Deepak Chahar: ధోనీ వల్లే అది సాధ్యమైంది.. ఇద్దరం పబ్‌జీ ఆడేవాళ్లం: దీపక్‌ చాహర్‌

భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ (Mahendra Singh Dhoni) ఇంకా రెండు, మూడు ఐపీఎల్‌ సీజన్‌లు ఆడగలడని చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేసర్‌ దీపక్‌ చాహర్‌ (Deepak Chahar) అభిప్రాయపడ్డాడు.

Updated : 30 Jan 2024 12:24 IST

ముంబయి: భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ (Mahendra Singh Dhoni) ఇంకా రెండు, మూడు ఐపీఎల్‌ సీజన్‌లు ఆడగలడని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు, టీమ్‌ఇండియా పేసర్‌ దీపక్‌ చాహర్‌ (Deepak Chahar) అన్నాడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో మోకాలి గాయం కారణంగా టోర్నీ మొత్తం ఇబ్బంది పడ్డ ధోనీ శస్త్ర చికిత్స చేయించుకుని ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడని చెప్పాడు. 

‘‘ధోనీ క్రికెట్‌కు ఇవ్వాల్సింది చాలా ఉంది. ఇంకా 2-3 ఐపీఎల్‌ సీజన్‌లు ఆడగలిగే సత్తా అతడిలో ఉంది. అలా ఆడాలని నేను కోరుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. తుది నిర్ణయం ధోనీదే. గాయం నుంచి త్వరగా కోలుకున్నాడు. అతడు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేయడం నేను చూశాను. తన చివరి మ్యాచ్‌ చెన్నైలోనే అని అందరికీ చెప్పాడు. ధోనీ లేకుండా చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును ఊహించడం కష్టమే. సీఎస్‌కే (CSK) అంటేనే మహీ భాయ్‌.

ధోనీకి క్లోజ్‌ అవ్వడానికి నాకు 2 - 3 ఏళ్లు పట్టింది. అతడిని నా పెద్ద అన్నయ్యలా చూస్తాను. ధోనీ నన్ను తమ్ముడిగా భావిస్తాడు. మా ఇద్దరి మధ్య సరదా క్షణాలు చాలా ఉన్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఇద్దరం కలిసి పబ్‌జీ (PUBG) ఆడేవాళ్లం. మైదానం వెలుపల అతడితో చాలా సమయం గడిపాను. అతడి నుంచి చాలా నేర్చుకున్నాను. అది నా అదృష్టం. కేవలం ధోనీ భాయ్‌ వల్లే నేను టీమ్‌ఇండియాకు (Team India) ఆడగలిగాను. అంతకుముందు 2018 ఐపీఎల్‌ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇచ్చాడు’’ అని దీపక్ చాహర్‌ తెలిపాడు. 

వ్యక్తిగత కారణాల వల్ల దక్షిణాఫ్రికా పర్యటన, అఫ్గానిస్థాన్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌కు దీపక్ చాహర్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. రాబోయే IPL సీజన్‌లో సత్తా చాటి T20 ప్రపంచ కప్ 2024 జట్టులో స్థానం సంపాదించాలని చూస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని