Team India: పీఆర్‌ టీమ్‌లు వ్యక్తిగత ప్రదర్శన చేయవు.. రోహిత్‌లా చేస్తే చాలు: గౌతమ్‌ గంభీర్‌

వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) సెమీస్‌ రేసు ఆసక్తికరంగా సాగుతోంది. అయితే, టీమ్‌ఇండియా మాత్రం దాదాపు సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకుంది. రోహిత్ శర్మ నాయకత్వంలో విజయాలతో దూసుకుపోతోంది.

Updated : 30 Oct 2023 13:42 IST

ఇంటర్నెట్ డెస్క్: రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలోని టీమ్‌ఇండియా వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. రోహిత్‌, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. తామేం తక్కువ కాదని బౌలర్లూ నిరూపించారు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌, నాయకత్వ తీరు తననెంతో ముగ్ధుడిని చేసిందని భారత మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్ (Gautham Gambhir) వెల్లడించాడు. సారథి అంటే ఇలాగే ఉండాలని.. జట్టు నుంచి తనకేం కావాలనేది ఆశించినప్పుడు అదే ఆటతీరును కెప్టెన్‌ కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ ప్రదర్శన ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు.

‘‘నాయకుడిగా జట్టులోని ఇతర ఆటగాళ్ల నుంచి ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నామో.. వ్యక్తిగతంగా అదే ఆటతీరును ప్రదర్శించాలి. అప్పుడే జట్టును ఆత్మవిశ్వాసంతో ముందుండి నడిపించేందుకు అవకాశం లభిస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా పీఆర్‌ టీమ్‌లు (పబ్లిక్‌ రిలేషన్స్), మార్కెటింగ్‌ ఏజెన్సీలు అవసరం లేదు. మన వ్యక్తిగత ప్రదర్శనను వారేమీ చేయరు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ చేసిందిదే. మొదట జట్టుకు అవసరమైన సమయంలో క్రీజ్‌లో నిలబడి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు చేసిన 87 పరుగులు సెంచరీతో సమానం. ఆ తర్వాత బౌలర్లను వినియోగించుకున్న తీరు అభినందనీయం. 

అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ ఐదు లేదా పదో స్థానంలోఉండొచ్చు. కానీ, ప్రధాన లక్ష్యం మాత్రం నవంబర్ 19న టైటిల్‌ను ఎత్తుకోవడమే కావాలి. నీ లక్ష్యం సెంచరీ మీద సెంచరీలు చేయడమా..? లేకపోతే వరల్డ్‌ కప్‌ను అందుకోవడమా? అనేది నిర్ణయించుకోవాలి. ఒకవేళ నీ లక్ష్యం శతకం చేయడమే అయితే అలానే ఆడు. ఒకవేళ కప్‌ను సగర్వంగా అందుకోవాలనే లక్ష్యమే ఉంటే నిస్వార్థ సారథిగా ఆడాలి. ఇప్పటి వరకు రోహిత్ ఇదే మార్గంలో ఉన్నాడు. ఇంకా అతడి నుంచి మరింత ఆశిస్తున్నా. తప్పకుండా సాధిస్తాడనే నమ్మకం ఉంది’’ అని గౌతమ్ గంభీర్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని