వరుణుడు కరుణించేనా?

వర్షం కారణంగా దక్షిణాఫ్రికాతో తొలి టీ20 రద్దు కావడంతో భారత కుర్రాళ్లు విలువైన మ్యాచ్‌ సమయం కోల్పోయారు. వరుణుడు కరుణించాలని ఆశిస్తూ మంగళవారం రెండో టీ20కి సిద్ధమయ్యారు. కానీ ఆందోళన కలిగించే విషయమేంటంటే.. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. వాన వల్ల డర్బన్‌లో టాస్‌ కూడా పడని సంగతి తెలిసిందే.

Updated : 12 Dec 2023 06:55 IST

దక్షిణాఫ్రికాతో భారత్‌ రెండో టీ20 నేడు
రాత్రి 8.30 నుంచి  
గబేహా (దక్షిణాఫ్రికా)

ర్షం కారణంగా దక్షిణాఫ్రికాతో తొలి టీ20 రద్దు కావడంతో భారత కుర్రాళ్లు విలువైన మ్యాచ్‌ సమయం కోల్పోయారు. వరుణుడు కరుణించాలని ఆశిస్తూ మంగళవారం రెండో టీ20కి సిద్ధమయ్యారు. కానీ ఆందోళన కలిగించే విషయమేంటంటే.. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. వాన వల్ల డర్బన్‌లో టాస్‌ కూడా పడని సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు ఇప్పుడు అయిదు మ్యాచ్‌లే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఏడాది జూన్‌లో జరిగే మెగా టోర్నీకి జట్టు ఎంపికలో ఆటగాళ్ల ఐపీఎల్‌ ప్రదర్శన కీలకం కానుంది. ప్రస్తుత సిరీస్‌కు సెలక్షన్‌ కమిటీ.. 17 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. మిగిలిన ఈ రెండు మ్యాచ్‌ల్లో అందరికీ అవకాశం దొరకడం కష్టం. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఆకట్టుకున్న వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ.. దక్షిణాఫ్రికాపైనా ఆడే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మెరుపు సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ రుతురాజ్‌కు ఇక్కడ ఆడే అవకాశం లభిస్తుందా అన్నది సందేహమే. ఆ సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న శుభ్‌మన్‌ గిల్‌.. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశాలు మెండు. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌, రింకులతో బ్యాటింగ్‌ లైనప్‌ బాగానే కనిపిస్తోంది. సిరాజ్‌, అర్ష్‌దీప్‌, ముకేశ్‌ కుమార్‌ పేస్‌ బాధ్యతలు పంచుకోవచ్చు. ఇక స్పిన్‌ విభాగంలో జడేజాకు తోడుగా రవి బిష్ణోయ్‌ను ఆడించే అవకాశముంది. సూపర్‌ ఫాంలో  ఉన్న బిష్ణోయ్‌ ఇటీవలే టీ20ల్లో నంబర్‌వన్‌ బౌలర్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే.

ఆట సాగేనా?

వాతావరణం ఆటకు అనుకూలంగా లేదు. రెండో టీ20కి కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్‌ సజావుగా సాగడం అనుమానమే. మ్యాచ్‌ వేదిక సెయింట్‌ జార్జ్‌ పార్క్‌లో పిచ్‌ స్వభావాన్ని అంచనా వేయడం కష్టమే. ఇక్కడ కొన్నిసార్లు బ్యాటర్లు, కొన్నిసార్లు బౌలర్లు సత్తా చాటారు. పిచ్‌ నుంచి ఆరంభంలో పేస్‌ బౌలర్లకు సహకారం లభించవచ్చు. ఛేదనలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

తుది జట్లు (అంచనా)...

భారత్‌: యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌, సూర్యకుమార్‌, రింకు సింగ్‌, జితేశ్‌ శర్మ, జడేజా, ముకేశ్‌ కుమార్‌, రవి బిష్ణోయ్‌, సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

దక్షిణాఫ్రికా: హెండ్రిక్స్‌, బ్రీజ్కె, మార్‌క్రమ్‌, క్లాసెన్‌, మిల్లర్‌, ఫెరీరా, జాన్సన్‌, కేశవ్‌ మహరాజ్‌, కొయెట్జీ, నంద్రీ బర్గర్‌, షంసి


సాకులు వద్దు.. కవర్లతో కప్పండి

దిల్లీ: వర్షం కురుస్తున్నప్పుడు మైదానాన్ని సంరక్షించే విషయంలో ఈడెన్‌ గార్డెన్స్‌ నమూనాను అనుసరించాలంటూ క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ)కు దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ సూచించాడు. ఆదివారం డర్బన్‌లో దక్షిణాఫ్రికా, భారత్‌ మధ్య తొలి టీ20 మ్యాచ్‌ వర్షార్పణమైన నేపథ్యంలో ఈడెన్‌   తరహాలో మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచాలని గావస్కర్‌ అన్నాడు. ‘‘ఇప్పుడు క్రికెట్‌ బోర్డులు చేయాల్సిందల్లా మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచడం. సాకులు చెప్పకూడదు. అన్ని బోర్డుల దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది. మనం పొరపాటు చేయకూడదు. క్రికెట్‌ బోర్డుల దగ్గర డబ్బు లేదంటే వాళ్లు అబద్ధం చెబుతున్నట్లే. బీసీసీఐ దగ్గర ఉన్నంతగా మిగతా బోర్డుల దగ్గర లేకపోవచ్చు. కాని కవర్ల కొనుగోలుకు కావాల్సినంత డబ్బు బోర్డుల దగ్గర ఉంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో ఒకసారి టెస్టు మ్యాచ్‌ రద్దయింది. ఆ తర్వాతి మ్యాచ్‌కు ఈడెన్‌ మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పారు. అలాంటి చొరవ కావాలి. ఈడెన్‌ వైపు ఎవరూ వేలెత్తి చూపకుండా సౌరభ్‌ గంగూలీ చూసుకున్నాడు’’ అని గావస్కర్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు