జోడీ.. గురి.. కుదిరింది

ఆట వాళ్లకు జీవితాన్నిచ్చింది. ఆ ఆటే ఇద్దరినీ స్నేహితుల్ని చేసింది. తర్వాత ప్రేమికులుగా మార్చింది. పెళ్లి బంధంతో ఒక్కటయ్యేలా చేసింది. ఒకప్పుడు విడివిడిగా విజయాలు సాధించి గుర్తింపు పొందిన ఆ ఇద్దరూ.. ఇప్పుడు కలిసి అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు.

Updated : 29 Jun 2021 02:55 IST

ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్న ఆర్చరీ దంపతులు

టోక్యో ఒలింపిక్స్‌ ఇంకో 24 రోజుల్లో

ఈనాడు క్రీడావిభాగం

ఆట వాళ్లకు జీవితాన్నిచ్చింది. ఆ ఆటే ఇద్దరినీ స్నేహితుల్ని చేసింది. తర్వాత ప్రేమికులుగా మార్చింది. పెళ్లి బంధంతో ఒక్కటయ్యేలా చేసింది. ఒకప్పుడు విడివిడిగా విజయాలు సాధించి గుర్తింపు పొందిన ఆ ఇద్దరూ.. ఇప్పుడు కలిసి అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. ప్రపంచకప్‌లో పసిడి పంట పండించి అంతర్జాతీయ వేకదిపై భారత పతాకాన్ని రెపరెపలాడించిన ఆ జంటే.. దీపికా కుమారి, అతాను దాస్‌. ఒలింపిక్స్‌ ముంగిట పారిస్‌లో గొప్ప ప్రదర్శన చేసిన ఈ జోడీ.. విశ్వక్రీడల్లో పతకాశలు రేపుతూ టోక్యో విమానం ఎక్కబోతున్నారు.

దీపిక- అతాను దంపతులు ప్రపంచకప్‌ మూడో అంచె పోటీల్లో రికర్వ్‌ విభాగంలో మిక్స్‌డ్‌ టీమ్‌లో స్వర్ణాలతో సత్తా చాటారు. భర్తతో కలిసి ఓ బంగారు పతకం సాధించిన దీపిక.. మరో రెండు విభాగాల్లో (మహిళల జట్టు, వ్యక్తిగత)నూ అదే ప్రదర్శన పునరావృతం చేసింది. బుధవారం (జూన్‌ 30) తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న ఈ జంట.. ఈ ఏడాది కాలంలో ఆటలో ఎంతో మెరుగయ్యారు. వచ్చే నెల 23న ఆరంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఈ జోడీ.. ఆ క్రీడల్లో వేర్వేరుగా తలపడనున్నారు. పురుషుల రికర్వ్‌ జట్టుతో పాటు వ్యక్తిగత విభాగంలో అతాను బరిలో దిగుతుండగా.. మహిళల వ్యక్తిగత కేటగిరీలో దీపిక తలపడనుంది.

అలా కలిసి..: అతాను, దీపికలను ఆర్చరీనే కలిపింది. 2008లో ఓ అకాడమీలో వీళ్లకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత చాలా కాలం వరకూ పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ కలిసే టోర్నీలకు వెళ్లడంతో కొన్నేళ్ల తర్వాత వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంతకాలం ప్రణయంలో మునిగి తేలిన వీళ్లు.. 2018లో నిశ్చితార్థం చేసుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌ ముగిశాక పెళ్లి చేసుకుందామని మొదట నిర్ణయించుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆ విశ్వ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడడంతో గతేడాది వివాహం చేసుకున్నారు. ఇప్పుడీ క్రీడల్లో భార్యాభర్తలుగా బరిలో దిగనున్నారు. ఇప్పటికే గత రెండు (2012, 2016) ఒలింపిక్స్‌ల్లో పోటీపడ్డ దీపికాకు.. ఇది ముచ్చటగా మూడో ఒలింపిక్స్‌. మరోవైపు అతానుకిది రెండో ఒలింపిక్స్‌. గత క్రీడల్లో అతను పాల్గొన్నాడు. అయితే గతంలో కంటే ఇప్పుడు వీళ్లిద్దరి ప్రదర్శన అత్యుత్తమంగా సాగుతోంది. లాక్‌డౌన్‌లో తీవ్రంగా సాధన చేసిన వీళ్లు.. దానికి తగిన ఫలితాలు రాబడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో గాటెమాలాలో జరిగిన తొలి అంచె ప్రపంచకప్‌ టోర్నీల్లో స్వర్ణాలతో మెరిశారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను తొలి ప్రపంచకప్‌ పసిడి సాధించాడు. ఆ టోర్నీలో దీపిక రెండు బంగారు పతాకాలు నెగ్గింది.
తోడుగా.. నీడగా: ఈ దంపతులు ఒకే ఆటలో కొనసాగుతుండడంతో తమ ప్రదర్శన మెరుగుపర్చుకునేందుకు ఒకరికొకరు తోడుగా నిలుస్తున్నారు. వ్యక్తిగత జీవితంతో పాటు క్రీడా కెరీర్‌నూ ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. ప్రేమతో సాగుతూ.. తమ లోటుపాట్లను సరిదిద్దుకుంటున్నారు. రోజూ ఆర్చరీ గురించే మాట్లాడుకుంటారు. మరో ఆలోచన లేకుండా తప్పులపై చర్చించుకుంటారు. నిత్యం వాళ్లలో వాళ్లే పోటీపడుతుంటారు. దీంతో ఈ ఇద్దరి ఆట మెరుగవుతోంది.   ఇదే ఆత్మవిశ్వాసంతో టోక్యో ఒలింపిక్స్‌లోనూ పతకాలు సాధిస్తామనే ధీమాతో ఉందీ జంట.

మళ్లీ నంబర్‌వన్‌గా దీపిక

పారిస్‌: ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణి దీపిక కుమారి మళ్లీ నంబర్‌వన్‌గా నిలిచింది. ఆర్చరీ ప్రపంచకప్‌ మూడో అంచె పోటీల్లో మూడు స్వర్ణ పతకాలతో అదరగొట్టిన దీపిక సోమవారం అగ్రస్థానం కైవసం చేసుకుంది. 2012లో తొలిసారిగా దీపిక నంబర్‌వన్‌ ర్యాంకు సాధించింది. డోలా బెనర్జీ తర్వాత ఈ ఘనత సాధించిన భారత క్రీడాకారిణి ఆమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని