Rohit Sharma: విజ్డెన్‌ మేటి క్రికెటర్లుగా రోహిత్‌, బుమ్రా

భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, పేసర్‌ బుమ్రా.. 2022కి గాను విజ్డెన్‌ ప్రకటించిన ఈ ఏటి మేటి క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గతేడాది ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుని విజ్డెన్‌ అయిదుగురు

Updated : 22 Apr 2022 06:52 IST

లండన్‌: భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, పేసర్‌ బుమ్రా.. 2022కి గాను విజ్డెన్‌ ప్రకటించిన ఈ ఏటి మేటి క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గతేడాది ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుని విజ్డెన్‌ అయిదుగురు క్రికెటర్లను ఈ అవార్డు కోసం ఎంపిక చేసింది. అందులో రోహిత్‌, బుమ్రాతో పాటు డెవాన్‌ కాన్వే (న్యూజిలాండ్‌), ఇంగ్లాండ్‌ పేసర్‌ రాబిన్సన్‌, దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్‌ వాన్‌ నీకెర్క్‌ ఉన్నారు. మరోవైపు ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ ప్రపంచంలోనే మేటి క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్‌ లిజెల్లీ లీ మేటి మహిళా క్రికెటర్‌గా, పాకిస్థాన్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ మేటి టీ20 క్రికెటర్‌గా నిలిచారు. గతేడాది ఇంగ్లాండ్‌ పర్యటనలో గొప్పగా రాణించిన బుమ్రా.. లార్డ్స్‌లో టీమ్‌ఇండియా చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓవల్‌లో మ్యాచ్‌ను గెలిపించే ప్రదర్శన చేశాడు. రోహిత్‌ నాలుగు టెస్టుల్లో 52.57 సగటుతో 368 పరుగులు చేశాడు. ఓవల్‌లో సెంచరీతో విదేశాల్లో తొలి టెస్టు శతకం అందుకున్నాడు. ఈ అయిదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్‌ 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం విదితమే. అయిదో టెస్టు ఈ ఏడాది జులైలో జరగనుంది. మరోవైపు నిరుడు టెస్టుల్లో చెలరేగిన రూట్‌ 1,708 పరుగులు చేశాడు. ఓ క్యాలెండర్‌ ఏడాదిలో అత్యధిక టెస్టు పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2021లో 27 టీ20ల్లో రిజ్వాన్‌ 72.88 సగటుతో 1,329 పరుగులు చేసి.. పొట్టి ఫార్మాట్లో ఓ క్యాలెండర్‌ ఏడాదిలో వెయ్యి అంతర్జాతీయ పరుగులు పూర్తిచేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర నమోదు చేశాడు. ఇక లిజెల్లీ గతేడాది వన్డేల్లో 90.28 సగటు నమోదు చేయడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని