Narendra Modi Stadium: నీలి సంద్రం.. ఇండియా మంత్రం

భారత అభిమానుల కళ్లన్నీ.. టికెట్‌ దక్కించుకున్న ప్రేక్షకుల కాళ్లన్నీ అటు వైపే. సబర్మతి నది పక్కన నీలి సంద్రం పోటెత్తింది.

Published : 20 Nov 2023 04:27 IST

అహ్మదాబాద్‌: భారత అభిమానుల కళ్లన్నీ.. టికెట్‌ దక్కించుకున్న ప్రేక్షకుల కాళ్లన్నీ అటు వైపే. సబర్మతి నది పక్కన నీలి సంద్రం పోటెత్తింది. జీవితకాల అనుభూతిని అందించే పోరును.. చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఉదయం నుంచే అభిమానులు ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ (narendra modi stadium) స్టేడియానికి తరలి వచ్చారు. ఒకే వరుసలో కదిలే నీలి చీమల దండులా సాగి స్టేడియాన్ని నింపేశారు. టీమ్‌ఇండియా (Team India) జెర్సీలు ధరించి.. ‘ఇండియా.. ఇండియా’ అనే మంత్రంతో హోరెత్తించారు. ఎక్కడ చూసిన త్రివర్ణ పతాకాల రెపరెపలే. ముఖాలపై మూడు రంగుల ముద్రలే. భారత్‌లోని వివిధ రాష్ట్రాలతో పాటు బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌ లాంటి దేశాల నుంచి కూడా ఈ మ్యాచ్‌ చూసేందుకు వచ్చారు. టాస్‌ సమయానికి లక్షా 32 వేల సామర్థ్యం ఉన్న స్టేడియం పూర్తిగా నిండిపోయింది. ప్రపంచకప్‌ ప్రచారకర్త సచిన్‌ ట్రోఫీతో మైదానంలో అడుగుపెట్టినప్పుడు, టాస్‌ కోసం రోహిత్‌, కమిన్స్‌ వచ్చిన సమయంలోనూ స్టేడియం హోరెత్తింది. భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ బృందం 10 నిమిషాల పాటు విన్యాసాలతో అలరించింది. మొత్తం తొమ్మిది విమానాలు విన్యాసాల్లో పాల్గొన్నాయి. భారత్‌లో ఓ క్రికెట్‌ మ్యాచ్‌కు ముందు ఇలా వాయుసేన విన్యాసాలు చేయడం ఇదే తొలిసారి. ప్రపంచకప్‌ ఫైనల్‌కు ముందు ఈ విన్యాసాలు చేపట్టడం కూడా ఇదే మొదటిసారి. భారత ఆటగాళ్లతో కలిసి స్టాండ్స్‌లోని లక్షకు పైగా ప్రజలు జనగణమన అంటూ గొంతు కలపడంతో రోమాలు నిక్కబొడుచుకున్న అనుభూతి కలిగింది. రెండో ఇన్నింగ్స్‌ డ్రింక్స్‌ విరామంలో లేజర్‌, లైట్‌ షో ఆకట్టుకున్నాయి. మ్యాచ్‌ ముగిశాక డ్రోన్‌ షో కూడా అలరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని