Rahul Dravid: అందుకే ఇషాన్‌, శ్రేయస్‌ను ఎంపిక చేయలేదు

అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌కు చోటు దక్కలేదు. దీంతో క్రమశిక్షణారాహిత్యం కారణంగానే వీళ్లపై వేటు వేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అలాంటిదేమీ లేదని టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వెల్లడించాడు.

Updated : 11 Jan 2024 09:41 IST

మొహాలి: అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌కు చోటు దక్కలేదు. దీంతో క్రమశిక్షణారాహిత్యం కారణంగానే వీళ్లపై వేటు వేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అలాంటిదేమీ లేదని టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వెల్లడించాడు. ‘‘క్రమశిక్షణ చర్యలేం కాదు. సెలక్షన్‌కు ఇషాన్‌ దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో విరామం కావాలని కోరడంతో ఒప్పుకున్నాం. అతను తిరిగి జట్టులోకి రావాలనుకుంటే దేశవాళీ క్రికెట్లో సత్తాచాటి సెలక్షన్‌కు అందుబాటులో ఉండాలి. జట్టులో పోటీ కారణంగానే శ్రేయస్‌ను ఎంపిక చేయలేదు. దక్షిణాఫ్రికాతో టీ20ల్లోనూ అతనాడలేదు. అతను ఉత్తమ బ్యాటరే కానీ 11 మంది జట్టులో అందరినీ ఆడించలేం కదా’’ అని అతను చెప్పాడు. జట్టు ప్రయోజనాలను అనుసరించే కూర్పుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ద్రవిడ్‌ తెలిపాడు. ‘‘ఇప్పటికైతే రోహిత్‌, యశస్వి ఓపెనర్లుగా ఆడతారు. జట్టు అవసరాలను బట్టి మార్పులు చేసుకునే సౌలభ్యం మనకుంది. ఓపెనర్‌గా జైస్వాల్‌ ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాం. అంతే కాకుండా ఓపెనింగ్‌లో కుడి, ఎడమ చేతి వాటం కూర్పు కూడా ఉంటుంది. కోహ్లి, రోహిత్‌ ఓపెనర్లుగా వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం. రోహిత్‌, కోహ్లి లాంటి ఆటగాళ్ల సామర్థ్యాలపై సందేహమే లేదు. రింకు, జైస్వాల్‌, తిలక్‌ లాంటి ఎడమ చేతి వాటం ఆటగాళ్లు జట్టులో ఉండటం మంచిదే. కానీ ప్రదర్శన ఆధారంగానే జట్టు ఎంపిక ఉంటుంది. ఫినిషర్‌ పాత్రలో రింకు రాణిస్తున్నాడు. మరింత వృద్ధి చెందేందుకు అతనికీ సిరీస్‌ మంచి అవకాశం. గత టీ20 ప్రపంచకప్‌ తర్వాత వన్డే ప్రపంచకప్‌పై దృష్టి పెట్టాం. కానీ ఈ టోర్నీ తర్వాత మాకు ఎక్కువగా టీ20లు ఆడే అవకాశం రాలేదు. ఈ సారి పొట్టి కప్పుకి సన్నద్ధమయేందుకు ఎక్కువ సమయం లేదు. మిగిలి ఉన్న మ్యాచ్‌లు, ఐపీఎల్‌పైనే కాస్త ఆధారపడాల్సి ఉంది. వివిధ టోర్నీలు, సిరీస్‌ల కారణంగా ఫార్మాట్లకు వేర్వేరు ప్రాధాన్యతలిస్తూ సాగాల్సి వస్తోంది. ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ టీ20 మ్యాచ్‌ల నుంచి బుమ్రా, జడేజా, సిరాజ్‌ను దూరం పెట్టాల్సి వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల అఫ్గాన్‌తో తొలి టీ20లో కోహ్లి ఆడట్లేదు. రెండు, మూడు టీ20ల్లో అతను బరిలో దిగుతాడు’’ అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని