T20 Cricket: కోల్‌కతా కేక

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టైటిల్‌ వేట ఓటమితో షురూ! వాడి తగ్గని ఆటతో అభిమానులను మహేంద్రుడు మంత్రముగ్దుల్ని చేసినా.. చెన్నైకి భంగపాటు తప్పలేదు. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన నిరుటి రన్నరప్‌ కోల్‌కతా విజయంతో

Updated : 27 Mar 2022 09:27 IST

విజృంభించిన ఉమేశ్‌

ధోని మెరిసినా.. చెన్నైకి ఓటమి

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టైటిల్‌ వేట ఓటమితో షురూ! వాడి తగ్గని ఆటతో అభిమానులను మహేంద్రుడు మంత్రముగ్దుల్ని చేసినా.. చెన్నైకి భంగపాటు తప్పలేదు. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన నిరుటి రన్నరప్‌ కోల్‌కతా విజయంతో ఆరంభించింది. ఉమేశ్‌ పేస్‌, వరుణ్‌, నరైన్‌ స్పిన్‌తో మొదట ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన కోల్‌కతా.. ఛేదనలో రహానె, బిల్లింగ్స్‌ల చక్కని బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని పెద్దగా ఇబ్బంది పడకుండానే అందుకుంది.

ముంబయి

టీ20 టోర్నీలో కోల్‌కతా శుభారంభం. శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని ఆ జట్టు టోర్నీ తొలి మ్యాచ్‌లో శనివారం 6 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. ఉమేశ్‌ యాదవ్‌ (2/20), వరుణ్‌ చక్రవర్తి (1/23), నరైన్‌ (0/15) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మొదట చెన్నై 5 వికెట్లకు 131 పరుగులే చేయగలిగింది. ఆ మాత్రం స్కోరు కూడా ధోని చలవే. క్లిష్ట పరిస్థితుల్లో ధోని (50 నాటౌట్‌; 38 బంతుల్లో 7×4, 1×6) అదిరే అర్ధశతకం చేశాడు. రహానె (44; 34 బంతుల్లో 6×4, 1×6), బిల్లింగ్స్‌ (25; 22 బంతుల్లో 1×4, 1×6), శ్రేయస్‌ అయ్యర్‌ (20 నాటౌట్‌) రాణించడంతో లక్ష్యాన్ని కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఉమేశ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

రాణించిన రహానె: కోల్‌కతా ఛేదన సాఫీగానే మొదలైంది. వెంకటేశ్‌ అయ్యర్‌ (16)తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన రహానె.. కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఎలాంటి తడబాటు లేకుండా బ్యాటింగ్‌ చేశాడు. కొన్ని చక్కని ఫోర్లు సాధించిన అతడు.. మిల్నె బౌలింగ్‌లో ఓ సిక్స్‌ కూడా కొట్టాడు. పవర్‌ ప్లే ముగిసే సరికి కోల్‌కతా 43/0తో నిలిచింది. కానీ తర్వాతి ఓవర్లోనే వెంకటేశ్‌ను బ్రావో (3/20) ఔట్‌ చేశాడు. అయితే ఓ వైపు రహానె నిలవగా నితీష్‌ రాణా (21; 17 బంతుల్లో 2×4, 1×6) ధాటిగా బ్యాటింగ్‌ చేసి కోల్‌కతా ఇన్నింగ్స్‌ను వడివడిగా నడిపించాడు. కానీ అతణ్ని బ్రావో ఎక్కువసేపు నిలువనివ్వలేదు. మరోవైపు సాఫీగా సాగుతున్న రహానెను 12వ ఓవర్లో ఔట్‌ చేయడం ద్వారా మ్యాచ్‌పై శాంట్నర్‌ కాస్త ఆసక్తి పెంచాడు. అప్పటికి కోల్‌కతా స్కోరు 87. కానీ శ్రేయస్‌, బిల్లింగ్స్‌ తమ జట్టుపై ఒత్తిడి పెరగనివ్వలేదు. ఎక్కువ వేగంగా పరుగులు రాకపోయినా.. సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువేమీ లేకపోవడంతో కోల్‌కతాకు కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది. 18వ ఓవర్లో ఓ భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో, జట్టు స్కోరు 123 వద్ద బిల్లింగ్స్‌ ఔటైనప్పుడు చెన్నైలో చిన్న ఆశ కలిగే ఉంటుంది. కానీ శ్రేయస్‌ ఆ జట్టుకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. షెల్డన్‌ జాక్సన్‌ (3 నాటౌట్‌)తో కలిసి సాఫీగా పని పూర్తి చేశాడు.

ధోని దంచేశాడు: 131 అంటే తక్కువే. కానీ అవి ఎక్కువే. చెన్నై ఇన్నింగ్స్‌ చూసిన వారెవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుంటే, క్రమం తప్పకుండా వికెట్లు తీస్తుంటే, బౌండరీల రాక గగనమవుతుంటే, వంద దాటడమే కష్టమనిపిస్తుంటే.. ఎవరూ చెన్నై అంత స్కోరు చేయగలదని ఊహించి ఉండరు. అంత పేలవంగా సాగింది ఆ జట్టు ఇన్నింగ్స్‌. 17 ఓవర్లకు స్కోరు కేవలం 84/5. బౌలర్లు ఏమాత్రం స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వట్లేదు. కానీ కోల్‌కతాకు ధోని షాకిచ్చాడు. తనలోని ఒకప్పటి మెరుపు వీరుణ్ని బయటికి తీస్తూ అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించిన అతడు.. చెన్నైకి గౌరవప్రదమైన స్కోరును అందించాడు. జడేజా అండగా.. ధోని విధ్వంసం సృష్టించడంతో చివరి మూడు ఓవర్లలో చెన్నై ఏకంగా 47 పరుగులు రాబట్టి అనూహ్య స్కోరు సాధించింది. చాలా కాలంగా క్రికెట్టాడని ధోని.. 40 ఏళ్ల వయసులో టాప్‌ స్కోరర్‌గా నిలుస్తాడని మ్యాచ్‌కు ముందు ఎవరూ అనుకొని ఉండరు. కానీ అతడు అద్భుతమైన బ్యాటింగ్‌తో మురిపించాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై తీవ్రంగా తడబడింది. ఇటు పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌, ఆటు స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, నరైన్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగుల కోసం కష్టపడింది. క్రమం తప్పకుండా వికెటు కోల్పోయింది. పేలవ షాట్‌ సెలక్షనూ ఆ జట్టును దెబ్బతీసింది. ఓపెనర్‌ రుతురాజ్‌ (0)ను తొలి ఓవర్లోనే ఔట్‌ చేసిన ఉమేశ్‌.. మరో ఓపెనర్‌ కాన్వే (3)నూ ఎక్కువసేపు నిలువనివ్వలేదు. చక్కగా బ్యాటింగ్‌ చేసిన ఉతప్ప (28;  21 బంతుల్లో 2×4, 2×6) కీలక సమయంలో ఔటయ్యాడు. అనవసర పరుగుకు యత్నించి రాయుడు (15), పేలవ షాట్‌తో దూబే (3) నిష్క్రమించారు. జడేజా (26 నాటౌట్‌; 28 బంతుల్లో 1×6) క్రీజులో ఉన్నా.. బ్యాట్‌ ఝుళిపించడం అతడికి కష్టమైపోయింది. 9 నుంచి 15 ఓవర్ల మధ్య చెన్నై 23 పరుగులే చేయగలిగింది. 17 ఓవర్లు ముగిసే సరికి ధోని 25 బంతుల్లో 15తో, జడేజా 22 బంతుల్లో 16తో ఉన్నారు. ఆ దశలో గేర్‌ మార్చిన ధోని ముచ్చటైన షాట్లతో అలరించాడు. రసెల్‌ ఓవర్లో మూడు ఫోర్లు, శివమ్‌ మావి ఓవర్లో 4, 6.. చివరి ఓవర్లో (రసెల్‌) మరో రెండు ఫోర్లు కొట్టిన అతడు.. ఓ సింగిల్‌తో అర్ధశతకాన్ని అందుకున్నాడు. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి జడేజా సిక్స్‌ దంచాడు. ధోని, జడేజా జంట అభేద్యమైన ఆరో వికెట్‌కు 70 పరుగులు జోడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని