T20 World Cup: పెద్ద ఆటగాళ్లపై బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలి: కపిల్‌దేవ్‌

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా దారుణంగా విఫలమవుతోంది. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓడిన భారత్‌ సెమీస్‌ రేసులో చాలా వెనుకబడింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గినా భారత్‌ సెమీస్‌కు చేరడం కష్టమే.

Published : 03 Nov 2021 23:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా దారుణంగా విఫలమవుతోంది. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓడిన భారత్‌ సెమీస్‌ రేసులో చాలా వెనుకబడింది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గినా భారత్‌ సెమీస్‌కు చేరడం కష్టమే. టీమిండియా తదుపరి దశకు అర్హత సాధించాలంటే అఫ్గానిస్థాన్ చేతిలో న్యూజిలాండ్‌ ఓడిపోవాలి. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే ఇది సాధ్యమయ్యేట్లు కనిపించడం లేదు. దీంతో టీమిండియా ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న పెద్ద ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకుని ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఇతర జట్ల ఫలితాలమీద ఆధారపడి సెమీస్ చేరడం అనేది మంచిది కాదని పేర్కొన్నారు. జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గట్టుగా రాణించకపోతే వారి స్థానాల్లో ఇతర ఆటగాళ్లను ఎంపిక చేయాల్సిన సమయం ఆసన్నమైందని కపిల్‌దేవ్ అన్నారు.

‘సెమీస్ చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడటం అనేది భారత్‌కు మంచిది కాదు. ప్రపంచకప్‌ని విజేతగా నిలవడం గానీ, సెమీస్‌కు చేరడం గానీ సొంత బలంతో జరగాలి. నా అంచనా ప్రకారం జట్టులోని పెద్ద ఆటగాళ్ల భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త తరం ఆటగాళ్లను తయారు చేయాలంటే ఐపీఎల్‌లో రాణించిన యువ క్రికెటర్లని జట్టులోకి తీసుకునే అంశంపై సెలక్టర్లు ఆలోచించాలి. ఒకవేళ యువ క్రికెటర్లతో కూడిన జట్టు ఓడినా ఎలాంటి నష్టం ఉండదు. పైగా వారికి అనుభవం వస్తుంది. కానీ, పెద్ద  ఆటగాళ్లు రాణించకపోతే చాలా విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే అంశంపై ఆలోచించాలి’ అని కపిల్‌దేవ్ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని