IND vs NZ: ఎవరిదో సిరీస్‌?

ధనాధన్‌ ఆటలో ఆఖరి పోరుకు వేళైంది. నిర్ణయాత్మక మూడో టీ20 నేడే. ఇటు భారత్‌.. అటు న్యూజిలాండ్‌ గట్టి పోటీకి సిద్ధమవుతున్నాయి. సమవుజ్జీల మధ్య రసవత్తర పోరు ఖాయం. టీమ్‌ఇండియా బ్యాటింగ్‌లో పుంజుకోవాల్సివుంది.

Updated : 01 Feb 2023 08:00 IST

భారత్‌ × కివీస్‌ చివరి టీ20 నేడు
రాత్రి 7 గంటల నుంచి

ధనాధన్‌ ఆటలో ఆఖరి పోరుకు వేళైంది. నిర్ణయాత్మక మూడో టీ20 నేడే. ఇటు భారత్‌.. అటు న్యూజిలాండ్‌ గట్టి పోటీకి సిద్ధమవుతున్నాయి. సమవుజ్జీల మధ్య రసవత్తర పోరు ఖాయం. టీమ్‌ఇండియా బ్యాటింగ్‌లో పుంజుకోవాల్సివుంది.

సొంతగడ్డపై మరోసారి సిరీస్‌ను చేజిక్కించుకోవాలనుకుంటున్న టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌తో ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. బుధవారమే చివరిదైన మూడో టీ20. వన్డే సిరీస్‌ను కోల్పోయినా టీ20ల్లో గట్టిగా పోటీపడుతోన్న కివీస్‌ కనీసం పొట్టి సిరీస్‌నైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. కానీ సొంతగడ్డ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తిరుగులేని రికార్డున్న భారత్‌ను ఓడించడం ఆ జట్టుకు సవాలే. 2012లో ఏకైక టీ20 మినహా.. భారత్‌లో ఏ ఫార్మాట్లో కూడా కివీస్‌ ఇప్పటివరకు సిరీస్‌ నెగ్గలేదు. అయితే ఇప్పుడు ఈ పొట్టి సిరీస్‌ను నెగ్గాలంటే టీమ్‌ఇండియా కూడా మెరుగుపడాల్సివుంది. మొదటి టీ20లో కివీస్‌.. రెండో టీ20లో భారత్‌ విజయంతో   సిరీస్‌ 1-1తో సమంగా ఉంది.

ఒత్తిడిలో భారత టాప్‌ఆర్డర్‌

గత పదేళ్లలో సొంతగడ్డపై తిరుగులేని రికార్డు భారత్‌ సొంతం. వివిధ ఫార్మాట్లలో 55 ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడిన ఆ జట్టు 47 గెలిచింది. 2019లో ఆస్ట్రేలియా, 2015లో దక్షిణాఫ్రికా మాత్రమే భారత్‌ను ఓడించగలిగాయి. ఇదే జోరుతో ఈ సిరీస్‌నూ చేజిక్కించుకోవాలనుకుంటోంది భారత్‌. అయితే   అందుకోసం భారత్‌ గట్టిగా పుంజుకోవాల్సివుంది. రెండో టీ20లో   100 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికే ఆతిథ్య జట్టు అపసోపాలు పడ్డ సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత టాప్‌ ఆర్డర్‌ పరుగులు బాట పట్టాల్సివుంది. రోహిత్‌, కోహ్లి గైర్హాజరీలో ఈ సిరీస్‌లో తమకు వచ్చిన అవకాశాలను శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ త్రిపాఠి సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈ మ్యాచ్‌లో వీరిపై ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇషాన్‌ లయ అందుకోలేకపోతున్నాడు. వన్డే సిరీస్‌లో అదరగొట్టిన గిల్‌.. అదే ప్రదర్శనను ఈ సిరీలో పునరావృతం చేయలేకపోయాడు. టర్నింగ్‌ బాల్‌కు గిల్‌ ఇబ్బందిపడుతున్నాడు. రెగ్యులర్‌ నంబర్‌-3 కోహ్లి గైర్హాజరీలో త్రిపాఠి కూడా అవకాశాలను వృథా చేసుకున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య నిలవకపోయుంటే రెండో టీ20లో భారత్‌ గెలిచేది కాదు. లఖ్‌నవూలో క్లిష్టమైన పిచ్‌పై కష్టపడ్డ సూర్య.. ఈ మ్యాచ్‌లో తనదైన శైలిలో చెలరేగాలని జట్టు ఆశిస్తోంది. ఇక బౌలింగ్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌  ఫామ్‌లో ఉండడం, గత మ్యాచ్‌లో దీపక్‌ హుడా కూడా రాణించడం భారత్‌కు  సానుకూలాంశాలే. నోబాల్స్‌ ఇబ్బంది నుంచి బయటపడుతూ లఖ్‌నవూలో ఉత్తమంగా బౌలింగ్‌ చేయడం ఫాస్ట్‌బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. చాహల్‌ స్థానంలో ఫాస్ట్‌బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. అతడు అర్ష్‌దీప్‌, శివమ్‌ మావితో కలిసి పేస్‌ బాధ్యతలు పంచుకోవచ్చు.

పట్టుదలతో కివీస్‌

తొలి మ్యాచ్‌లో నెగ్గి, రెండో మ్యాచ్‌లో తక్కువ స్కోరే చేసినా గట్టి పోటీనే ఇచ్చిన న్యూజిలాండ్‌ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. సిరీస్‌ గెలవాలనే పట్టుదలతో ఉంది. పిచ్‌ స్పిన్‌కు విపరీతంగా సహకరించిన రెండో టీ20లో విఫలమైనప్పటికీ.. కాన్వే, అలెన్‌, మిచెల్‌ మంచి ఊపుమీదే ఉన్నారు. తమ మిడిలార్డర్‌ రాణించాలని కివీస్‌ కోరుకుంటోంది. గ్లెన్‌ ఫిలిప్స్‌ తన అత్యుత్తమ ఫామ్‌లో లేడు. వన్డే సిరీస్‌ సంచలనం బ్రాస్‌వెల్‌ కూడా మంచి ఇన్నింగ్స్‌ బాకీ ఉన్నాడు నంబర్‌-3 చాప్‌మన్‌ కూడా ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌ ఆడాలని కివీస్‌ ఆశిస్తోంది. శాంట్నర్‌, సోధి, ఫెర్గూసన్‌ వంటి వారితో కివీస్‌ బౌలింగ్‌ బాగానే ఉంది.

తుది జట్లు (అంచనా)... భారత్‌: శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ త్రిపాఠి, సూర్యకుమార్‌, హార్దిక్‌, దీపక్‌ హుడా, సుందర్‌, శివమ్‌ మావి, కుల్‌దీప్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌.
న్యూజిలాండ్‌: ఫిన్‌ అలెన్‌, కాన్వే, చాప్‌మన్‌, ఫిలిప్స్‌, మిచెల్‌, బ్రాస్‌వెల్‌, శాంట్నర్‌, ఇష్‌ సోధి, ఫెర్గూసన్‌, డఫీ, టిక్నర్‌.


పిచ్‌

ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియమైన నరేంద్ర మోదీ స్టేడియం నిర్ణయాత్మక మూడో టీ20కి ఆతిథ్యమివ్వనుంది. ఈ పిచ్‌పై సాధారణంగా భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. ఈసారి కూడా వికెట్‌ బ్యాటర్లకు అనుకూలించనుంది. స్పిన్నర్లకూ సహకారం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని