లీలో పట్టుబట్టారు. తెదేపా ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఎన్టీఆర్‌ సహా తెదేపా ఎమ్మెల్యేలందర్నీ స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించనందుకు, తాను సీట్లోనే కూర్చున్నా అకారణంగా సస్పెండ్‌ చేసినందుకు శాసనసభను బహిష్కరిస్తున్నానని ఎన్టీఆర్‌ ప్రకటించారు. ఈ ప్రభుత్వం అధికారంలో ఉండగా మళ్లీ సభలో అడుగుపెట్టనని శపథం చేసి, మాట నిలబెట్టుకున్నారు. 

నికార్సయిన లౌకికవాది

ఎన్టీఆర్‌ నికార్సయిన లౌకికవాది. హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆయన ముస్లిం టోపీ ధరించి, ఉర్దూలో ప్రసంగించారు. సారే జహాసే అచ్ఛా.. ఆలపించారు. 

* హైదరాబాద్‌లోని నిజాం ఆర్థోపెడిక్‌ ఆస్పత్రిని మొదటి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చినప్పుడు పేరు మార్చమని కొందరు సూచించినా ఎన్టీఆర్‌ అంగీకరించలేదు. 

స్వర్ణదేవాలయంపై సైనిక చర్యను తీవ్రంగా ఖండించారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత దేశవ్యాప్తంగా సిక్కులపై దాడులు జరుగుతుండగా జంటనగరాల్లో మాత్రం వారిపై ఈగ వాలకుండా చూసుకున్నారు. 

అమెరికాలోని స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ తరహాలో రాజధానిలో ఒక విగ్రహం ఉండాలని భావించి, హుస్సేన్‌సాగర్‌ జలాశయంలో సమతామూర్తి బుద్ధుడి ఏకశిలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  

అభిమానధనుడు 

అభిమానులన్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్నా ఎన్టీఆర్‌కి ఎంతో ప్రేమ, అభిమానం. సినీతారగా ఆయనకున్న 600కి పైగా అభిమాన సంఘాలు పార్టీ ఏర్పడిన తొలినాళ్లలో క్రియాశీలక పాత్ర పోషించాయి. నెల్లూరు జిల్లాకు చెందిన తాళ్లపాక రమేష్‌రెడ్డి ఎన్టీఆర్‌ వీరాభిమాని. దిల్లీలో ఉన్న ఎన్టీఆర్‌.. ఆయన పెళ్లి కోసం నెల్లూరు చేరుకునేసరికి మధ్యాహ్నం 1.30 గంటలైంది. ముహూర్తం ఉదయం 7.20కే అయినా, ఎన్టీఆర్‌ వచ్చిన తర్వాతే రమేష్‌రెడ్డి తాళి కట్టారు. తర్వాత ఆయన తెదేపా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి కూడా అయ్యారు. కమలాపురానికి చెందిన బాషా అనే అభిమాని ఎన్టీఆర్‌ వస్తేనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి... నిశ్చితార్థమయ్యాక నాలుగేళ్లు నిరీక్షించి, వివాహం చేసుకున్నారు. గుంటూరుకు చెందిన సాంబయ్య అనే మరో అభిమానికి రేషన్‌ దుకాణం కేటాయించమని ఆర్డీవోకి సీఎం హోదాలో ఎన్టీఆర్‌ స్వయంగా సిఫారసు లేఖ రాసిచ్చారు. - ఎన్టీఆర్‌ దగ్గర కార్యదర్శిగా పనిచేసిన జయప్రకాశ్‌ నారాయణ  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని