స్వైటెక్‌ ముందుకు..

ఏడో సీడ్‌ స్వైటెక్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో టైటిల్‌ దిశగా మరో అడుగు ముందుకేస్తూ.. సెమీఫైనల్లో ప్రవేశించింది. కోలిన్స్‌ కూడా ముందంజ వేసింది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ మెద్వెదెవ్‌, నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌ సెమీస్‌కు దూసుకెళ్లారు.

Updated : 27 Jan 2022 03:54 IST

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌
సెమీస్‌లో మెద్వెదెవ్‌, సిట్సిపాస్‌

ఏడో సీడ్‌ స్వైటెక్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో టైటిల్‌ దిశగా మరో అడుగు ముందుకేస్తూ.. సెమీఫైనల్లో ప్రవేశించింది. కోలిన్స్‌ కూడా ముందంజ వేసింది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ మెద్వెదెవ్‌, నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌ సెమీస్‌కు దూసుకెళ్లారు.

మెల్‌బోర్న్‌

గా స్వైటెక్‌ (పోలెండ్‌) ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం మూడు గంటలపాటు సాగిన క్వార్టర్‌ఫైనల్లో ఆమె 4-6, 7-6 (7-2), 6-3తో 36 ఏళ్ల కయా కనెపి (ఎస్తోనియా)పై విజయం సాధించింది. వేడి పరిస్థితుల కారణంగా ఆరంభంలో ఇబ్బంది పడ్డ స్వైటెక్‌ క్రమంగా పైచేయి సాధించింది. మొదటి సెట్లో ఆరో గేమ్‌లో నాలుగు బ్రేక్‌ అవకాశాలు వచ్చినా.. స్వైటెక్‌ ఉపయోగించుకోలేకపోయింది. కష్టంగా సర్వీసు నిలబెట్టుకున్న కనెపి.. ఏడో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీసును బ్రేక్‌ చేసింది. ఓ బలమైన సర్వీసు రిటర్న్‌ విన్నర్‌తో ఆమె బ్రేక్‌ సాధించింది. స్వైటెక్‌ రెండో సర్వ్‌లో బాగా ఇబ్బంది పడింది. 5-3 వద్ద అయిదు బ్రేక్‌ పాయింట్లు ఇచ్చింది. 16 నిమిషాల పాటు సాగిన గేమ్‌లో కష్టంగా సర్వీసును నిలబెట్టుకుంది. తర్వాతి గేమ్‌లోనూ పోరాడింది. కానీ 9వ సెట్‌ పాయింటును సద్వినియోగం చేసుకుంటూ కనెపి సెట్‌ను చేజిక్కించుకుంది. కనెపి అదే జోరులో రెండో సెట్‌ తొలి గేమ్‌లోనే బ్రేక్‌ సాధించి ప్రత్యర్థికి షాకిచ్చింది. కానీ బలంగా పుంజుకున్న స్వైటెక్‌ వరుసగా నాలుగు గేమ్‌లు నెగ్గి 4-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ కనెపి కూడా పోరాడి స్కోరును 4-4తో సమం చేసింది. సెట్‌ చివరికి టైబ్రేక్‌కు దారి తీయగా.. అక్కడ స్వైటెక్‌ పైచేయి సాధించింది. చివరి సెట్‌ ఆరంభంలో ఇద్దరూ పరస్పరం సర్వీసులు బ్రేక్‌ చేసుకుని 2-2తో సమంగా నిలిచారు. కానీ ఆ తర్వాత స్వైటెక్‌ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి సెట్‌ను, మ్యాచ్‌ను గెలుచుకుంది. స్వైటెక్‌ మ్యాచ్‌లో 5 ఏస్‌లు, 31 విన్నర్లు కొట్టింది. 12 డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌ చేరడం స్వైటెక్‌కు ఇదే తొలిసారి. ఫైనల్లో స్థానం కోసం ఆమె కోలిన్స్‌ (అమెరికా)ను ఢీకొంటుంది. క్వార్టర్‌ఫైనల్లో కోలిన్స్‌ 7-5, 6-1తో కోర్నెట్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించింది.

చెమటోడ్చిన మెద్వెదెవ్‌: పురుషుల సింగిల్స్‌లో మెద్వెదెవ్‌ (రష్యా), సిట్సిపాస్‌ (గ్రీస్‌) విరుద్ధ రీతిలో తుది నాలుగులో చోటు సంపాదించారు. క్వార్టర్‌ఫైనల్లో తొలి రెండు సెట్లు కోల్పోయినా మెద్వెదెవ్‌ పుంజుకున్న తీరు అద్భుతం. అయిదు సెట్లపాటు హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ఫైనల్లో అతడు 6-7 (4-7), 3-6, 7-6 (7-2), 7-5, 6-4తో తొమ్మిదో సీడ్‌ అలియాసిమె (కెనడా)పై కష్టపడి గెలిచాడు. అతను నాలుగో సెట్లో ఒక మ్యాచ్‌ పాయింట్‌ కూడా కాపాడుకున్నాడు. మ్యాచ్‌లో 15 ఏస్‌లు, 49 విన్నర్లు సంధించిన మెద్వెదెవ్‌ తొమ్మిది డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. 18 ఏస్‌లు, 64 విన్నర్లు కొట్టిన అలియాసిమె.. 75 అవనసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. మెద్వెదెవ్‌ 53 అనవసర తప్పిదాలే చేశాడు. మెద్వెదెవ్‌ సెమీఫైనల్లో సిట్సిపాస్‌తో తలపడతాడు. మరో క్వార్టర్‌ఫైనల్లో సిట్సిపాస్‌ 6-3, 6-4, 6-2తో 11వ సీడ్‌ సిన్నర్‌ (ఇటలీ)ని ఓడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు