T20 World Cup: రోహిత్‌, రాహుల్‌ దంచేశారు..

టీమ్‌ఇండియా లక్ష్మీ బాంబులా పేలింది. టీ20 ప్రపంచకప్‌లో గత రెండు మ్యాచ్‌ల్లోనూ తుస్సుమనిపించిన జట్టు.. అఫ్గానిస్థాన్‌తో పోరులో మోత మోగించింది. హండ్రెడ్‌ వాలాలా ఓపెనర్లు క్రీజులో ఎక్కువ సేపు నిలబడి బ్యాట్లతో పరుగుల వెలుగులు పంచగా.

Updated : 04 Nov 2021 06:42 IST

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి విజయం
అఫ్గానిస్థాన్‌ చిత్తు
అబుదాబి

టీమ్‌ఇండియా లక్ష్మీ బాంబులా పేలింది. టీ20 ప్రపంచకప్‌లో గత రెండు మ్యాచ్‌ల్లోనూ తుస్సుమనిపించిన జట్టు.. అఫ్గానిస్థాన్‌తో పోరులో మోత మోగించింది. హండ్రెడ్‌ వాలాలా ఓపెనర్లు క్రీజులో ఎక్కువ సేపు నిలబడి బ్యాట్లతో పరుగుల వెలుగులు పంచగా.. చిచ్చుబుడ్లలా పాండ్య, పంత్‌ చివర్లో మెరుపులు విరజిమ్మారు. ఇక బౌలింగ్‌లో షమి తారజువ్వలా దూసుకెళ్లగా.. భూ చక్రం లాంటి బంతులతో అశ్విన్‌ ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పట్టాడు. మొత్తం మీద ఈ విజయంతో.. గాలిలో దీపంలా మిణుమిణుకుమంటున్న సెమీస్‌ ఆశను కోహ్లీసేన సజీవంగా ఉంచుకుంది. భారత్‌ తన తర్వాతి మ్యాచ్‌లో శుక్రవారం స్కాట్లాండ్‌తో తలపడుతుంది.

ఎట్టకేలకు టీమ్‌ఇండియాకు ఓ విజయం. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో సెమీఫైనల్‌ అవకాశాలను అతి క్లిష్టం చేసుకున్న కోహ్లీసేన.. బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌పై ఘనవిజయం సాధించింది. రోహిత్‌ (74; 47 బంతుల్లో 8×4, 3×6), రాహుల్‌ (69; 48 బంతుల్లో 6×4, 2×6)ల అదిరే ఓపెనింగ్‌ భాగస్వామ్యానికి.. హార్దిక్‌ పాండ్య (35 నాటౌట్‌; 13 బంతుల్లో 4×4, 2×6), రిషబ్‌ పంత్‌ (27 నాటౌట్‌; 13 బంతుల్లో 1×4, 3×6)ల మెరుపు ముగింపు తోవడంతో మొదట భారత్‌ 2 వికెట్లకు 210 పరుగులు చేసింది. టోర్నీలో 200 చేసిన తొలి జట్టు టీమ్‌ ఇండియానే. ఛేదనలో అఫ్గానిస్థాన్‌ తేలిపోయింది. 7 వికెట్లకు 144 పరుగులే చేయగలిగింది. అశ్విన్‌ (2/14) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. షమి మూడు వికెట్లు పడగొట్టాడు. జనత్‌ (42 నాటౌట్‌; 22 బంతుల్లో 3×4, 2×6) టాప్‌ స్కోరర్‌. రోహిత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. భారత్‌ సెమీఫైనల్‌ రేసులో ఉండాలంటే మిగతా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గాలి. న్యూజిలాండ్‌ ఒక్క మ్యాచన్నా ఓడాలి. స్కాట్లాండ్‌, నమీబియాలపై గెలవడం భారత్‌కు కష్టమేం కాదు. కానీ కివీస్‌ ఓడాలంటే అద్భుతమే జరగాలి. ఆ జట్టు ఆడాల్సింది నమీబియా, అఫ్గానిస్థాన్‌లతో మరి.

తేలిపోయిన అఫ్గాన్‌: ఛేదనలో అఫ్గానిస్థాన్‌ చేతులెత్తేసింది. ఏమాత్రం ప్రతిఘటించలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు ఏ దశలోనూ బ్యాట్‌ ఝుళిపించలేకపోయింది. అఫ్గాన్‌ 20 ఓవర్లూ బ్యాటింగ్‌ చేసినా భారత్‌ విజయం చాలా ముందే ఖరారైంది. మూడో ఓవర్లో ఓపెనర్‌ షెజాద్‌ (0)ను షమి వెనక్కి పంపడంతో అఫ్గాన్‌ పతనం ఆరంభమైంది.  తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్‌ జజాయ్‌ (13)ను బుమ్రా ఔట్‌ చేశాడు. దూకుడుగా కనిపించిన గుర్బాజ్‌ (19)ను జడేజా ఔట్‌ చేశాడు. ఇక రాక రాక వచ్చిన అవకాశాన్ని అశ్విన్‌ అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. అతణ్ని ఎదుర్కోవడం అఫ్గాన్‌ బ్యాట్స్‌మెన్‌కు చాలా కష్టమైపోయింది. అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన అశ్విన్‌.. తన వరుస ఓవర్లలో నైబ్‌ (18), నజిబుల్లా జద్రాన్‌ (11)ను ఔట్‌ చేయడంతో అఫ్గాన్‌ 12వ ఓవర్లో   69/5తో నిలిచింది. ఆ దశలో నబి (35), జనత్‌ నిలబడ్డారు. ఆరో వికెట్‌కు     57 పరుగులు జోడించారు. కానీ వారి ఆట ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే. జనత్‌ ఆఖరి వరకు నిలబడ్డాడు.

ఓపెనర్లు అదరహో...: రెండు ఓటములతో ఇప్పటికే సెమీఫైనల్‌ అవకాశాలు అత్యంత క్లిష్టంగా మారి, భారత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితి ఉండగా.. కోహ్లి ముచ్చటగా మూడోసారి టాస్‌ కోల్పోయాడు. ఇంకేముందు మూడోసారి కూడా మొదట బ్యాటింగ్‌కు దిగాల్సివచ్చింది. చిన్న జట్టే అయినా.. తేలిగ్గా తీసుకోదగ్గ జట్టయితే కాదు అఫ్గానిస్థాన్‌. తనదైన రోజైన ఏ జట్టుకైనా షాకిచ్చే సత్తా ఆ జట్టుకు ఉంది. అయితే ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ ఆత్మవిశ్వాసంతో ఆడారు. విపరీతంగా బాదేయడానికి ప్రయత్నించలేదు కానీ.. చక్కగా, సాధికారికంగా బ్యాటింగ్‌ చేశారు. స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ, వీలైనప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును నడిపించారు. పిచ్‌ కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లోలా బ్యాటింగ్‌కు కష్టంగా లేదు.  రోహిత్‌ ఓ ఫోర్‌, రాహుల్‌ వరుసగా 6, 4 కొట్టడంతో షరాఫుద్దీన్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో 16 పరుగులొచ్చాయి. ముచ్చటైన షాట్లతో అలరించిన రోహిత్‌.. నవీనుల్‌ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ కొట్టాడు. 10 ఓవర్లకు భారత్‌స్కోరు 85/0 కాగా.. రోహిత్‌ 32 బంతుల్లో 44, రాహుల్‌ 22 బంతుల్లో 40 చేశారు. ఇన్నింగ్స్‌ ద్వితీయార్ధంలో పరుగుల వేగం పెరిగింది. ఓపెనర్లిద్దరూ గేర్లు మార్చేశారు. నవీనుల్‌ బౌలింగ్‌లో రోహిత్‌ రెండు ఫోర్లు, రాహుల్‌ ఓ సిక్స్‌ బాదేశారు. నైబ్‌ ఓవర్లో రాహుల్‌ రెండు ఫోర్లు కొట్టగా, రోహిత్‌.. రషీద్‌ ఖాన్‌ పనిపట్టాడు. అతడు వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్లో డీప్‌ మిడ్‌వికెట్‌, స్క్వేర్‌ లెగ్‌లో వరుసగా రెండు కళ్లు చెదిరే సిక్స్‌లు దంచాడు. తొలి వికెట్‌కు 140 పరుగులు జోడించిన రోహిత్‌.. 15వ ఓవర్లో నిష్క్రమించినా, 17వ ఓవర్లో రాహుల్‌ వెనుదిరిగినా భారత జట్టు పరుగుల ప్రవాహం పెరిగిందే తప్ప తగ్గలేదు.

మెరుపు ముగింపు:  ఆఖర్లో పంత్‌, హార్దిక్‌ పాండ్య చెలరేగిపోయారు. అఫ్గాన్‌ బౌలర్లను నిస్సహాయులుగా మార్చేశారు. బ్యాటుతో విధ్వంసం సృష్టించిన ఈ జంట అభేద్యమైన మూడో వికెట్‌ 21 బంతుల్లోనే 63 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపునిచ్చింది. నైబ్‌ బౌలింగ్‌లో పంత్‌ వరుసగా 6, 6 దంచగా.. హమీద్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో హార్దిక్‌ మూడు ఫోర్లు కొట్టాడు. హార్దిక్‌ జోరు కొనసాగిస్తూ.. నవీనుల్‌ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు దంచేశాడు. పంత్‌ వరుసగా ఫోర్‌, సిక్స్‌.. హార్దిక్‌ ఓ ఫోర్‌ సాధించడంతో ఆఖరి ఓవర్లో (హమీద్‌) 16 పరుగులొచ్చాయి.

భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) నైబ్‌ 69; రోహిత్‌ (సి) నబి (బి) జనత్‌ 74; పంత్‌ నాటౌట్‌ 27; హార్దిక్‌ పాండ్య నాటౌట్‌ 35; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 2 వికెట్లకు) 210; వికెట్ల పతనం: 1-140, 2-147; బౌలింగ్‌: నబి 1-0-7-0; షరాఫుద్దీన్‌ అష్రాఫ్‌ 2-0-25-0; నవీనుల్‌ హక్‌ 4-0-59-0; హమీద్‌ హసన్‌ 4-0-34-0; గుల్బాదిన్‌ నైబ్‌ 4-0-39-1; రషీద్‌ 4-0-36-0; జనత్‌ 1-0-7-1

అఫ్గానిస్థాన్‌ ఇన్నింగ్స్‌: జజాయ్‌ (సి) శార్దూల్‌ (బి) బుమ్రా 13; షెజాద్‌ (సి) అశ్విన్‌ (బి) షమి 0; గుర్బాజ్‌ (సి) హార్దిక్‌ (బి) జడేజా 19; నైబ్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 18; నజిబుల్లా జద్రాన్‌ (బి) అశ్విన్‌ 11; నబి (సి) జడేజా (బి) షమి 35; జనత్‌ నాటౌట్‌ 42; రషీద్‌ ఖాన్‌ (సి) హార్దిక్‌ (బి) షమి 0; షరాఫుద్దీన్‌ అష్రాఫ్‌ 2 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 144; వికెట్ల పతనం: 1-13, 2-13, 3-48, 4-59, 5-69, 6-126, 7-127; బౌలింగ్‌: షమి 4-0-32-3; బుమ్రా 4-0-25-1; హార్దిక్‌ పాండ్య 2-0-23-0; జడేజా 3-0-19-1; అశ్విన్‌ 4-0-14-2; శార్దూల్‌ ఠాకూర్‌ 3-0-31-0.


1

ఐసీసీ టోర్నీల (వన్డే, టీ20 ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్‌ ట్రోఫీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్స్‌) చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. 3682   పరుగులు చేసిన రోహిత్‌.. రూట్‌ (3662)ను అధిగమించాడు.


140

అఫ్గానిస్థాన్‌పై తొలి వికెట్‌కు భారత ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ నెలకొల్పిన భాగస్వామ్యమిది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఏ వికెట్‌కైనా భారత్‌కిదే అత్యధిక భాగస్వామ్యం.


210/2

ఈ టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఓ ఇన్నింగ్స్‌లో జట్టు నమోదు చేసిన అత్యధిక స్కోరిదే. స్కాట్లాండ్‌పై అఫ్గనిస్థాన్‌ చేసిన 190/4 పరుగుల రికార్డును భారత్‌ తిరగరాసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని