Ajinkya Rahane: అకస్మాత్తుగా వన్డేల నుంచి తప్పించారు: రహానె

వన్డేల్లో బాగా ఆడుతున్న సమయంలో అకస్మాత్తుగా జట్టు నుంచి తనను తప్పించారని టీమ్‌ఇండియా ఆటగాడు ఆజింక్య రహానె అన్నాడు. క్రమం తప్పకుండా క్రికెట్‌ లేకపోవడం తన ఫామ్‌పై ప్రభావం చూపిందని

Updated : 12 Feb 2022 07:16 IST

దిల్లీ: వన్డేల్లో బాగా ఆడుతున్న సమయంలో అకస్మాత్తుగా జట్టు నుంచి తనను తప్పించారని టీమ్‌ఇండియా ఆటగాడు ఆజింక్య రహానె అన్నాడు. క్రమం తప్పకుండా క్రికెట్‌ లేకపోవడం తన ఫామ్‌పై ప్రభావం చూపిందని తెలిపాడు. ‘‘2-3 ఏళ్లు ఒకే ఫార్మాట్‌లో ఆడుతున్నప్పుడు.. ముఖ్యంగా రంజీ ట్రోఫీ, దేశవాళీ మ్యాచ్‌లు లేనప్పుడు ఫామ్‌పై ప్రభావం పడుతుంది. ఎక్కువ సమయం ఇంట్లో కూర్చొని పరుగులు సాధించలేమని గుర్తించాలి. ఎంత ప్రాక్టీస్‌ చేశారు.. ఎన్ని నెట్‌ సెషన్‌లలో పాల్గొన్నారన్నది ముఖ్యం కాదు. దాంతో ఆత్మవిశ్వాసం రాదు. మ్యాచ్‌లలో ఆడటం.. పరుగులు రాబట్టడంతోనే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గతంలో టీమ్‌ఇండియా తరఫున క్రమం తప్పకుండా వన్డేల్లో ఆడా. అకస్మాత్తుగా నన్ను జట్టు నుంచి తప్పించారు. ఆ వ్యవహారంలో మరింత లోతుకు వెళ్లదల్చుకోలేదు. కాని 2014, 15, 16, 17లలో వన్డేలు, టెస్టుల్లో చక్కగా ఆడుతున్నా. ఆ తర్వాత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించలేదు. టెస్టుల మధ్య చాలా విరామం వచ్చింది. ఇక టెస్టు జట్టుకు రోహిత్‌శర్మను వైస్‌ కెప్టెన్‌గా నియమించడం పూర్తిగా సెలెక్టర్ల నిర్ణయం. అది నా చేతుల్లో లేదు. ఆ నిర్ణయాన్ని గౌరవిస్తా. రోహిత్‌ జట్టుకు అద్భుతంగా సారథ్యం వహిస్తున్నాడు. అతని పట్ల సంతోషంగా ఉన్నా. నా చేతుల్లో లేని వాటి గురించి ఆలోచించను. సెలెక్టర్లు నన్ను వైస్‌ కెప్టెన్‌ చేశారు. కెప్టెన్‌గానూ బాధ్యతలు అప్పగించారు. రోహిత్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేయడం వారి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తా’’ అని రహానె   పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని