T20 League: 205 సరిపోలేదు

ఎన్ని మలుపులు.. ఎంత ఉత్కంఠ! టీ20 మ్యాచ్‌కు సిసలైన అర్థం చెబుతూ సాగిన పోరు అభిమానులకు కిక్కునిచ్చింది. మొదట అనూహ్యంగా బెంగళూరు 200కు పైగా స్కోరు చేస్తే.. ఛేదనలో మధ్యలో తడబడ్డ పంజాబ్‌ ఆఖర్లో పంజా విసిరింది.

Updated : 28 Mar 2022 07:44 IST

బెంగళూరుపై పంజాబ్‌ ఉత్కంఠ విజయం
చెలరేగిన షారుక్‌, స్మిత్‌
రాణించిన ధావన్‌, భానుక

ఎన్ని మలుపులు.. ఎంత ఉత్కంఠ! టీ20 మ్యాచ్‌కు సిసలైన అర్థం చెబుతూ సాగిన పోరు అభిమానులకు కిక్కునిచ్చింది. మొదట అనూహ్యంగా బెంగళూరు 200కు పైగా స్కోరు చేస్తే.. ఛేదనలో మధ్యలో తడబడ్డ పంజాబ్‌ ఆఖర్లో పంజా విసిరింది. గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకునే అలవాటుకు ముగింపు పలికిన ఆ జట్టు సరికొత్తగా సీజన్‌ను ఆరంభించింది. హోరాహోరీగా సాగిన పోరులో అద్భుత విజయాన్ని అందుకుంది. స్మిత్‌ చివర్లో ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆఖర్లో బెంగళూరు ఫీల్డింగ్‌ వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది.

నవీ ముంబయి: టీ20 క్రికెట్‌ లీగ్‌లో పంజాబ్‌ శుభారంభం చేసింది. ఆదివారం రెండో మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలిచింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్లకు 205 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (88; 57 బంతుల్లో 3×4, 7×6) అదరగొట్టాడు. కోహ్లి (41 నాటౌట్‌; 29 బంతుల్లో 1×4, 2×6), దినేశ్‌ కార్తీక్‌ (32 నాటౌట్‌; 14 బంతుల్లో 3×4, 3×6) రాణించారు. ఛేదనలో పంజాబ్‌ 5 వికెట్లు కోల్పోయి 19వ ఓవర్లో లక్ష్యాన్ని చేరుకుంది. ఆ జట్టులో ధావన్‌ (43; 29 బంతుల్లో 5×4, 1×6), భానుక రాజపక్స (43; 22 బంతుల్లో 2×4, 4×6), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఒడియన్‌ స్మిత్‌ (25 నాటౌట్‌; 8 బంతుల్లో 1×4, 3×6) సత్తాచాటారు.

మొదటి నుంచి బాదుడే..: భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు మయాంక్‌ (32), ధావన్‌ మొదటి నుంచే బౌండరీల వేటలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. మయాంక్‌ సిక్సర్లు బాదితే.. ధావన్‌ కళాత్మక డ్రైవ్‌లతో ఫోర్లు రాబట్టాడు. దీంతో ఏడు ఓవర్లకు ఆ జట్టు 71/0తో నిలిచింది. కానీ బౌలింగ్‌కు వచ్చిన హసరంగ (1/40) తొలి బంతికే గూగ్లీతో మయాంక్‌ను వెనక్కిపంపాడు. కానీ క్రీజులో అడుగుపెడుతూనే భానుక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బ్యాట్‌ ఝుళిపించాడు. అలవోకగా సిక్సర్లు కొట్టాడు. ధావన్‌ కూడా జోరు కొనసాగించడంతో ఆ జట్టు స్కోరు 11 ఓవర్లలోనే 110 దాటింది. ఆ దశలో బెంగళూరు బౌలర్లు టకటక వికెట్లు పడగొట్టి జట్టును పోటీలో నిలిపే ప్రయత్నం చేశారు. మొదట  ఓ స్లో డెలివరీతో ధావన్‌ను హర్షల్‌ (1/36) బుట్టలో వేసుకున్నాడు. ఆ తర్వాత వరుస బంతుల్లో భానుకతో పాటు రాజ్‌ బవా (0)ను సిరాజ్‌ (2/59) వెనక్కిపంపాడు. ఆ వెంటనే లివింగ్‌స్టోన్‌ (19)ను ఆకాశ్‌ (1/38) ఔట్‌ చేశాడు. కానీ హిట్టర్లు షారుక్‌ (24 నాటౌట్‌; 20 బంతుల్లో 1×4, 2×6), స్మిత్‌ క్రీజులో ఉండడంతో పంజాబ్‌ ఆశలు వదులుకోలేదు. హర్షల్‌ బౌలింగ్‌లో స్మిత్‌ క్యాచ్‌ను అనుజ్‌ వదిలేశాడు. అతణ్ని రనౌట్‌ చేసే అవకాశాన్నీ చేజార్చారు. అదే బెంగళూరుని దెబ్బతీసింది. విజయానికి 3 ఓవర్లలో 36 పరుగులు అవసరం కాగా.. 18వ ఓవర్‌ వేసిన సిరాజ్‌ బౌలింగ్‌లో స్మిత్‌ ఏకంగా మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌ కొట్టాడు. దీంతో పంజాబ్‌ విజయం ఖాయమైంది. ఆ తర్వాతి ఓవర్లోనే ఓ సిక్సర్‌, ఫోర్‌తో షారుక్‌ మ్యాచ్‌ ముగించాడు.

తుపానులా ముంచెత్తి..: అంతకుముందు బెంగళూరు ఇన్నింగ్స్‌ ఆరంభమైన తీరుకు.. ముగిసిన విధానానికి పొంతనే లేదు. మొదట్లో పరుగులు చేసేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డ డుప్లెసిస్‌.. ఆ తర్వాత పెను విధ్వంసమే సృష్టించాడు. తొమ్మిది ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 57/1. డుప్లెసిస్‌ తొలి 30 బంతుల్లో 17 పరుగులే చేశాడు. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో స్మిత్‌ బౌలింగ్‌లో షారుక్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన అతను.. తడబడుతూనే బ్యాటింగ్‌ కొనసాగించాడు. మరో ఓపెనర్‌ అనుజ్‌ (21) కొన్ని షాట్లు ఆడడంతో తొలి ఆరు ఓవర్లలో ఆ జట్టు 41/0తో నిలిచింది. కానీ బౌలింగ్‌కు వస్తూనే రాహుల్‌ చాహర్‌ (1/22).. అనుజ్‌ను వెనక్కిపంపాడు. డుస్లెసిస్‌కు జత కలిసిన కోహ్లి ఓ సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. డుప్లెసిస్‌ కూడా జోరందుకున్నాడు. ఓ సిక్సర్‌తో ఒత్తిడి దూరం చేసుకున్నాడు. ఆ జట్టు 12 ఓవర్లకు 92/1తో నిలిచింది. ఆ తర్వాతి ఓవర్‌ (స్మిత్‌) నుంచి ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. బౌండరీల వర్షం ముంచెత్తింది. డుప్లెసిస్‌ వరుసగా 4, 6, 6తో తనలోని విధ్వంసకారుణ్ని నిద్రలేపాడు. ఆఫ్‌స్టంప్‌ వైపు జరిగి ప్యాడిల్‌ స్వీప్‌తో ఫైన్‌లెగ్‌లో కొట్టిన సిక్సర్‌తో అర్ధశతకం చేరుకున్నాడు. స్పిన్నర్‌ బ్రార్‌కు వరుసగా రెండు సిక్సర్ల రుచి చూపించాడు. విరాట్‌ కూడా తగ్గేదేలే అంటూ బౌండరీల వేటలో సాగాడు. డుప్లెసిస్‌ దూకుడు చూస్తుంటే సెంచరీ చేస్తాడనిపించింది. కానీ అర్ష్‌దీప్‌ (1/31) బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాఫ్‌లో షారుక్‌ చేతికి చిక్కాడు. దీంతో 118 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కానీ వస్తూనే దినేశ్‌ కార్తీక్‌  చిన్నపాటి సునామీనే సృష్టించాడు. సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీ దాటించాడు. బంతిని అమాంతం ఎత్తేసి స్టాండ్స్‌లో పడేసి జట్టు స్కోరును 200 దాటించాడు. చివరి 8 ఓవర్లలో ఆర్సీబీ ఏకంగా 113 పరుగులు పిండుకుంది.

బెంగళూరు ఇన్నింగ్స్‌: డుప్లెసిస్‌ (సి) షారుక్‌ (బి) అర్ష్‌దీప్‌ 88; అనుజ్‌ (బి) చాహర్‌ 21; కోహ్లి నాటౌట్‌ 41; దినేశ్‌ కార్తీక్‌ నాటౌట్‌ 32; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం: (20 ఓవర్లలో 2 వికెట్లకు) 205; వికెట్ల పతనం: 1-50, 2-168; బౌలింగ్‌: సందీప్‌ 4-0-37-0; అర్ష్‌దీప్‌ 4-0-31-1; ఒడియన్‌ స్మిత్‌ 4-0-52-0; రాహుల్‌ చాహర్‌ 4-0-22-1; హర్‌ప్రీత్‌ బ్రార్‌ 3-0-38-0; లివింగ్‌స్టోన్‌ 1-0-14-0

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) షాబాజ్‌ (బి) హసరంగ 32; ధావన్‌ (సి) అనుజ్‌ (బి) హర్షల్‌ 43; భానుక రాజపక్స (సి) షాబాజ్‌ (బి) సిరాజ్‌ 43; లివింగ్‌స్టోన్‌ (సి) అనుజ్‌ (బి) ఆకాశ్‌ 19; రాజ్‌ బవా ఎల్బీ (బి) సిరాజ్‌ 0; షారుక్‌ ఖాన్‌ నాటౌట్‌ 24; ఒడియన్‌ స్మిత్‌ నాటౌట్‌ 25; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం: (19 ఓవర్లలో 5 వికెట్లకు) 208; వికెట్ల పతనం: 1-71, 2-118, 3-139, 4-139, 5-156; బౌలింగ్‌: డేవిడ్‌ విల్లీ 3-0-28-0; సిరాజ్‌ 4-0-59-2; షాబాజ్‌ అహ్మద్‌ 1-0-6-0; ఆకాశ్‌ దీప్‌ 3-0-38-1; హసరంగ 4-0-40-1; హర్షల్‌ 4-0-36-1

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని