Cricket News: సిరాజ్‌ స్పెషల్‌ అదేనన్న ఏబీడీ... జట్టుకు కాంబినేషనే కీలకమన్న షమీ!

Published : 23 Sep 2023 15:48 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ (ICC) వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో సిరాజ్‌ (Siraj) అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో సిరాజ్‌పై ఏబీ డివిలియర్స్‌ (ABD) ప్రశంసల వర్షం కురిపించాడు. మరోవైపు ఆసీస్‌తో తొలి వన్డేలో షమీ (Shami) ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అనంతరం ప్రెస్ కాన్ఫెరెన్స్‌ సందర్భంగా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు షమీ అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. షమీ ప్రదర్శనను మాజీ క్రికెటర్లు అభినందిస్తూనే ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..

సిరాజ్‌.. నీ యాటిట్యూడ్ మార్చుకోవద్దు: ఏబీ డివిలియర్స్‌

ఆసియా కప్‌ ఫైనల్‌లో అద్భుత స్పెల్‌తో శ్రీలంకను గడగడలాడించిన సిరాజ్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దూసుకెళ్లాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఒకప్పటి సహచరుడు ఏబీ డివిలియర్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘సిరాజ్‌ ఆటలో పెద్ద సానుకూలాంశం అతడి యాటిట్యూడ్. ఇప్పటికే చాలాసార్లు దాని గురించి మాట్లాడా. అతడీ స్థాయికి వచ్చాడంటే దానికి కారణం కూడా ఆటపట్ల ఉండే ప్యాషన్. అందుకే, ఎప్పుడూ దాన్ని వదులుకోవద్దని చెబుతా. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయగలడు. అభిమానులు కూడా నీ నుంచి ఇదే ఆశిస్తారు. ఇలా గౌరవం పొందే బౌలర్లను ఏ జట్టూ వదులుకోదు. ప్రతి బంతికి వికెట్‌ తీయాలనే పట్టుదల సిరాజ్‌లో కనిపించింది’’ అని డివిలియర్స్‌ వ్యాఖ్యానించాడు.


ఎవరికీ అలా ఉండాలని ఉండదు: షమీ

భారత జట్టులో స్థానం కోసం విపరీతమైన పోటీ ఉంటుందని సీనియర్‌ పేసర్ మహమ్మద్‌ షమీ తెలిపాడు. తాజాగా ఆసీస్‌పై తొలి వన్డేలో ఐదు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ‘తుది జట్టులో అవకాశం రానప్పుడు ఎలా ఫీల్‌ అవుతారు?’ అని ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌లో ఓ రిపోర్టర్‌ ప్రశ్నకు షమీ సమాధానం ఇచ్చాడు. ‘‘రిజర్వ్‌ బెంచ్‌పై కూర్చోవడం ఎలాంటి ఆటగాడికైనా ఇబ్బందే. నేను తరచూ తుది జట్టులో ఉండి ఆడుతుంటే, తప్పకుండా మరొకరు ఆ ఛాన్స్‌ను మిస్‌ అవుతారు. అప్పుడు నాకేమీ అనిపించకపోయినా.. రిజర్వ్‌ బెంచ్‌పై ఉన్న వారు బాధపడతారు. అయితే, జట్టు విజయం సాధించినప్పుడు మనం రిజర్వ్‌ బెంచ్‌పై ఉన్నా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే జట్టు కాంబినేషన్‌ కీలకం. ప్రతిసారి తుది జట్టులో ఉండకపోవచ్చు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రణాళికను బట్టి ఫైనల్ XIలో ఎవరు ఉండాలనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మిగతావారికి మద్దతుగా నిలవాలి. అందుకే, ఎప్పుడు ఎలాంటి పాత్రను పోషించడానికైనా నేను సిద్ధంగా ఉంటా. రొటేషన్‌పై కోచ్‌ నిర్ణయం తీసుకుంటారు. పరిస్థితిని బట్టి జట్టును మారుస్తూ ఉండటం సహజమే’’ అని షమీ తెలిపాడు. 


ఇప్పటికీ షమీని తక్కువగానే అంచనా వేస్తారు: కైఫ్, ఉతప్ప

ఆసీస్‌పై తొలి వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన షమీని భారత మాజీ ఆటగాళ్లు మహమ్మద్‌ కైఫ్‌, రాబిన్‌ ఉతప్ప ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా అభివర్ణించారు. ఈ మేరకు ట్విటర్ (ప్రస్తుతం ఎక్స్‌) వేదికగా స్పందించారు. ‘‘ఐదు వికెట్ల ప్రదర్శనకు కంగ్రాట్స్‌. కానీ, ఇప్పటికీ మహమ్మద్‌ షమీ బౌలింగ్‌ను తక్కువగా అంచనా వేస్తుంటారు. అయితే, నా వరకైతే మాత్రం అతడు వరల్డ్ కప్‌ హీరో. షమీని విస్మరిస్తే మాత్రం ప్రత్యర్థులకు కష్టమే’’ అని కైఫ్ ట్వీట్ చేశాడు. 

‘‘ఆసీస్‌పై టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ అద్భుతం. ఓపెనర్లు గట్టి పునాది వేశారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, సూర్యకుమార్‌ ఫినిష్ చేసేశారు. అంతకుముందు షమీ తన బౌలింగ్‌ సత్తా ఏంటో మరోసారి చూపించాడు. వరల్డ్ కప్ ముందు అన్నీ మంచి శకునాలే’’ అని రాబిన్‌ ఉతప్ప ట్విటర్‌ వేదికగా పోస్టు పెట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని