Mohammed Siraj : అప్పుడు రూమ్‌లో కూర్చొని ఏడ్చేవాడిని: సిరాజ్‌

భారత్‌ తరఫున టెస్టుల్లో ప్రాతినిధ్యం వహిస్తే చూడాలని తన తండ్రి కోరుకున్నాడని యువ పేసర్‌ సిరాజ్‌ (Siraj) తెలిపాడు. ఆ కల కోసమే తండ్రి చనిపోయినా తాను స్వదేశానికి రాకుండా ఆసీస్‌లోనే ఉండిపోయానంటూ నాటి రోజుల్ని గుర్తుచేసుకున్నాడు.

Updated : 13 Mar 2023 14:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ :  టీమ్‌ఇండియా యువ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌(Mohammed Siraj) భావోద్వేగానికి గురయ్యాడు. తన తండ్రి చనిపోయినప్పుడు.. తాను ఎదుర్కొన్న పరిస్థితులను మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్‌(IPL)లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరాజ్‌.. ఆర్సీబీ(RCB) సీజన్‌ 2 పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా పలు విషయాలను పంచుకున్నాడు.

2020 నవంబర్‌లో సిరాజ్‌ ఆస్ట్రేలియా(Australia) పర్యటనలో ఉన్నప్పుడు అతడి తండ్రి మరణించిన విషయం తెలిసిందే. అయితే కొవిడ్‌ బయోబబుల్‌లో ఉండటంతో.. అతడు తండ్రి అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేకపోయాడు. కన్న తండ్రి చివరి చూపు కూడా దక్కకపోవడంతో తాను ఎన్నోసార్లు ఒంటరిగా రూమ్‌లో కూర్చుని ఏడ్చానని సిరాజ్‌ చెప్పాడు. ‘‘క్వారంటైన్‌ నిబంధనలు ఉండటంతో ఆటగాళ్లు ఒకరి రూమ్‌లోకి మరొకరు వచ్చేవారు కాదు. వీడియో కాల్స్‌లోనే మాట్లాడుకునే వాళ్లం. ఆ పరిస్థితుల్లో అప్పటి ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ నాకు ఫోన్‌ చేసి.. ఎలా ఉన్నావంటూ అడిగేవాడు. నాకు కాబోయే భార్య కూడా నాతో ఫోన్లో మాట్లాడుతూ అండగా నిలిచింది. అయితే.. ఫోన్‌లో ఎప్పుడూ నేను ఏడవలేదు. రూమ్‌లో ఒంటరిగా కూర్చుని ఏడ్చేవాడిని. ఆ తర్వాత ఆమెతో మాట్లాడేవాడిని’’ అంటూ ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నాడు సిరాజ్‌.

‘‘తండ్రి చనిపోయిన తర్వాతి రోజే నేను ట్రైనింగ్‌ సెషన్‌కు వెళ్లాను. ఆ సమయంలో రవిశాస్త్రి నాకు ధైర్యం చెప్పారు. ‘నీకు నీ తండ్రి ఆశీస్సులు ఉన్నాయి. నువ్వు ఐదు వికెట్లు తీసుకుంటావు’ అని చెప్పాడు. బ్రిస్బేన్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేయగానే.. శాస్త్రి నా వద్దకు వచ్చి.. ముందే చెప్పానుగా.. అని అన్నాడు’’ అంటూ సిరాజ్‌.. తనకు రవిశాస్త్రి అండగా ఉన్న క్షణాలను వివరించాడు. 

క్రికెట్‌ ఆడే సమయంలో తన తండ్రితో గడిపిన క్షణాలను తాను ఎప్పటికీ మరిచిపోనని.. తానో గొప్ప క్రికెటర్‌ కావాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారని సిరాజ్‌ చెప్పాడు. ‘‘నేను ఆస్ట్రేలియాలో బౌలింగ్‌ చేయడాన్ని ఎంతో ఆస్వాదించాను. ఎందుకంటే.. ప్రధాన బౌలర్లంతా గాయపడటంతో.. నేను పేస్‌ అటాక్‌లో లీడర్‌గా మారాను. కొత్త బంతితో బౌలింగ్‌ చేయడం భిన్నమైన అనుభూతి కలిగించింది’ అని సిరాజ్‌ వివరించాడు. ఆ ఏడాది బాక్సింగ్ డే టెస్టుతో సిరాజ్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో ఈ పేసర్‌ సత్తా చాటాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని