Kane Williamson: షమి అద్భుతం.. టీమ్‌ఇండియా అత్యుత్తమం: విలియమ్సన్‌

మహమ్మద్‌ షమి బౌలింగ్‌ అద్భుతమని, ప్రపంచ క్రికెట్లో టీమ్‌ఇండియా అత్యుత్తమ జట్టు అని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ పేర్కొన్నాడు. సెమీస్‌లో భారత్‌ చేతిలో ఓటమి తర్వాత మాట్లాడుతూ..

Updated : 17 Nov 2023 05:30 IST

ముంబయి: మహమ్మద్‌ షమి బౌలింగ్‌ అద్భుతమని, ప్రపంచ క్రికెట్లో టీమ్‌ఇండియా అత్యుత్తమ జట్టు అని న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ పేర్కొన్నాడు. సెమీస్‌లో భారత్‌ చేతిలో ఓటమి తర్వాత మాట్లాడుతూ.. ‘‘షమి బౌలింగ్‌ అద్భుతం. ఈ టోర్నీలో దాదాపు సగం మ్యాచ్‌లే ఆడిన షమి ఇప్పుడు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. అది కూడా ఇద్దరు కొత్తబంతి బౌలర్ల తర్వాత బౌలింగ్‌ మార్పు కోసం వస్తూ షమి సత్తాచాటుతున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో అతనొకడు అనడంలో సందేహం లేదు. అతను బంతిని కదిలించే విధానం, స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకునే తీరు గొప్పగా ఉంది. మరోవైపు అన్ని విభాగాల్లోనూ టీమ్‌ఇండియా సత్తాచాటుతోంది. ప్రపంచంలో ఇప్పుడదే అత్యుత్తమ జట్టు. ఉత్తమ క్రికెట్‌ ఆడుతున్న ఆ జట్టును ఎదుర్కోవడం కష్టం’’ అని విలియమ్సన్‌ చెప్పాడు. వన్డేల్లో 50వ శతకాన్ని అందుకుని చరిత్ర సృష్టించిన కోహ్లి గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదని విలియమ్సన్‌ అన్నాడు. ‘‘కోహ్లి గురించే చెప్పేందుకు మాటలు వెతుక్కుంటున్నా. జట్టు కోసం మ్యాచ్‌లు గెలుస్తూ సాగుతున్న అతను ఉత్తమ ఆటగాడు. అతను మరింత మెరుగయ్యేందుకే ప్రయత్నిస్తున్నాడు. ఇది ప్రత్యర్థి జట్లను భయపెడుతోంది’’ అని అతను తెలిపాడు. సెమీస్‌ కోసం పిచ్‌ మార్పుపై స్పందించిన విలియమ్సన్‌ అదేమీ సమస్య కాదని వెల్లడించాడు. ‘‘ఇప్పటికే ఉపయోగించిన పిచ్‌పై మ్యాచ్‌ జరిగింది. అది మంచి పిచ్‌. మొదట భారత్‌ భారీ స్కోరు చేసింది. ఆట సాగుతున్నా కొద్దీ పరిస్థితులు మారుతాయని తెలుసు. ఇందులో ఇబ్బంది లేదు. భారత్‌ చాలా బాగా ఆడింది’’ అని అతను పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని