చెన్నైదే చిందు

యువ కెప్టెన్ల పోరులో రుతురాజ్‌ గైక్వాడ్‌దే పైచేయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై ఖాతాలో వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్‌ను మించిన ప్రదర్శన చేస్తూ అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం చలాయిస్తూ సూపర్‌కింగ్స్‌.. గుజరాత్‌ టైటాన్స్‌ను చిత్తుగా ఓడించింది.

Updated : 27 Mar 2024 07:03 IST

గుజరాత్‌పై ఘనవిజయం
మెరిసిన దూబె, రచిన్‌
చెన్నై

యువ కెప్టెన్ల పోరులో రుతురాజ్‌ గైక్వాడ్‌దే పైచేయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై ఖాతాలో వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్‌ను మించిన ప్రదర్శన చేస్తూ అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం చలాయిస్తూ సూపర్‌కింగ్స్‌.. గుజరాత్‌ టైటాన్స్‌ను చిత్తుగా ఓడించింది. దూబె, రచిన్‌ మెరుపు బ్యాటింగ్‌తో చెన్నైకి భారీ స్కోరును అందిస్తే.. దీపక్‌ చాహర్‌, తుషార్‌ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థికి కళ్లెం వేశారు.

పీఎల్‌-17లో చెన్నై సూపర్‌కింగ్స్‌ అదరగొట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో శుభ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని గుజరాత్‌ టైటాన్స్‌ను మట్టికరిపించింది. శివమ్‌ దూబె (51; 23 బంతుల్లో 2×4, 5×6), రచిన్‌ రవీంద్ర (46; 20 బంతుల్లో 6×4, 3×6)ల విధ్వంసంతో మొదట చెన్నై 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (46; 36 బంతుల్లో 5×4, 1×6) కూడా విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఛేదనలో టైటాన్స్‌ తడబడింది. 8 వికెట్లకు 143 పరుగులే చేయగలిగింది. సాయి సుదర్శన్‌ (37; 31 బంతుల్లో 3×4) టాప్‌ స్కోరర్‌. తుషార్‌ దేశ్‌పాండే (2/21), దీపక్‌ చాహర్‌ (2/28), ముస్తాఫిజుర్‌ (2/30) టైటాన్స్‌ను దెబ్బతీశారు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన పతిరన (1/29) కూడా రాణించాడు.

తేలిపోయిన టైటాన్స్‌: భారీ ఛేదనలో టైటాన్స్‌ ఏమాత్రం పోటీలో నిలవలేదు. ఏ దశలోనూ అవసరమైనంత వేగంతో ఆడలేకపోయింది. ఆద్యంతమూ వెనుకబడిపోయిన ఆ జట్టు ఎప్పుడూ గెలిచేలా కనిపించలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ లక్ష్యాన్ని చాలా క్లిష్టం చేసుకుంది. దీపక్‌ చాహర్‌, తుషార్‌ దేశ్‌పాండే చాలా పొదుపుగా బౌలింగ్‌ చేశారు. వికెట్లూ తీశారు. చాహర్‌ మూడో ఓవర్లోనే ఓపెనర్‌ గిల్‌ (8)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడం ద్వారా గుజరాత్‌ను గట్టి దెబ్బతీశాడు. సాహా (21) మెరిసినా.. అది కాసేపే. విజయ్‌ శంకర్‌ (12) కూడా విఫలమయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి 57/3 నిలిచింది టైటాన్స్‌. అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్‌ 12 దాటిపోయింది. సాయి సుదర్శన్‌ ఓ వైపు క్రీజులో నిలబడ్డా.. ధాటిగా ఆడలేకపోవడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతూ పోయిందే తప్ప తగ్గలేదు. కానీ విధ్వంసకారుడు మిల్లర్‌ (21) క్రీజులో ఉండడంతో టైటాన్స్‌ ఆశలు సజీవంగానే ఉన్నాయి. కానీ తుషార్‌ బౌలింగ్‌లో రహానె అందుకున్న ఓ కళ్లు చెదిరే క్యాచ్‌కు అతడు కూడా నిష్క్రమించాడు. మరోవైపు సుదర్శన్‌ ఆటలో మాత్రం మార్పులేదు. బౌండరీలు కొట్టలేకపోయిన అతడు చివరికి 15వ ఓవర్లో పతిరన బౌలింగ్‌లో నిష్క్రమించాడు. అప్పటికి స్కోరు 114. చివరి అయిదు ఓవర్లలో 93 పరుగులు చేయాల్సిన స్థితిలో గుజరాత్‌ ఓటమి ఖాయమైపోయింది. టెయిలెండర్లేమీ అద్భుతాలు చేయలేదు. చకచకా పెవిలియన్‌ చేరారు. ఓటమి అంతరాన్ని కూడా పెద్దగా తగ్గించలేకపోయారు. తెవాతియా (11 బంతుల్లో 6) కూడా బ్యాట్‌ ఝళిపించలేకపోయాడు.

దూబె, రచిన్‌ ధనాధన్‌: రచిన్‌ రవీంద్ర, శివమ్‌ దూబెల మెరుపు ఇన్నింగ్స్‌లతో అంతకుముందు చెన్నై భారీ స్కోరు సాధించింది. విధ్వంసక బ్యాటింగ్‌తో రచిన్‌ అదిరే ఆరంభాన్నిస్తే.. ఆ తర్వాత శివమ్‌ దూబె రెచ్చిపోయాడు. చెన్నై పిచ్‌ ఈసారి బ్యాటింగ్‌కు అనుకూలించింది. చెన్నై టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. రచిన్‌ స్వేచ్ఛగా చెలరేగుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్‌ రుతురాజ్‌ సహకరిస్తుండగా రచిన్‌ ధనాధన్‌ షాట్లతో అలరించాడు. ఉమేశ్‌, అజ్మతుల్లాల బౌలింగ్‌లో అతడు ఎడాపెడా సిక్స్‌లు, ఫోర్లు బాదేయడంతో చెన్నై 5 ఓవర్లకే 58/0తో నిలిచింది. కానీ తర్వాతి ఓవర్లోనే రచిన్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత దూకుడు పెంచిన రుతురాజ్‌.. రహానెతో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. 10 ఓవర్లకు 104/1తో చెన్నై తిరుగులేని స్థితిలో నిలిచింది. రెండో వికెట్‌కు 42 పరుగులు జోడించిన రహానె (12)ను సాయి కిశోర్‌ ఔట్‌ చేసినా.. వచ్చీ రావడంతోనే శివమ్‌ దూబె దంచుడు మొదలెట్టాడు. కిశోర్‌ తర్వాతి రెండు బంతుల్లో సిక్స్‌లు దంచేశాడు. రెండు ఓవర్ల పాటు స్కోరు వేగం తగ్గినా, రుతురాజ్‌ ఔటైనా.. దూబె టైటాన్స్‌ బౌలర్లను మరీ సంతోషపడనివ్వలేదు. రషీద్‌ ఓవర్లో, సిక్స్‌.. జాన్సన్‌ బౌలింగ్‌లో 4, 6 దంచేశాడు. మోహిత్‌నూ సిక్స్‌తో శిక్షించాడు. 22 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన అతడు. చివరికి 19వ ఓవర్లో రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మిచెల్‌ (24 నాటౌట్‌)తో నాలుగో వికెట్‌కు అతడు 57 పరుగులు జోడించాడు. మిచెల్‌ మాత్రం దూకుడుగా ఆడలేకపోయాడు. ఆఖర్లో కొన్ని బంతులే ఆడినా.. సమీర్‌ రిజ్వీ (14) ఆకట్టుకున్నాడు. ఎదుర్కొన్న తొలి బంతినే (బౌలర్‌ రషీద్‌) మోకాలిని వంచి స్వీప్‌తో సిక్స్‌గా మలిచిన అతడు.. తర్వాత మరో సిక్స్‌ కొట్టాడు. ఆఖరి ఓవర్లో రిజ్వీని మోహిత్‌ ఔట్‌ చేశాడు. రెండు పరుగులతో చెన్నై స్కోరును 200కు చేర్చిన జడేజా (7).. ఆ తర్వాత ఫోర్‌ కొట్టి, ఆఖరి బంతికి రనౌటయ్యాడు.

చెన్నై ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) సాహా (బి) జాన్సన్‌ 46; రచిన్‌ (స్టంప్డ్‌) సాహా (బి) రషీద్‌ 46; రహానె (స్టంప్డ్‌) సాహా (బి) సాయి కిశోర్‌ 12; దూబె (సి) శంకర్‌ (బి) రషీద్‌ 51; మిచెల్‌ నాటౌట్‌ 24; రిజ్వీ (సి) మిల్లర్‌ (బి) మోహిత్‌ 14; జడేజా రనౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 206; వికెట్ల పతనం: 1-62, 2-104, 3-127, 4-184, 5-199, 6-206; బౌలింగ్‌: ఒమర్‌జాయ్‌ 3-0-30-0; ఉమేశ్‌ 2-0-27-0; రషీద్‌ 4-0-49-2; సాయి కిశోర్‌ 3-0-28-1; స్పెన్సర్‌ 4-0-35-1; మోహిత్‌ 4-0-36-1

గుజరాత్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) తుషార్‌ (బి) చాహర్‌ 21; శుభ్‌మన్‌ ఎల్బీ (బి) చాహర్‌ 8; సుదర్శన్‌ (సి) రిజ్వీ (బి) పతిరన 37; శంకర్‌ (సి) ధోని (బి) మిచెల్‌ 12; మిల్లర్‌ (సి) రహానె (బి) తుషార్‌ 21; ఒమర్‌జాయ్‌ (సి) రచిన్‌ (బి) తుషార్‌ 11; తెవాతియా (సి) రచిన్‌ (సి) ముస్తాఫిజుర్‌ 6; రషీద్‌ (సి) రచిన్‌ (బి) ముస్తాఫిజుర్‌ 1; ఉమేశ్‌ నాటౌట్‌ 10; స్పెన్సర్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143; వికెట్ల పతనం: 1-28, 2-34, 3-55, 4-96, 5-114, 6-118, 7-121, 8-129; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-28-2;   ముస్తాఫిజుర్‌ 4-0-30-2; తుషార్‌ 4-0-21-2; జడేజా 2-0-15-0; మిచెల్‌ 2-0-18-1; పతిరన 4-0-29-1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని