IPL 2021: దిల్లీ దర్జాగా ప్లేఆఫ్స్‌కు

దిల్లీ క్యాపిటల్స్‌ వచ్చేసింది. ఈసారి ఐపీఎల్‌లో చెన్నైకు ధీటుగా దూసుకెళ్తున్న దిల్లీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఎలాగైనా టైటిల్‌ అందుకోవాలనే పట్టుదలతో ఉన్న పంత్‌ బృందం.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ను ఓడించి ముందంజ వేసింది

Updated : 03 Oct 2021 07:27 IST

ముంబయిపై విజయం

షార్జా

దిల్లీ క్యాపిటల్స్‌ వచ్చేసింది. ఈసారి ఐపీఎల్‌లో చెన్నైకు ధీటుగా దూసుకెళ్తున్న దిల్లీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఎలాగైనా టైటిల్‌ అందుకోవాలనే పట్టుదలతో ఉన్న పంత్‌ బృందం.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ను ఓడించి ముందంజ వేసింది. దిల్లీకి పన్నెండు మ్యాచ్‌ల్లో ఇది తొమ్మిదో గెలుపు. పెద్ద స్కోరు లేకపోయినా ఆఖరి వరకు పోరాడిన ముంబయి మరో ఓటమితో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 12 మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు ఇది ఏడో ఓటమి.

దిల్లీ క్యాపిటల్స్‌ అదరగొట్టింది. మరో స్ఫూర్తిదాయక విజయంతో ప్లేఆఫ్స్‌ బెర్తు సొంతం చేసుకుంది. శనివారం ఆ జట్టు 4 వికెట్ల తేడాతో ముంబయిని ఓడించింది. మొదట ముంబయి 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (33; 26 బంతుల్లో 2×4, 2×6) టాప్‌ స్కోరర్‌. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అక్షర్‌ పటేల్‌ (3/21), అవేష్‌ ఖాన్‌ (3/15) ప్రత్యర్థిని కట్టడి చేశారు. శ్రేయస్‌ అయ్యర్‌ (33 నాటౌట్‌; 33 బంతుల్లో 2×4), పంత్‌ (26; 22 బంతుల్లో 3×4, 1×6) రాణించడంతో లక్ష్యాన్ని దిల్లీ 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది.

తడబడినా..నిలబడి: లక్ష్యం చిన్నదే అయినా ఛేదనలో దిల్లీ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగలేదు. 30 పరుగులకే పృథ్వీ షా (6), శిఖర్‌ ధావన్‌ (8), స్టీవ్‌ స్మిత్‌ (9) వికెట్లు కోల్పోయింది. ధావన్‌ రనౌట్‌ కాగా.. పృథ్వీని కృనాల్‌, స్టీవ్‌ను కౌల్టర్‌నైల్‌ పెవిలియన్‌ చేర్చారు. మూడు వికెట్లు కోల్పోయి జట్టుపై ఒత్తిడి పెరుగుతున్న సమయంలో పంత్‌ వరుస బౌండరీలతో జట్టుపై భారాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో అతడు రెండు ఫోర్లు కొట్టాడు. కానీ ఆ తర్వాత నుంచి బౌలర్ల ఆధిపత్యం సాగింది. జయంత్‌, కౌల్టర్‌ నైల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. పంత్‌ జయంత్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ కొట్టబోయి ఔటయ్యాడు. 7-12 ఓవర్ల మధ్య దిల్లీ ఒక్క బౌండరీ మాత్రమే కొట్టింది. పరుగులు రాక కష్టమైనా శ్రేయస్‌ ఎంతో సంయమనాన్ని ప్రదర్శించాడు. రెండు ఫోర్లతో ఊపుమీద కనిపించిన హెట్‌మయర్‌ (15) త్వరగానే నిష్క్రమించాడు. అప్పుడు దిల్లీ 93/6తో కష్టాల్లో నిలిచింది. ఈ సమయంలో అశ్విన్‌ అండగా శ్రేయస్‌ ముంబయికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. లక్ష్యం (41 బంతుల్లో 37) తేలికగానే ఉండడంతో ప్రశాంతంగా ఆడిన శ్రేయస్‌.. అశ్విన్‌ (20 నాటౌట్‌; 21 బంతుల్లో 1×6)తో కలిసి దిల్లీని విజయపథంలో నడిపించాడు. కృనాల్‌ వేసిన చివరి ఓవర్లో 4 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికే అశ్విన్‌ సిక్సర్‌ కొట్టి జట్టును గెలిపించాడు.

ముంబయికి కళ్లెం: అంతకుముందు ముంబయికి దిల్లీ బౌలర్లు అక్షర్‌, అవేష్‌ కళ్లెం వేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ భారీ షాట్లు కొట్టకుండా నిలువరించారు. పవర్‌ప్లే ఆఖరికి ముంబయి 35 పరుగులే చేసి.. కెప్టెన్‌ రోహిత్‌శర్మ (7) వికెట్‌ నష్టపోయింది. డికాక్‌ (19) కూడా నిలవకపోవడంతో ఆ జట్టు పరుగుల వేగం తగ్గింది. ఈ స్థితిలో సూర్యకుమార్‌ ఎదురుదాడి చేశాడు. భారీ షాట్లు ఆడాడు. అయితే సూర్య వెనుదిరిగిన తర్వాత ముంబయి రన్‌రేట్‌ మరీ తగ్గిపోయింది. 12 నుంచి 16 ఓవర్ల మధ్య ముంబయి ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. పైగా సౌరభ్‌ తివారి (15), పొలార్డ్‌ (6)ల వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో కృనాల్‌ (13), హార్దిక్‌ (17), జయంత్‌ (11) తలా కొన్ని పరుగులు చేసి దిల్లీ ముందు గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిలిపారు.

ముంబయి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) రబాడ (బి) అవేష్‌ 7; డికాక్‌ (సి) నార్జ్‌ (బి) అక్షర్‌ 19; సూర్యకుమార్‌ (సి) రబాడ (బి) అక్షర్‌ 33; సౌరభ్‌ తివారి (సి) పంత్‌ (బి) అక్షర్‌ 15; పొలార్డ్‌ (బి) నార్జ్‌ 6; హార్దిక్‌ (బి) అవేష్‌ 17; కృనాల్‌ నాటౌట్‌ 13; కౌల్టర్‌నైల్‌ (బి) అవేష్‌ 1; జయంత్‌ (సి) స్మిత్‌ (బి) అశ్విన్‌ 11; బుమ్రా నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 129; వికెట్ల పతనం: 1-8, 2-37, 3-68, 4-80, 5-87, 6-109,  7-111, 8-122; బౌలింగ్‌: నార్జ్‌ 4-1-19-1; అవేష్‌ఖాన్‌ 4-0-15-3; రవిచంద్రన్‌ అశ్విన్‌ 4-0-41-1; రబాడ  4-0-33-0; అక్షర్‌ పటేల్‌ 4-0-21-3

దిల్లీ ఇన్నింగ్స్‌: పృథ్వీ ఎల్బీ (బి) కృనాల్‌ 6; ధావన్‌ రనౌట్‌ 8; స్టీవ్‌ స్మిత్‌ (బి) కౌల్టర్‌నైల్‌ 9; పంత్‌ (సి) హార్దిక్‌ (బి) జయంత్‌ 26; శ్రేయస్‌ నాటౌట్‌ 33; అక్షర్‌ ఎల్బీ (బి) బౌల్ట్‌ 9; హెట్‌మయర్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 15; అశ్విన్‌ నాటౌట్‌ 20; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (19.1 ఓవర్లలో 6 వికెట్లకు) 132; వికెట్ల పతనం: 1-14, 2-15, 3-30, 4-57, 5-77, 6-93; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-24-1; జయంత్‌ యాదవ్‌ 4-0-31-1; కృనాల్‌ పాండ్య 2.1-0-18-1;  బుమ్రా   4-0-29-1; కౌల్టర్‌నైల్‌ 4-0-19-1; పొలార్డ్‌ 1-0-9-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని