Published : 26 Jan 2022 04:17 IST

సెమీస్‌లో నాదల్‌

బెరెటిని, బార్టీ, కీస్‌ కూడా

మెల్‌బోర్న్‌


జకోవిచ్‌ గైర్హాజరీలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఫేవరెట్‌గా మారిన రఫెల్‌ నాదల్‌ టైటిల్‌ దిశగా మరో అడుగు ముందుకేశాడు. అయిదు సెట్ల పాటు సాగిన పోరులో షపొవలోవ్‌ను ఓడిస్తూ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. బెరెటిని కూడా తుది నాలుగులో చోటు సంపాదించాడు. మహిళల సింగిల్స్‌లో బార్టీ, కీస్‌ క్వార్టర్స్‌ను అధిగమించారు.

ఆరో సీడ్‌ రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో రికార్డు సృష్టించాలనుకుంటున్న అతడు మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 6-3, 6-4, 4-6, 3-6, 6-3తో డెనిస్‌ షపొవలోవ్‌ (కెనడా)ను ఓడించాడు. తొలి రెండు సెట్లలో ఒక్కో బ్రేక్‌తో నాదల్‌ పైచేయి సాధించాడు. ఆ తర్వాత నాదల్‌కు తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. బలంగా పుంజుకున్న  షపొవలోవ్‌ తర్వాత రెండు సెట్లలో పైచేయి సాధించాడు. నిర్ణయాత్మక అయిదో సెట్లో నాదల్‌ మళ్లీ పుంజుకున్నాడు. మొదట సర్వీసు నిలబెట్టుకున్న నాదల్‌.. ఆ తర్వాత బ్రేక్‌తో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. సర్వీసును నిలబెట్టుకుంటూ సాగిన అతడు సెట్‌ను, మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. నాలుగు గంటల పాటు సాగిన మ్యాచ్‌లో నాదల్‌.. 8 ఏస్‌లు కొట్టగా, ప్రత్యర్థి 20 ఏస్‌లు సంధించాడు. నాదల్‌ 11 డబుల్‌ ఫాల్ట్‌లు, షపొవలోవ్‌ 5 డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. నాదల్‌ (41)తో పోలిస్తే షపొవలోవ్‌ ఎక్కువ విన్నర్లు (53) కొట్టాడు. కానీ అతడు 51 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. నాదల్‌ 28 అనవసర తప్పిదాలే చేశాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన ఆటగాళ్ల జాబితాలో నాదల్‌ ప్రస్తుతం 20 టైటిళ్లతో ఫెదరర్‌, జకోవిచ్‌తో సమంగా ఉన్నాడు. నాదల్‌ గతంలో ఒకే ఒక్కసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ (2009) గెలుచుకున్నాడు. ఇక్కడ 2022 కన్నా ముందు ఆడిన 13 క్వార్టర్‌ఫైనల్స్‌లో ఏడింట్లో అతడు పరాజయంపాలయ్యాడు. ‘‘ఆరంభంలో బాగా ఆడా. కానీ షపొవలోవ్‌ చాలా ప్రతిభావంతుడు. చాలా దూకుడుగా ఆడాడు. అతడి సర్వీసు, ముఖ్యంగా రెండో సర్వీసు గొప్పగా ఉంది’’ అని మ్యాచ్‌ అనంతరం నాదల్‌ వ్యాఖ్యానించాడు. సెమీస్‌లో అతడు ఏడో సీడ్‌ బెరెటినితో తలపడతాడు. మరో అయిదు సెట్ల క్వార్టర్‌ఫైనల్లో బెరెటిని (ఇటలీ) 6-4, 6-4, 3-6, 3-6,   6-2తో మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించాడు. మ్యాచ్‌లో బెరెటిని  12 ఏస్‌లు, 51 విన్నర్లు కొట్టాడు.

క్రెజికోవా ఔట్‌: మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ క్రెజికోవా (చెక్‌)కు షాక్‌ తగిలింది. క్వార్టర్స్‌లో అన్‌సీడెడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా) 6-3, 6-2తో ఆమెను మట్టికరిపించింది. పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కీస్‌ మ్యాచ్‌లో 11 ఏస్‌లు, 27 విన్నర్లు కొట్టింది. ఆమె సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ ఆష్లీ బార్టీ (ఆస్ట్రేలియా)ని ఢీకొంటుంది. క్వార్టర్స్‌లో బార్టీ 6-2, 6-0తో జెస్సికా పెగులా (అమెరికా)ను చిత్తు చేసింది. మ్యాచ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బార్టీ.. ఆరు ఏస్‌లు, 17 విన్నర్లు కొట్టింది.

నిష్క్రమించిన సానియా
సానియా మీర్జా ఓటమితో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు వీడ్కోలు పలికింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో సానియా, రాజీవ్‌ రామ్‌ (అమెరికా) జోడీ 4-6, 6-7 (5-7)తో ఫోర్లిస్‌, కుబ్లర్‌ జంట చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్‌ ముగిసిన అనంతరం  రిటైరవుతున్నట్లు 35 ఏళ్లు సానియా ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆమె ఒక మిక్స్‌డ్‌ డబుల్స్‌, ఒక డబుల్స్‌  టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు సానియా ఓటమితో ఈ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో భారత్‌ కథ ముగిసింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని