
Rahul Dravid: కొన్నిసార్లు అలాంటి సంభాషణ తప్పదు
సెంచూరియన్: కొన్నిసార్లు ఆటగాళ్లతో కఠినమైన సంభాషణలు తప్పవని భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. తొలి టెస్టుకు జట్టు కూర్పు కష్టంగా మారిన నేపథ్యంలో అతడిలా స్పందించాడు. జట్టుకు ఎంపిక కాని ఆటగాడు నిరాశ చెందడం మంచిదేనని, ఆడాలన్న కసి అతడిలో ఉందనడానికి అది నిదర్శనమని ద్రవిడ్ చెప్పాడు. తొలి టెస్టుకు జట్టులో స్థానం కోల్పోయే అవకాశమున్న ఇషాంత్, రహానె వంటి సీనియర్ ఆటగాళ్లతో మీ సంభాషణ ఎలా ఉందన్న ప్రశ్నకు అతడు స్పందిస్తూ.. ‘‘చాలా మంది ఆటగాళ్లు ప్రొఫెషనల్‌గా ఉంటారు. కొన్నిసార్లు ఆటగాళ్లతో కఠిన సంభాషణలు తప్పవు. కఠినం అనడం వెనుక నా ఉద్దేశమేంటో మీకు తెలుసు. ‘నువ్వు జట్టులో లేవు’ అని ఓ ఆటగాడికి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తుది జట్టులో ఉండాలనుకుంటారు’’ అని అన్నాడు. ‘‘ఎవ్వరూ నిరాశ పడకూడదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆటగాళ్లు విజయవంతం కావడానికి నిరాశ కూడా ఒక కారణమవుతుంది. కానీ అలాంటి సమయంలో ఆటగాడు ఎలా స్పందిస్తాడన్నది ముఖ్యం. అలా చోటు కోల్పోయినప్పుడు ఆటగాడు స్వభావానికి నిజమైన పరీక్ష ఎదురవుతుంది. ఇప్పటివరకైతే మా ఆటగాళ్లంతా బాగానే ఉన్నారు. ఎలాంటి ఫిర్యాదులూ లేవు’’ అని ద్రవిడ్ చెప్పాడు. పరిస్థితులను బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుందని అన్నాడు. ఏ సిరీస్‌లో అయినా తొలి టెస్టుకు ముందు కెప్టెన్ విలేకర్లతో మాట్లాడడం రివాజు. కానీ శనివారం ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. వైట్ బాల్ కెప్టెన్సీ మార్పు గురించి సెలక్టర్లతో మీ అభిప్రాయాన్ని చెప్పారా అని అడిగినప్పుడు.. ‘‘కెప్టెన్సీపై నిర్ణయం సెలక్టర్లది. నేను వాళ్లతో మాట్లాడానా లేదా అన్న వివరాల్లోకి వెళ్లను. దాని గురించి ఇక్కడ మాట్లాడకూడదు. ఇది సందర్భమూ కాదు. నేనేం మాట్లాడానన్నది కచ్చితంగా మీడియాకు చెప్పను’’ అని అన్నాడు.