Published : 09/09/2021 01:19 IST

మహి తోడుగా మహా సమరానికి..

టీ20 ప్రపంచకప్‌కు టీమ్‌ఇండియా ఎంపిక

మెంటార్‌గా మాజీ కెప్టెన్‌

అశ్విన్‌కు చోటు

ధావన్‌, చాహల్‌కు నిరాశ

జార్ఖండ్‌ డైనమైట్‌ ధోని అభిమానులకు ఇది గొప్ప శుభవార్తే. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరనప్పటికీ ఈ మాజీ కెప్టెన్‌.. టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా జట్టుకు సేవలందించనున్నాడు. కాకపోతే భిన్నమైన పాత్రలో. టోర్నీలో కోహ్లీ నేతృత్వంలోని భారత్‌కు అతడు మెంటార్‌గా నియమితుడయ్యాడు. కెప్టెన్‌గా రెండు ప్రపంచకప్‌లు గెలిచిన అతడి అనుభవం జట్టుకు లాభిస్తుందని బీసీసీఐ ఆశిస్తోంది.

ముంబయి

టీ20 ప్రపంచకప్‌లో పోటీపడే జట్టులో ఎవరెవరుంటారని చర్చ జరుగుతుంటే బీసీసీఐ నిర్ణయం అందరి దృష్టిని మరో వైపు మళ్లించింది. ప్రపంచకప్‌లో పోటీపడే భారత జట్టుకు మాజీ కెప్టెన్‌ ధోనీని మెంటార్‌గా నియమించింది. ఇక టోర్నీ కోసం సెలక్షన్‌ కమిటీ బుధవారం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఆశ్చర్యకరంగా   సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు స్థానం లభించింది. టోర్నీ అక్టోబరు 17 నుంచి యూఏఈ, ఒమన్‌లో జరుగుతుంది. అక్టోబరు 24న పాకిస్థాన్‌తో పోరుతో టీమ్‌ ఇండియా టైటిల్‌ వేట ఆరంభమవుతుంది.

వాళ్లిద్దరికి మొండిచేయి..: ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో ఏకంగా అయిదుగురు స్పిన్నర్లు ఉన్నారు. కానీ 34 ఏళ్ల అశ్విన్‌ ఎంపికే ఆశ్చర్యకరం. సెలక్టర్లు అతణ్ని పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎంపికలో పరిగణనలోకి తీసుకోవడం మానేసి చాలా రోజులే అయింది. అశ్విన్‌ చివరిసారి 2017లో భారత్‌ తరఫున వైట్‌ బాల్‌ క్రికెట్‌ ఆడాడు. అయితే అశ్విన్‌ ఐపీఎల్‌లో రాణిస్తుండడం, యూఏఈలో పరిస్థితులు స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉండడంతో సెలక్షన్‌ కమిటీ ఇప్పుడు అతడివైపు మొగ్గుచూపింది. జడేజా, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ చాహర్‌లు జట్టులోని ఇతర స్పిన్నర్లు. సంజు శాంసన్‌ను తోసిరాజంటూ వికెట్‌కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ జట్టులో చోటు సంపాదించాడు. పవర్‌ హిట్టింగ్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముంబయి బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో విశేషంగా రాణించడంతో పాటు, భారత జట్టు తరఫున   అవకాశాలను సద్వినియోగం  చేసుకోవడం ద్వారా వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ చాహర్‌, ఇషాన్‌ కిషన్‌లు సెలక్టర్లు మెప్పించారు. అయితే సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, లెగ్‌స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌కు మాత్రం నిరాశ తప్పలేదు. చాహల్‌ తన స్థానాన్ని రాహుల్‌ చాహర్‌కు కోల్పోయాడు. కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌, కిషన్‌ల రూపంలో ముగ్గురు ఓపెనర్లు ఉండడంతో సెలక్షన్‌ కమిటీ ధావన్‌ను విస్మరించింది.

అశ్విన్‌ ఎందుకంటే..: అశ్విన్‌ లాంటి అనుభవజ్ఞుడు జట్టుకు అవసరమని సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ చేతన్‌ శర్మ అన్నాడు. అతడి ఎంపిక గురించి మాట్లాడుతూ.. ‘‘అశ్విన్‌ జట్టుకు ఆస్తి. ఐపీఎల్‌లో రాణించాడు. జట్టుకు అతడిలాంటి అనుభవజ్ఞుడు అవసరం. వాషింగ్టన్‌ సుందర్‌ గాయపడడంతో మాకు ఆఫ్‌స్పిన్నర్‌ అవసరమయ్యాడు. జట్టులో అశ్విన్‌ ఒక్కడే ఆఫ్‌స్పిన్నర్‌’’ అని అన్నాడు. హార్దిక్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని చెప్పాడు. బౌలింగ్‌లో వేగం ఉండడం వల్లే చాహల్‌ను కాదని రాహుల్‌ చాహర్‌ను ఎంచుకున్నామని చేతన్‌ శర్మ తెలిపాడు. జడేజాకు బ్యాకప్‌ ఆల్‌రౌండర్‌గా అక్షర్‌ పటేల్‌ జట్టులో స్థానం సంపాదించాడు. శ్రేయస్‌, శార్దూల్‌, దీపక్‌ చాహర్‌ స్టాండ్‌బైలుగా ఎంపికయ్యారు.

భారత జట్టు: కోహ్లి, రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకూమార్‌ యాదవ్‌, పంత్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, జడేజా, రాహుల్‌ చాహర్‌, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్‌, షమి


ధోని వచ్చాడిలా..

మార్గదర్శకుడిగా ధోనీ ఎంపిక చేయడం ఆశ్చర్యకరమే. 40 ఏళ్ల ధోని నిరుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీఫైనలే అతడు భారత్‌ తరఫున ఆడిన చివరి మ్యాచ్‌. మెంటార్‌గా ధోనీని నియమించిన విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. ‘‘ప్రపంచకప్‌లో భారత జట్టుకు ధోని మెంటార్‌గా ఉంటాడు. ఈ విషయంపై దుబాయ్‌లో అతడితో చర్చించాను. ప్రపంచకప్‌ వరకే ఆ పదవిలో ఉండేందుకు అతడు అంగీకరించాడు. ఆ తర్వాత నేను సహచరులతో కూడా మాట్లాడా. మా అందరిదీ ఒకే అభిప్రాయం. కెప్టెన్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కూడా మాట్లాడా. ధోని జట్టుతో ఉండేందుకు అంతా అంగీకరించారు’’ అని జట్టును ప్రకటించడానికి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో షా చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వ్యూహ రచనలో దిట్టగా ధోనీకి పేరుంది. ఐసీసీ టోర్నీలను ఎలా గెలవాలో అతడికి తెలుసు. ఆ అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి ధోనీని మెంటార్‌గా ఎంచుకున్నారని భావిస్తున్నారు. ధోని వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా భారత్‌కు 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌లను అందించాడు. ఐపీఎల్‌ కోసం ప్రస్తుతం యూఏఈలోనే ఉన్న ధోని.. చెన్నైకి నాయకత్వం వహించనున్నాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్