దాదాలా చేయమనేవాళ్లు.. అదలా అలవాటైంది 

తాను చిన్నప్పటి నుంచీ పలువురు క్రికెటర్లను అనుసరించడం వల్లే సౌరభ్‌ గంగూలీ, గౌతమ్‌ గంభీర్‌లను పోలిన బ్యాటింగ్‌ స్టైల్‌ అలవడిందని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌ నితీశ్‌ రాణా...

Published : 31 Aug 2020 23:51 IST

గంభీర్‌, గంగూలీల బ్యాటింగ్‌ పోలికపై నితీశ్‌ రాణా

(ఫొటో: నితీశ్‌ రాణా ట్విటర్‌)

ఇంటర్నెట్‌డెస్క్‌: తాను చిన్నప్పటి నుంచీ పలువురు క్రికెటర్లను అనుసరించడం వల్లే సౌరభ్‌ గంగూలీ, గౌతమ్‌ గంభీర్‌లను పోలిన బ్యాటింగ్‌ స్టైల్‌ అలవడిందని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌ నితీశ్‌ రాణా అన్నాడు. తాజాగా అతడిని ఓ అభిమాని పలు ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేయగా, కేకేఆర్‌‌ దాన్ని తమ వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గౌతీ, దాదాలను దగ్గరి నుంచి చూడటం వల్లే వాళ్లలా బ్యాటింగ్‌ చేసే విధానం అలవడిందా? అని నితీశ్‌ను అడిగింది. అందుకు స్పందించిన అతడు ఇలా సమాధానమిచ్చాడు. తాను క్రికెట్‌ ఆడటం ప్రారంభించకముందే ఇంట్లో ఆ వాతావరణం ఉండేదని చెప్పాడు. తన తండ్రి సచిన్‌కు అభిమాని కాగా, అన్నయ్య ద్రవిడ్‌కు, తాను సౌరభ్ గంగూలీకి వీరాభిమానినని చెప్పాడు. ఒక్కోసారి దాదా విఫలమైనప్పుడు తన గదికి వెళ్లి తలుపులు వేసుకొని ఏడ్చేవాడినని పేర్కొన్నాడు. ఆ ముగ్గురు దిగ్గజాల్లో ఎవరు విఫలమైనా ఆ రోజు మిగతా వాళ్లు వెక్కిరించేవాళ్లని, అలా తమ ఇంట్లో ఎప్పుడూ క్రికెట్‌ సందడి ఉండేదని వివరించాడు.

ఈ క్రమంలోనే తాను పలువురు క్రికెటర్లను అనుసరించేవాడినని చెప్పాడు. చాలా మంది తెలిసినవాళ్లు తనని దాదాలా నటించమని అడిగేవారన్నాడు. తాను కూడా తరచూ అలా చేయడంతో దాదాను పోలిన బ్యాటింగ్‌ స్టైల్‌ అలవాటైందని చెప్పాడు. ఇక ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా మారాక గౌతమ్‌ గంభీర్‌ను దగ్గరగా చూశానని, అతడు కూడా తమ క్రికెట్‌ క్లబ్బే అయినందున తరచూ గమనించేవాడినన్నాడు. అయితే, తన బ్యాటింగ్‌‌ మాత్రం గంభీర్‌ను పోలి ఉండదని చెప్పాడు. ఇతరులు ఎవరైనా అలా భావిస్తే అది వారి ఇష్టమని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని