Dhoni: నాపై ధోనీ ప్రభావం ఉంది.. అందుకే అలా చేశా: దీపక్‌ చాహర్‌

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో బ్యాట్సమన్‌గానూ సత్తా చాటిన దీపక్‌ చాహర్‌ తనపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ప్రభావం అధికంగా ఉందన్నాడు. తాజాగా మూడో వన్డేకు ముందు నిర్వహించిన మీడియా...

Published : 23 Jul 2021 01:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో బ్యాట్స్‌మన్‌గానూ సత్తా చాటిన దీపక్‌ చాహర్‌ తనపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ప్రభావం అధికంగా ఉందన్నాడు. తాజాగా మూడో వన్డేకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో అతడు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. రెండో వన్డేలో 160 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిల్చున్న టీమ్‌ఇండియాను చాహర్‌ (69 నాటౌట్‌; 82 బంతుల్లో 7x4, 1x6) ఒంటి చేత్తో గెలిపించాడు. భువనేశ్వర్‌ (19; 28 బంతుల్లో 2x4)తో కలిసి చివరి ఓవర్‌ వరకూ క్రీజులో పాతుకుపోయి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించాడు.

‘నాపై ధోనీ ప్రభావం చాలా ఉంది. అతడు చెన్నై జట్టులోనే కాకుండా భారత జట్టులోనూ మ్యాచ్‌లను ఎంత ఉత్కంఠ పరిస్థితులకు తీసుకెళ్తాడో మనమంతా చూశాం. మ్యాచ్‌ జరిగేటప్పుడు ఎప్పుడు మాట్లాడినా ఆటను చివరి వరకూ తీసుకెళ్లే బాధ్యత నాపైనే ఉందని అంటాడు. అలా చేస్తేనే మ్యాచ్‌ ఉత్కంఠకు వెళ్తుందని అనేవాడు. దాంతో నేను కూడా రెండో వన్డేను అలాగే చివరివరకూ తీసుకెళ్లాలని అనుకున్నా. అదే నా ప్రణాళిక’ అని చాహర్‌ వివరించాడు. అనంతరం కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ గురించి మాట్లాడుతూ.. ఆయన నేతృత్వంలో టీమ్‌ఇండియా తరఫున ఇదే తొలి పర్యటన అని, ఇండియా-ఏలో ఆడేటప్పుడు పలు పర్యటనలకు వెళ్లానని చాహర్‌ గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అప్పుడు పలు సందర్భాల్లో తాను బ్యాటింగ్‌ చేయడం ద్రవిడ్‌ గుర్తించాడని చెప్పాడు. ఇప్పుడు కూడా అలాంటి అవకాశమే రావడంతో మ్యాచ్‌ గెలిపించానని చాహర్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని