IND vs SA: టీ20ల్లో అతిగొప్ప రికార్డుకు చేరువలో భువనేశ్వర్‌ కుమార్

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమ్‌ఇండియా పేసర్‌ భువనేశ్వర్‌ అతిగొప్ప రికార్డుకు చేరువలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో ఈరోజు సాయంత్రం విశాఖపట్నం వేదికగా జరిగే...

Published : 14 Jun 2022 15:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమ్‌ఇండియా పేసర్‌ భువనేశ్వర్‌ గొప్ప రికార్డుకు చేరువలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో ఈరోజు సాయంత్రం విశాఖపట్నం వేదికగా జరిగే మూడో టీ20లో అతడు పవర్‌ప్లేలో మరొక్క వికెట్‌ సాధిస్తే తన పేరిట కొత్త రికార్డు నెలకొల్పనున్నాడు. దీంతో పవర్‌ప్లే ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన అంతర్జాతీయ టీ20 బౌలర్‌గా నిలుస్తాడు. ఇంతకుముందు కటక్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో భువి నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 13 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. అందులో మూడు వికెట్లు పవర్‌ప్లేలోనే వచ్చాయి. దీంతో టీ20 పవర్‌ప్లే ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో వెస్టిండీస్‌ బౌలర్‌ సామ్యూల్‌ బద్రీ, న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌సౌథీ సరసన నిలిచాడు. ప్రస్తుతం ఈ ముగ్గురూ తలా 33 వికెట్లు తీసి తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అందులో భువనేశ్వర్‌ 59 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి రెండో స్థానంలో నిలవగా.. సామ్యూల్‌ 50 ఇన్నింగ్స్‌ల్లో అగ్రస్థానంలో ఉన్నాడు. సౌథీ 68 ఇన్నింగ్స్‌ల్లో మూడో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలోనే టీమ్‌ఇండియా పేసర్‌ నేటి మ్యాచ్‌లో మరోసారి వికెట్లు పడగొడితే.. వారిద్దర్నీ వెనక్కినెట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. ఇక బంగ్లా ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్ హసన్‌ 58 ఇన్నింగ్స్‌ల్లో 27 వికెట్లు పడగొట్టి నాలుగో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ 30 ఇన్నింగ్స్‌ల్లో 26 వికెట్లు ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని