Team India: భారత్‌కు ఎక్కువ ఛాన్స్‌.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయాలే కీలకం: దీపక్ చాహర్‌

వన్డే ప్రపంచకప్‌  (ODI World Cup 2023) నాటికి అన్ని విభాగాలను సమాయత్తం చేయాల్సిన బాధ్యత టీమ్‌మేనేజ్‌మెంట్‌పై ఉంటుందని.. అలాగే ఆటగాళ్లపైనా శారీరకంగా, మానసికంగా ఒత్తిడి లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉందని దీపక్‌ చాహర్‌ వ్యాఖ్యానించాడు.

Published : 19 Sep 2023 18:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అక్టోబర్ 5 నుంచి భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ (ODi World Cup 2023) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆలోగా టీమ్‌ఇండియా ఒకే ఒక్క వన్డే సిరీస్‌ను ఆడనుంది. అదీనూ బలమైన ఆసీస్‌తో తలపడనుంది. ఆ తర్వాత రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అయితే, వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగే వరకు భారత్ పేసర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై ఉందని, వారి లయ దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని భారత ఫాస్ట్‌ బౌలర్‌ దీపక్ చాహర్‌ వ్యాఖ్యానించాడు. దీపక్‌ చాహర్‌ వన్డే వరల్డ్‌ కప్‌ స్క్వాడ్‌లో లేని విషయం తెలిసిందే. రాబోయే కొన్ని రోజులు టీమ్‌ఇండియాకు చాలా కీలకమని.. వరల్డ్‌ కప్‌ నాటికి ఆటగాళ్లను ఫ్రెష్‌గా ఉంచాల్సిన అవసరం ఉందని తెలిపాడు. తన స్పోర్ట్స్‌ బ్రాడ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దీపక్ చాహర్‌ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

విశ్రాంతి, రిథమ్‌ దొరికేలా చూడాలి..

‘‘ఆటగాళ్లను మ్యాచుల్లో ఆడించడం ఎంత ముఖ్యమో.. వారికి తగినంత విశ్రాంతి కల్పించడమూ కీలకమే. ఇదే టీమ్‌ మేనేజ్‌మెంట్ ఎదుట ఉన్న కఠిన సవాల్. మరీ ముఖ్యంగా బౌలర్ల రిథమ్‌ కోల్పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆసీస్‌తో మూడు వన్డేలను ప్రాక్టీస్‌లా వినియోగించుకోవాలి. ఆసీస్‌ చాలా బలమైన జట్టు. వారితో తలపడినప్పుడు చాలా విషయాలను నేర్చుకోవచ్చు. బౌలర్లు, బ్యాటర్ల ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి ఇదొక సదావకాశం. ఎవరిని ఆడించాలి.. ఎవరికి విశ్రాంతి ఇవ్వాలనేది టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’’

సిరాజ్‌ అద్భుతం..

‘‘ఆసియా కప్‌ ఫైనల్‌లో సిరాజ్ బౌలింగ్‌ను చూశా. ఇదేదో ప్రాక్టీస్‌ చేస్తున్నట్లుగానే ఉంది. అద్భుతంగా బౌలింగ్‌ వేశాడు. గతేడాది నుంచి సిరాజ్‌ నాణ్యమైన బౌలింగ్‌ చేస్తూ వికెట్లను రాబట్టాడు. అందుకే అతడు మన నంబర్‌వన్‌ బౌలర్ అయ్యాడు.  చాలా కాలంగా పెద్ద టోర్నీని మనం గెలవలేదు. ఇప్పుడు ఆసియా కప్‌ను గెలుచుకోవడం ప్రపంచ కప్‌ ముందు ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఇదే దూకుడును అక్కడా ప్రదర్శించాలి. వరల్డ్ కప్‌ స్వదేశంలో కాబట్టి మనకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి’’

బుమ్రా రాక మరింత బలం..

‘‘దాదాపు ఏడాది తర్వాత వన్డేల్లోకి అడుగు పెట్టిన బుమ్రా తన బౌలింగ్ లయను అందుకొన్నాడు. దీంతో భారత బౌలింగ్‌ బలోపేతమైంది. క్రికెట్‌లో వికెట్లు దక్కడం మన చేతుల్లో లేదు. అయితే, అద్భుతంగా బౌలింగ్‌ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగాలి. కొన్నిసార్లు మెరుగ్గా వేసినా వికెట్లు దక్కవు. మరికొన్నిసార్లు సాధారణంగా బంతులను విసిరినా వికెట్లు వస్తాయి. బుమ్రా మాత్రం అద్భుతంగానే బౌలింగ్‌ వేశాడు. వికెట్లు ఎక్కువ రాకపోయినా బుమ్రా రిథమ్‌ బాగుంది. బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాలు పటిష్ఠంగా ఉండటంతో వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచేందుకు ఎక్కువ ఛాన్స్‌లు ఉన్నాయి’’ అని దీపక్ చాహర్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు