Published : 23 Jun 2022 05:59 IST

సాయుధ బలగాలను బలహీనపరుస్తోంది

 భాజపా సర్కారుపై రాహుల్‌గాంధీ మండిపాటు

అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

దిల్లీ: అగ్నిపథ్‌ పథకంతో దేశ సాయుధ బలగాలను బలహీనపరుస్తోందంటూ భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తరహాలోనే ఈ పథకాన్ని కూడా ప్రధాని మోదీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గతంలో ‘ఒకే ర్యాంకు, ఒకే పింఛను’ గురించి మాట్లాడిన కమలనాథులు ఇప్పుడు ర్యాంకులు, పింఛన్లేవీ ఇవ్వడం లేదంటూ చురకలంటించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఐదు రోజులపాటు రాహుల్‌ను ప్రశ్నించిన నేపథ్యంలో ఆయనకు సంఘీభావం తెలిపేందుకుగాను దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు దిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయానికి బుధవారం భారీగా తరలివచ్చారు. వారిని ఉద్దేశించి రాహుల్‌ ప్రసంగించారు. ‘‘ఈడీ నన్ను ప్రశ్నించిన వ్యవహారం ముఖ్యమైనదేమీ కాదు. ఇప్పుడు అత్యంత కీలకమైనవి- ఉద్యోగాలు. దేశానికి వెన్నెముకలాంటి చిన్న, మధ్యతరహా పరిశ్రమలను మోదీ సర్కారు నాశనం చేసింది’’ అని పేర్కొన్నారు. ఉపాధి కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ప్రస్తుతం అగ్నిపథ్‌తో యువతను మళ్లీ మోసం చేస్తోందని విమర్శించారు. ఈ పథకంలో భాగంగా సైన్యంలో చేరినవారికి తర్వాత ఉద్యోగాలేవీ దొరకవని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సైన్యాన్ని బలోపేతం చేయడానికి బదులు బలహీనపరుస్తోందని ఆరోపించారు.

అప్పుడు నేనేమీ ఒంటరిగా లేను

ఈడీ తనను ప్రశ్నిస్తున్నప్పుడు తానేమీ ఒంటరిగా లేనని.. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలంతా తనవెంటే ఉన్నట్లనిపించిందని రాహుల్‌ పేర్కొన్నారు. తనను ప్రశ్నించిన గదిలో వారందరి స్ఫూర్తి నిండి ఉన్నట్లు తోచిందని వ్యాఖ్యానించారు. ‘‘అధికారులు నా ఓపిక వెనుక రహస్యమేంటని అడిగారు. అప్పుడు వారికి నేను సమాధానం చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నా వినండి. 2004 నుంచి నేను కాంగ్రెస్‌లో పనిచేస్తున్నా. మన పార్టీ నేతల్లోనే ఓపిక ఉంది. సచిన్‌ పైలట్‌, సిద్ధరామయ్య, రణదీప్‌ సుర్జేవాలా వంటి నేతలు అందుకు ఉదాహరణ. కాంగ్రెస్‌ కార్యకర్తలెవరూ అలసిపోరు. ఎన్నటికీ భయపడరు కూడా’’ అని రాహుల్‌ పేర్కొన్నారు. అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 27న దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ చెప్పారు.

Read latest Related stories News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని