బ్రిజ్‌ భూషణ్‌కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం

మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ (Brij Bhushan)పై అభియోగాలు మోపాలని దిల్లీ కోర్టు ఆదేశించింది.

Published : 10 May 2024 22:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ (Brij Bhushan)కు ఎదురుదెబ్బ తగిలింది. మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణల కేసులో ఆయనపై అభియోగాలు మోపాలని దిల్లీ కోర్టు ఆదేశించింది.  అందుకు తగిన ఆధారాలు రికార్డుల్లో ఉన్నాయని స్పష్టంచేసింది. తాజా పరిణామంతో ఆయనను పోలీసులు విచారించే అవకాశం ఉంది.

మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణల కేసుకు సంబంధించి బ్రిజ్‌ భూషణ్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆయనపై గతేడాది జూన్‌లోనే పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. అందులో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ అభియోగాలకు సంబంధించి తగిన అంశాలు ఉన్నాయని దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు వెల్లడించింది. ఐదుగురు బాధితులు చేసిన ఆరోపణలపై అభియోగాలు మోపాలని ఆదేశించగా.. ఓ మహిళ కేసులో మాత్రం అతడికి మినహాయింపు ఇచ్చింది.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో భాజపా (BJP) టికెట్‌ నిరాకరించిన విషయం తెలిసిందే. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కైసర్‌గంజ్‌ స్థానంలో ఆయన కుమారుడు కరణ్‌ భూషణ్‌సింగ్‌ను బరిలోకి దింపింది. ఈ ప్రకటనపై ప్రముఖ రెజ్లర్‌, ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్‌ (Sakshee Malikkh) సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తూ భావోద్వేగభరిత పోస్ట్‌ పెట్టారు. ఈ దేశ ప్రభుత్వం అంత బలహీనంగా ఒక్క వ్యక్తి ముందు లొంగిపోయిందా?అని నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని