Ashes : ఇంగ్లాండ్‌లో టెస్టు క్రికెట్‌ బతకాలంటే వారిని ఐపీఎల్‌కు పంపొద్దు..

 ఇంగ్లాండ్‌లో టెస్టు క్రికెట్‌ బతకాలంటే ఆటగాళ్లను...

Updated : 16 Feb 2022 14:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌లో టెస్టు క్రికెట్‌ బతకాలంటే ఆటగాళ్లను ఐపీఎల్‌కు పంపించకూడదని దక్షిణాఫ్రికా మాజీ కోచ్‌, ఆసీస్‌ మాజీ ఆటగాడు మికీ ఆర్థర్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మికీ ఆర్థర్‌ డెర్బీషైర్‌ కౌంటీకి హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ‘‘ యాషెస్‌ సిరీస్‌లో తగినన్ని పరుగులు చేయడంలో ఇంగ్లాండ్‌ క్రికెటర్లు విఫలం చెందారు. అందుకు కౌంటీ క్రికెట్‌ను నిందించాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ ఆటగాళ్లను అందించిన చరిత్ర కౌంటీ క్రికెట్‌కు ఉంది. ఇక్కడ సిస్టమ్‌లో ఎలాంటి లోపం లేదని భావిస్తున్నా. వచ్చే సీజన్‌కైనా జట్టును బలోపేతం చేయాలంటే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అందులో భాగంగా ఐపీఎల్‌కు ఆటగాళ్లను పంపించడం ఆపేయాలి. టెస్టు సిరీస్‌కు ముందు పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌ను ఆడుతున్నారు. అదే కౌంటీల్లో సాధన చేయడం వల్ల టెస్టులకు సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది’’’ అని మికీ పేర్కొన్నాడు. 

ఆసీస్‌ గడ్డపై జరిగిన యాషెస్‌ సిరీస్‌ను 4-0 తేడాతో ఇంగ్లాండ్‌ చేజార్చుకుంది. ఇక అప్పటి నుంచి ఇంటా, బయటా విమర్శలు చెలరేగాయి. కెప్టెన్సీ నుంచి రూట్‌ను తప్పించి బెన్‌స్టోక్స్‌కు జట్టు పగ్గాలు అప్పగించాలని డిమాండ్లు వచ్చాయి. ప్రధాన కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్, బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాహమ్‌ థోర్ప్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆష్లే గైల్స్‌లకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఉద్వాసన పలికింది. ఇంగ్లాండ్‌కు చెందిన బెన్‌స్టోక్స్‌, బెయిర్‌ స్టో, జోస్ బట్లర్‌, జాసన్‌ రాయ్‌, డేవిడ్ మలన్‌, క్రిస్‌ జొర్డాన్‌, జోఫ్రా ఆర్చర్‌ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడినవారే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని