Afghanistan: అఫ్గానిస్థాన్‌కు సెమీస్‌ ఛాన్స్‌.. ఎలాగంటే..!

ప్రపంచకప్‌లో తాజాగా శ్రీలంకకు షాకిచ్చి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది అఫ్గానిస్థాన్‌ (Afghanistan). ఆ జట్టు సెమీస్ చేరేందుకు అవకాశాలు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం.

Updated : 31 Oct 2023 12:44 IST

ఇంటర్నెట్ డెస్క్: ఈ వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌  (Afghanistan) సంచలన విజయాలు సాధిస్తోంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో నెగ్గింది. భారత్, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన అఫ్గాన్‌.. మొన్న ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌లను ఓడించింది. తాజాగా శ్రీలంకకు షాక్ ఇచ్చింది. ఈ మూడు జట్లూ ఒకప్పుడు ఛాంపియన్‌గా నిలిచినవే. అలాంటి జట్లపై విజయం సాధించడం అంటే ఆషామాషీ కాదు. లంకపై విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచిన అఫ్గానిస్థాన్‌ సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆ జట్టు టాప్‌-4లో నిలిచేందుకు అవకాశాలు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అఫ్గాన్‌ కంటే ముందు భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి. అఫ్గానిస్థాన్‌ ఐదో స్థానంలో ఉంది. నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో అఫ్గాన్‌ ఇంకా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఆ జట్టు భారీ తేడాతో విజయం సాధిస్తే.. ఆస్ట్రేలియా ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచినా అఫ్గాన్‌ సెమీస్‌కు చేరే అవకాశం ఉంది. అప్పుడు రెండు జట్లు 12 పాయింట్లతో ఉంటాయి. నెట్‌రన్‌రేట్‌ మెరుగ్గా ఉన్న జట్టు ముందంజ వేస్తుంది.

ఒకవేళ అఫ్గానిస్థాన్‌ తన మూడు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో ఓడినప్పటికీ సెమీస్ అవకాశాలుంటాయి. అలా జరగాలంటే ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ తమ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. అప్పుడు మూడు జట్లు 10 పాయింట్లతో ఉంటాయి. నెట్‌రన్‌రేట్‌ మెరుగ్గా ఉన్న జట్లు ముందుకు వెళ్తాయి.  ఇక్కడ మరో విషయం ఏంటంటే.. సౌతాఫ్రికా ప్రస్తుతం 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఒకవేళ ఆ జట్టు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడితే అఫ్గాన్‌ అవకాశాలు మరింత మెరుగవుతాయి. అదృష్టం కలిసొచ్చి అఫ్గాన్‌ సెమీస్ చేరితే అది చరిత్ర అవుతుంది. చూడాలి మరి మున్ముందు ఏం జరుగుతుందో!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని