Milkha singh: ఇకపై మెరిసే స్ప్రింటర్లలో కనిపించేది మీరే!

భారత పరుగుల వీరుడు ‘మిల్కా సింగ్’ కన్నుమూయడంతో క్రీడా ప్రపంచం నివ్వెరపోయింది. ఆయన ఇక లేరన్న సంగతిని జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు ప్రముఖులు అంటున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, వ్యాపార వేత్తలు, క్రీడాకారులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు....

Updated : 19 Jun 2021 11:26 IST

మిల్కాసింగ్‌కు ప్రముఖుల నివాళి

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత పరుగుల వీరుడు ‘మిల్కా సింగ్’ కన్నుమూయడంతో క్రీడా ప్రపంచం నివ్వెరపోయింది. ఆయన ఇక లేరన్న సంగతిని జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు ప్రముఖులు అంటున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, వ్యాపార వేత్తలు, క్రీడాకారులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆయన సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్లు పెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం మిల్కాసింగ్‌కు కరోనా సోకింది. దాన్నుంచి ఆయన కోలుకున్నప్పటికీ తదనంతర సమస్యలు ఇబ్బంది పెట్టాయి. శుక్రవారం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో రాత్రి 11:30 గంటలకు కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు.

క్రీడా దిగ్గజం మిల్కాసింగ్‌ లేరని తెలిసి నా హృదయం బాధతో నిండిపోయింది.  ఆయన ఎదుర్కొన్న కష్టాలు, చూపించిన తెగువ రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తాయి. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా సానుభూతి. - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  

* దేశం ఓ గొప్ప క్రీడాకారుడిని కోల్పోయింది. అంతర్జాతీయ క్రీడా వేదికపై మిల్కాసింగ్‌ దేశం ఖ్యాతిని ఇనుమడింపజేశారు. లెక్కలేనంత మంది భారతీయుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తన విజయాలతో కోట్లాదిమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. కొన్ని రోజుల క్రితమే ఆయనతో మాట్లాడాను. ఆయనతో సంభాషించడం అదే చివరిసారి అవుతుందని అనుకోలేదు. ఆయన జీవితం నుంచి ఎంతోమంది క్రీడాకారులు ప్రేరణ పొందుతారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. - ప్రధాని నరేంద్రమోదీ

* ది ఫ్లయింగ్‌ సిఖ్‌, మిల్కాసింగ్‌ మరణం దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఆయన చెరగని ముద్ర వేశారు. భారత అత్యంత ప్రముఖ క్రీడాకారుడిగా దేశం ఆయనను గుర్తు పెట్టుకుంటుంది. - కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

* భారత్‌ ఒక తారను కోల్పోయింది. మిల్కాసింగ్‌ మనల్ని వదిలి వెళ్లినా దేశం కోసం తపన పడే ప్రతి ఆటగాడికీ ఆయన స్ఫూర్తినిస్తూనే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. - కేంద్ర క్రీడామంత్రి  కిరణ్‌ రిజిజు

* మిల్కాసింగ్‌ మరణించారని తెలిసి కుంగిపోయాను. ఒక శకం ముగిసింది. భారత్‌, పంజాబ్‌ ఈ రోజు విషాదంలో మునిగిపోయాయి. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. రాబోయే ప్రతి తరంలో ఫ్లయింగ్‌ సిఖ్‌ కనిపిస్తూనే ఉంటారు. రెస్టిన్‌ పీస్‌ సర్‌! - పంజాబ్‌ సీఎం, కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌

* మిల్కాసింగ్‌ మాకెంత ఇష్టమో, మా తరానికి ఆయనంటే ఎంత విలువో ఎలా వివరించగలం? ఆయన కేవలం ఓ క్రీడాకారుడే కాదు. సామ్రాజ్యవాద తదనంతరం అభద్రతతో బాధపడుతున్న సమాజం.. ప్రపంచంలోనే అత్యున్నతమైందని చెప్పేందుకు ఆయన ఉదాహరణగా నిలిచారు. అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు మిల్కాసింగ్‌ జీ - ఆనంద్‌ మహీంద్రా

* ఫ్లయింగ్‌ సిఖ్‌ సర్దార్‌ మిల్కాసింగ్‌ లేరని తెలిసి గుండెపగిలింది - హర్భజన్‌ సింగ్‌




















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని