Maldives: మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్‌.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!

మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. చివరి బ్యాచ్‌ స్వదేశానికి బయల్దేరినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి ఓ వార్తాసంస్థకు వెల్లడించారు.

Published : 10 May 2024 22:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాల్దీవుల (Maldives) నుంచి భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. చివరి బ్యాచ్‌ స్వదేశానికి బయల్దేరినట్లు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు కార్యాలయం అధికార ప్రతినిధి ఓ వార్తాసంస్థకు వెల్లడించారు. భారత బలగాలు మే 10నాటికి వెనక్కి వెళ్లిపోవాలని ముయిజ్జు గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికి ఒకరోజు ముందే భారత సిబ్బంది తిరుగుపయనమైనట్లు సమాచారం.

అక్కడ హెలికాప్టర్‌ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన సైనిక సిబ్బంది తొలి విడతగా మార్చి రెండో వారంలో స్వదేశానికి పయనమయ్యారు. ఏప్రిల్‌లో రెండో బ్యాచ్‌ వెనక్కు వచ్చేసింది. అయితే.. మొత్తం ఎంతమంది సిబ్బంది వెళ్లిపోయారో మాల్దీవులు వెల్లడించలేదు. మొత్తం 89 మంది భారతీయ సైనికులు తమ దేశంలో ఉన్నట్లు గతంలో అధికార దస్త్రాలను ఉటంకిస్తూ తెలిపింది. మొదటి, రెండో విడతలో 51 మంది వెళ్లిపోయినట్లు పేర్కొంది.

మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు

మహమ్మద్‌ ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. తమ దేశంలో విధులు నిర్వర్తిస్తోన్న భారత బలగాలు మే 10నాటికి వెనక్కి వెళ్లిపోవాలని ఆయన సూచించారు. ఆ తర్వాత ఆ దేశానికి చెందిన ఒక్క మిలిటరీ సిబ్బంది కూడా తమ భూభాగంలో ఉండకూడదన్నారు. అయితే.. తమ బలగాల స్థానంలో సమర్థులైన సాంకేతిక సిబ్బందిని నియమించేందుకు దిల్లీ పెట్టిన షరతును మాలే అంగీకరించింది. దీంతో ఇప్పటికే భారత సాంకేతిక బృందం ఆ దీవులకు చేరుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు