Hardik - Rishabh : హార్దిక్‌ - పంత్.. ఆ దిగ్గజాల లోటును పూరిస్తారు..!

ఇంగ్లాండ్‌తో కీలకమైన మూడో వన్డేలో టీమ్‌ఇండియాను గెలిపించిన బ్యాటర్ల ద్వయం హార్దిక్‌ పాండ్య - రిషభ్‌ పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది...

Updated : 19 Jul 2022 12:56 IST

టీమ్‌ఇండియా మాజీ సారథి సునీల్‌ గావస్కర్

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో కీలకమైన మూడో వన్డేలో టీమ్‌ఇండియాను గెలిపించిన బ్యాటర్ల ద్వయం హార్దిక్‌ పాండ్య - రిషభ్‌ పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 72 పరుగులకే టాప్‌ఆర్డర్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో పాండ్య-పంత్‌  133 పరుగులను జోడించారు. హార్దిక్‌ (71) ఔటైనప్పటికీ రిషభ్‌ పంత్ (125*) సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది. ఈ క్రమంలో హార్దిక్ - పంత్ జోడీని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ అభినందించాడు. వీరిని చూస్తుంటే ఒకప్పుడు ఎంఎస్ ధోనీ - యువరాజ్‌సింగ్‌ను చూసినట్లు ఉందని పేర్కొన్నాడు. 

టీమ్‌ఇండియా మాజీ సారథి ధోనీ, యువరాజ్‌ సింగ్ కలిసి ఎన్నో మ్యాచ్‌లను గెలిపించారని.. మరీ ముఖ్యంగా ప్రపంచకప్‌ ఫైనల్‌ అందరికీ గుర్తుండిపోతుందని గావస్కర్‌ తెలిపాడు. వీరి లోటును హార్దిక్‌ - పంత్ పూరిస్తారని స్పష్టం చేశాడు. ‘‘తప్పకుండా ఇది జరిగి తీరుతుంది. ధోనీ-యువీ జోడీ లేని లోటును పంత్ - హార్దిక్‌ తీరుస్తారు. వీరి కొట్టిన బౌండరీలు కూడా ధోనీ, యువీ బ్యాటింగ్‌ను తలపించాయి. వికెట్ల మధ్య పరుగులు తీసిన విధానం కూడా అలానే ఉంది. ఇలాంటి మరిన్ని ప్రదర్శనలతో పాండ్య-పంత్ క్రికెట్‌ అభిమానుల మనసులను గెలుచుకుంటారని భావిస్తున్నా’’ అని గావస్కర్‌ వివరించాడు. 2005 - 2017 మధ్య ధోనీ-యువీ కలిసి 67 ఇన్నింగ్స్‌ల్లో 51.75 సగటుతో 3,105 పరుగులను జోడించారు. అందులో పదిసార్లు శతకం, 13సార్లు అర్ధ శతక భాగస్వామ్యాలను నమోదు చేశారు. అత్యధిక పార్టనర్‌షిప్ నాలుగో వికెట్‌కు 256 పరుగులు కావడం విశేషం. 

కోహ్లీతో ఓ 20 నిమిషాలు మాట్లాడితే.. 

విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే ఏం చేయాలో గావస్కర్‌ చెప్పాడు. ‘‘నేను విరాట్‌తో ఓ 20 నిమిషాలు వెచ్చిస్తే.. అతడు చేయాల్సిన పనులను చెబుతా. కోహ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు పూర్తిగా ఉపయోగపడుతుందని చెప్పలేను కానీ.. సాయపడుతుంది. ఆఫ్‌ స్టంప్‌ ఆవల బంతుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంతకాలంగా పరుగులు చేయలేకపోవడంతో ప్రతి బంతిని ఆడాలని భావిస్తుంటాడు. అందుకే బౌలర్లకు దొరికిపోతున్నాడు. ఇంగ్లాండ్‌ పర్యటనలో అద్భుతమైన డెలివరీలను ఎదుర్కోవాల్సి వచ్చింది’’ అని గావస్కర్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని