AUS vs AFG: మరో సంచలనానికి రెడీనా? కుప్పకూలిన ఆసీస్‌ టాప్‌ ఆర్డర్‌!

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. 

Updated : 07 Nov 2023 20:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023)లో మరో సంచలనానికి క్రికెట్‌ అభిమానులు సిద్ధం అవ్వాల్సిందేనా? అఫ్గానిస్థాన్‌ (Afghanistan) బౌలర్ల దూకుడు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. తొలుత బ్యాటింగ్‌లో అఫ్గాన్‌ బ్యాటర్లు అదరగొట్టగా... ఇప్పుడు కంగారూల (Australia) టాప్‌ ఆర్డర్‌ను బౌలర్లు పెవిలియన్‌కి పంపేశారు. దీంతో ఈ మ్యాచ్‌లో సంచలనం నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 292 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 19 ఓవర్లు పూర్తయ్యేసరికి ఏడు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. 

ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ను నవీన్‌ ఉల్‌ హక్‌ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపగా... ఫస్ట్ డౌన్‌లో వచ్చిన మిచెల్ మార్ష్‌ (24)తో కలసి ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (18) స్కోరు బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. ఉన్నంతసేపు దూకుడుగా ఆడిన మార్ష్‌ కూడా నవీన్‌ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వార్నర్‌ను ఒమర్జాయి చక్కటి బంతితో బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాతి బంతికే జోష్‌ ఇంగ్లిస్‌ గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. మ్యాక్స్‌వెల్‌  (12*)తో కలసి కాసేపు కుదురుకున్నట్లు కనిపించిన లబుషేన్‌ (14) దురదృష్టవశాత్తూ రనౌట్‌ అయ్యాడు. దీంతో ఆసీస్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది.

రాగానే ఫోర్‌ కొట్టి జోరు మీదున్నట్లు కనిపించిన స్టొయినిస్‌ (6)ను రషీద్‌ ఖాన్‌ మ్యాజిక్‌ బంతితో ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో మళ్లీ వచ్చిన రషీద్‌ ఈసారి మిచెల్‌ స్టార్క్‌ను బోల్తాకొట్టించాడు. బంతి గమనాన్ని అంచనా వేయలేక మిచెల్‌ స్టార్క్‌ (3) ఇబ్బందిపడితే.. కీపర్‌ ఇక్రమ్‌ అలీఖిల్‌ సూపర్‌ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు.  ప్రస్తుతం క్రీజులో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (22), పాట్‌ కమిన్స్‌ (4) ఉన్నారు. అఫ్గాన్‌ బౌలర్లలో ఒమర్జాయి, నవీన్‌, రషీద్‌ ఖాన్‌ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని