ఫుట్‌బాల్‌ దిగ్గజంభౌమిక్‌ ఇక లేరు

1970వ దశకంలో తన ఆటతో అభిమానులను ఉర్రూతలూగించిన ఆ ఆటగాడు ఇక లేరు.. కండలు తిరిగిన దేహంతో, తెగించి ముందుకు సాగే నైజంతో మైదానంలో దూకుడు ప్రదర్శించిన ఆ దిగ్గజం ఇక లేరు.. క్రీడాకారుడిగా

Updated : 23 Jan 2022 05:13 IST

కోల్‌కతా: 1970వ దశకంలో తన ఆటతో అభిమానులను ఉర్రూతలూగించిన ఆ ఆటగాడు ఇక లేరు.. కండలు తిరిగిన దేహంతో, తెగించి ముందుకు సాగే నైజంతో మైదానంలో దూకుడు ప్రదర్శించిన ఆ దిగ్గజం ఇక లేరు.. క్రీడాకారుడిగా, కోచ్‌గా భారత ఫుట్‌బాల్‌ రంగంలో తనదైన ముద్ర వేసిన సుభాష్‌ భౌమిక్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో 72 ఏళ్ల వయసులో శనివారం ఉదయం ఆయన మరణించారు. గత కొంత కాలంగా ఆయనకు డయాలసిస్‌ చికిత్స కొనసాగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, తనయుడు, కుమార్తె ఉన్నారు. మైదానం లోపల, బయట ఆయన సంపాదించుకున్న అభిమానులు.. భౌమిక్‌ మృతితో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. బెంగాల్‌ నుంచి వచ్చిన ఆయన 19 ఏళ్ల వయసులో రాజస్థాన్‌ క్లబ్‌ తరపున అరంగేట్రం చేశారు. దశాబ్దానికి పైగా ఫుట్‌బాల్‌ మైదానాన్ని ఏలారు. భారత జట్టులో అడుగుపెట్టి సత్తాచాటారు. 1970 ఆసియా క్రీడల్లో కాంస్యం అందుకున్న జట్టులో ఆయన ఉన్నారు. దేశం తరపున 24 మ్యాచ్‌లాడి 9 గోల్స్‌ చేశారు. మెర్డెకా కప్‌లో ఫిలిప్పీన్స్‌పై హ్యాట్రిక్‌ నమోదు చేశారు. ఇక క్లబ్‌ ఫుట్‌బాల్‌లో ఆయనకు తిరుగులేదు. ఈస్ట్‌ బెంగాల్‌, మోహన్‌ బగాన్‌ తరపున అమోఘమైన ప్రదర్శనతో అభిమానుల హృదయాలను దోచుకున్నారు. 1969 నుంచి 1979 మధ్య ఈస్ట్‌ బెంగాల్‌ తరపున 82, మోహన్‌ బగాన్‌కు ఆడి 83 గోల్స్‌ చేశారు. స్ట్రైకర్‌గా అతని నైపుణ్యాలు ఉత్తమంగానే ఉండేవి.. కానీ తన  ఆకారంతో మైదానంలో కదులుతూ.. ప్రత్యర్థి డిఫెండర్లను దాటుకుంటూ ముందుకు వెళ్లి బంతిని గోల్‌ పోస్టులోకి పంపేవారు. మరోవైపు డిఫెండర్లను తాను చూసుకుంటూ.. సహచర ఆటగాళ్లకు గోల్స్‌ చేసే అవకాశం కల్పించేవారు. ఓ సారి దురండ్‌ కప్‌ ఫైనల్‌కు ముందు తనను రిజర్వ్‌ ఆటగాడిగా బెంచ్‌ మీద కూర్చోబెట్టాలని భావించిన అప్పటి కోచ్‌ ప్రదీప్‌తో భౌమిక్‌ గొడవ పెట్టుకున్నారు. అదే కోపంతో మైదానంలో దిగి ఒంటిచేత్తో జట్టును గెలిపించారు. తన అహాన్ని రెచ్చగొడితే తాను మంచి ప్రదర్శన చేస్తానని తెలిసే కోచ్‌ అలా ప్రవర్తించేవాడని భౌమిక్‌ ఓ సారి గుర్తు చేసుకున్నాడు. మరోసారి తన దూకుడు ఎక్కడ జట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతుందేమోనని సంతోష్‌ ట్రోఫీ సందర్భంగా భౌమిక్‌ను కోచ్‌ హోటల్‌ గదిలోనే ఉంచి తాళం వేశారంటా. 29 ఏళ్ల వయసులో ఆటకు గుడ్‌బై చెప్పిన ఆయన.. ఆ తర్వాత మోహన్‌ బగాన్‌, ఈస్ట్‌ బెంగాల్‌తో పాటు భారత జట్టుకూ కోచ్‌గా పనిచేశారు. ఆటగాడిగా తన కెరీర్‌లో ఐఎఫ్‌ఏ షీల్డ్‌, రోవర్స్‌ కప్‌, డీసీఎం ట్రోఫీ, ఫెడరేషన్‌ కప్‌ ఇలా దాదాపు అన్ని ట్రోఫీలను          దక్కించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు