IND vs SA: రాహుల్‌ అదరహో..

ఆరంభం అదరహో! దక్షిణాఫ్రికా గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్‌ గెలవాలని ఆరాటపడుతోన్న టీమ్‌ఇండియాకు తొలి టెస్టులో బలమైన పునాది పడింది. ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచిన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అజేయ శతకం సాధించడంతో తొలి రోజు భారత్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. భారీ స్కోరుపై కన్నేసింది. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ కూడా ఆకట్టుకున్నాడు. ఇక ఒత్తిడంతా ఆతిథ్య జట్టుపైనే.

Updated : 27 Dec 2021 07:09 IST

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు

తొలి రోజు భారత్‌దే

మొదటి ఇన్నింగ్స్‌లో 272/3

రాణించిన మయాంక్‌, రహానె

సెంచూరియన్‌

ఆరంభం అదరహో! దక్షిణాఫ్రికా గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్‌ గెలవాలని ఆరాటపడుతోన్న టీమ్‌ఇండియాకు తొలి టెస్టులో బలమైన పునాది పడింది. ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచిన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అజేయ శతకం సాధించడంతో తొలి రోజు భారత్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. భారీ స్కోరుపై కన్నేసింది. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ కూడా ఆకట్టుకున్నాడు. ఇక ఒత్తిడంతా ఆతిథ్య జట్టుపైనే.

క్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమ్‌ఇండియాకు శుభారంభం. ఓపెనర్‌ కేల్‌ రాహుల్‌ (122 బ్యాటింగ్‌; 248 బంతుల్లో 17×4, 1×6) అజేయ సెంచరీ సాధించడంతో తొలి రోజు, ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు సాధించింది. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (60; 123 బంతుల్లో 9×4) విలువైన అర్ధశతకం సాధించాడు. రాహుల్‌.. మయాంక్‌తో తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించాడు. ఆ తర్వాత కోహ్లి (35; 94 బంతుల్లో 4×4), రహానె (40 బ్యాటింగ్‌; 81 బంతుల్లో 8×4)తో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. పుజారా డకౌటయ్యాడు. భారత్‌ కోల్పోయిన మూడు వికెట్లనూ ఎంగిడి (3/45) పడగొట్టాడు. మిగతా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. రెండో రోజు కూడా భారత్‌ బ్యాటుతో ఇదే జోరు కొనసాగిస్తే మ్యాచ్‌లో ఇక ఆ జట్టును అడ్డుకోవడం దక్షిణాఫ్రికాకు కష్టమే.

ఓపెనర్లు అదుర్స్‌: దక్షిణాఫ్రికాలో టెస్టు మ్యాచ్‌లో ఏమాత్రం అవకాశాలుండాలన్నా శుభారంభం చాలా అవసరం. మిడిల్‌ ఆర్డర్‌లో అస్థిరత ఉన్న నేపథ్యంలో భారత్‌కు ఓపెనర్లు రాణించడం మరింత కీలకం. ఈ నేపథ్యంలో భారత్‌కు అదిరే ప్రారంభాన్నిచ్చారు రాహుల్‌, మయాంక్‌. కోహ్లి టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా.. లంచ్‌కు జట్టును 83/0తో నిలిపి భారీ స్కోకు బాటలు వేశారు. అత్యంత క్రమశిక్షణతో బ్యాటింగ్‌ చేశారు. నిగ్రహాన్ని పాటిస్తూ ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతులను వదిలేశారు. బౌలర్లు లయ తప్పినప్పుడు శిక్షించారు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అదరగొట్టిన మయాంక్‌ సూపర్‌స్పోర్ట్స్‌ పార్క్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించాడు. రాహుల్‌ ఇంగ్లాండ్‌లోలాగే ఆచితూచి బ్యాటింగ్‌ చేశాడు. బంతులను వదిలేయడంలో అతడు పట్టుదలను ప్రదర్శించగా.. ప్రత్యర్థి పేసర్లు ఏమాత్రం గతి తప్పినా మయాంక్‌ సొమ్ము చేసుకున్నాడు. ఎంగిడి బంతిని పాయింట్లో డ్రైవ్‌ చేయడం ద్వారా మయాంక్‌.. ఇన్నింగ్స్‌ తొలి బౌండరీని సాధించాడు. అరంగేట్ర ఎడమచేతి వాటం పేసర్‌ జాన్సెన్‌ తొలి ఓవర్లో ముచ్చటైన షాట్లతో మూడు ఫోర్లు కొట్టాడు. ఇక ఖాతా తెరవడానికి 21 బంతులు తీసుకున్న రాహుల్‌.. ఆఫ్‌స్టంప్‌ ఆవల రబాడ ఫుల్‌ డెలివరీని శిక్షించడం ద్వారా ఫోర్ల వేట మొదలెట్టాడు. తొలి గంటలో దక్షిణాఫ్రికా పేసర్లు మరీ షార్ట్‌గా బౌలింగ్‌ చేశారు. ఆ జట్టు ఓ సమీక్షను కూడా వృథా చేసుకుంది. లంచ్‌ లోపు ఆ జట్టుకు ఒకే ఒక్క అవకాశం దక్కింది. 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్‌కీపర్‌ డికాక్‌ ఓ క్లిష్టమైన క్యాచ్‌ను అందుకోలేకపోవడంతో మయాంక్‌ బతికిపోయాడు. నిజానికి అంతా అనుకున్నట్లుగా పిచ్‌ పేస్‌ బౌలర్లకు సహకరించలేదు. బ్యాటింగ్‌కు అనుకూలించింది.

రాహుల్‌ కడవరకూ..: లంచ్‌ తర్వాత కూడా మయాంక్‌, రాహుల్‌ చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించారు. రాహుల్‌ కాస్త వేగం పెంచాడు. సాధికారిక షాట్లతో బౌండరీలు రాబట్టాడు. అయితే దక్షిణాఫ్రికా పేసర్లు కూడా మెరుగ్గా బౌలింగ్‌ చేయడం మొదలు పెట్టారు. స్టంప్స్‌ను ఎటాక్‌ చేశారు. ఎంగిడి రెండు వికెట్లతో దక్షిణాఫ్రికాను పోటీలోకి తెచ్చాడు. ఓ దశలో 117/0తో సాఫీగా సాగిపోతున్న దశలో భారత్‌ను అతడు దెబ్బతీశాడు. వరుస బంతుల్లో మయాంక్‌, పుజారాను ఔట్‌ చేశాడు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న మయాంక్‌.. వికెట్ల ముందు దొరికిపోయాడు. మొదట అంపైర్‌ ఎల్బీడబ్ల్యూ ఇవ్వడానికి తిరస్కరించాడు. బంతి లెగ్‌ స్టంప్‌ ఆవల వికెట్ల మీదుగా వెళ్తున్నట్లనిపించింది. కానీ సమీక్షలో బంతి వికెట్లను తాకుతున్నట్లు తేలడంతో మయాంక్‌ నమ్మలేనట్లుగా వెనుదిరిగాడు. ఫామ్‌లో లేని పుజారా తర్వాతి బంతికే నిష్క్రమించాడు. డిఫెన్సివ్‌ షాట్‌ ఆడిన అతడు ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌తో షార్ట్‌ లెగ్‌లో కీగన్‌ పీటర్సన్‌కు చిక్కాడు. అలాంటి స్థితిలో టీమ్‌ ఇండియా ఒత్తిడికి గురి కాకుండా ఇన్నింగ్స్‌ను కొనసాగించింది అంటే, భారీ స్కోరుపై ఆశలతో రోజును ముగించింది అంటే ప్రధాన కారణం రాహుల్‌ ఏకాగ్రతతో కూడిన బ్యాటింగే. కెప్టెన్‌ కోహ్లి, రహానేలతో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేసిన అతడు జట్టును సురక్షిత స్థితిలో నిలిపాడు. రాహుల్‌ ఏ దశలోనూ సంయమనాన్ని కోల్పోలేదు. పేలవ బంతుల కోసం ఎదురు చూశాడు. చూడమచ్చటైన షాట్లతో అలరించాడు. పేసర్లు గానీ, స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌ కానీ అతణ్ని ఇబ్బంది పెట్టలేకపోయారు. ఎంగిడి బౌలింగ్‌లో ఓ అందమైన కవర్‌ డ్రైవ్‌ బౌండరీతో రాహుల్‌ అర్ధశతకం (127 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. టీ సమయానికి స్కోరు 157/2. ఏమాత్రం తడబాటు లేకుండా బ్యాటింగ్‌ను కొనసాగించిన రాహుల్‌.. అర్ధశతకం నుంచి శతకానికి చేరుకోవడానికి కాస్త తక్కువ బంతులే తీసుకున్నాడు. కేశవ్‌ మహారాజ్‌ ఓవర్లో ఓ బంతిని బ్యాక్‌ఫుట్‌పై మిడాఫ్‌లో బౌండరీకి తరలించిన అతడు.. తర్వాతి బంతికి మిడాన్‌లో కళ్లు చెదిరే సిక్స్‌ కొట్టడం ద్వారా 90కి చేరుకున్నాడు. అక్కడ కాస్త జాగ్రత్తగా ఆడిన అతడు.. చివరికి మహారాజ్‌ బౌలింగ్‌లో బౌండరీతో టెస్టుల్లో ఏడో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అంతే ఏకాగ్రతతో బ్యాటింగ్‌ చేసి అజేయంగా రోజును ముగించాడు.

మరోవైపు రెండేళ్లుగా సెంచరీ చేయని కెప్టెన్‌ కోహ్లి కూడా మెరుగ్గానే బ్యాటింగ్‌ చేశాడు. చకచకా రెండు వికెట్ల పడ్డ అనంతరం రాహుల్‌కు సహకరిస్తూ జట్టుపై ఒత్తిడి పడకుండా చూశాడు. క్రీజులో సౌకర్యంగా కదిలిన అతడు కొన్ని మంచి షాట్లు ఆడాడు. పెద్ద ఇన్నింగ్స్‌ ఆడేలా కనిపించాడు. కానీ క్రీజులో చక్కగా కుదురుకున్నాక.. ఆఫ్‌స్టంప్‌ ఆవల ఎంగిడి బంతిని వెంటాడి స్లిప్‌లో చిక్కాడు. రాహుల్‌తో మూడో  వికెట్‌కు కోహ్లి 82 పరుగులు జోడించాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రహానె సాధికారికంగా బ్యాటింగ్‌ చేశాడు. తన కెరీరే ప్రమాదంలో పడ్డ ఈ దశలో అతడు దూకుడుగా ఆడాడు. అలవోకగా బౌండరీలు కొట్టాడు. రాహుల్‌తో అభేద్యమైన నాలుగో వికెట్‌కు 73 పరుగులు జోడించాడు. పేలవ ఫామ్‌లో ఉన్నా తుది జట్టులో స్థానం దక్కించుకున్న రహానె.. జట్టు తొలి రోజు మెరుగైన స్థితిలో నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.  ఈ మ్యాచ్‌కు ఇషాంత్‌కు భారత తుది జట్టులో చోటు దక్కలేదు. బుమ్రా, షమి, సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ పేస్‌ బాధ్యతను  పంచుకుంటారు. ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్‌ ఎంపికయ్యాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ 122; మయాంక్‌ అగర్వాల్‌ ఎల్బీ (బి) ఎంగిడి 60; పుజారా (సి) పీటర్సన్‌ (బి) ఎంగిడి 0; కోహ్లి (సి) ముల్దర్‌ (బి) ఎంగిడి 35; రహానె బ్యాటింగ్‌ 40; ఎక్స్‌ట్రాలు 15 మొత్తం: (90 ఓవర్లలో) 272/3

వికెట్ల పతనం: 1-117, 2-117, 3-199

బౌలింగ్‌: రబాడ 20-5-51-0; ఎంగిడి 17-4-45-3; జాన్సెన్‌ 17-4-61-0; ముల్దర్‌ 18-3-49-0; కేశవ్‌ మహారాజ్‌ 18-2-58-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని