Jos Buttler: బట్లర్‌ మళ్లీ సెంచరీ బాదేశాడు

విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ లాంటి భారత సూపర్‌ స్టార్లు పరుగుల కోసం తంటాలు పడుతున్న మెగా టోర్నీలో  ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ అసాధారణంగా చెలరేగిపోతున్నాడు. 2016లో విరాట్‌ పరుగుల వరదను గుర్తుకు తెస్తూ శతకాల మోత మోగించేస్తున్నాడు.

Updated : 23 Apr 2022 09:56 IST

వరుసగా రెండో శతకం.. సీజన్లో మూడోది

చెలరేగిన పడిక్కల్‌, శాంసన్‌

పావెల్‌ మెరుపులు వృథా

దిల్లీపై రాజస్థాన్‌ విజయం

విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ లాంటి భారత సూపర్‌ స్టార్లు పరుగుల కోసం తంటాలు పడుతున్న మెగా టోర్నీలో  ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ అసాధారణంగా చెలరేగిపోతున్నాడు. 2016లో విరాట్‌ పరుగుల వరదను గుర్తుకు తెస్తూ శతకాల మోత మోగించేస్తున్నాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో అతను మూడంకెల స్కోరును అందుకున్నాడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనే అతను మూడో శతకం బాదేయడం విశేషం. అతడి జోరుకు పడిక్కల్‌, శాంసన్‌ మెరుపులు కూడా తోడవడంతో రాజస్థాన్‌ సీజన్లో అత్యధిక స్కోరు (222/2) నమోదు చేసింది. నాటకీయంగా ముగిసిన మ్యాచ్‌లో విజయం కోసం దిల్లీ గట్టిగానే పోరాడినా.. విజయం రాజస్థాన్‌నే వరించింది.

ముంబయి

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, 14 సిక్సర్లు.. దిల్లీ తరఫున 17 ఫోర్లు, 13 సిక్సర్లు.. ఒక జట్టు 222 పరుగులు చేస్తే.. ఇంకో జట్టు 207 పరుగులు రాబట్టింది. ఒక బ్యాట్స్‌మన్‌ అలవోకగా సెంచరీ బాదేశాడు. ఫోర్లు, సిక్సర్ల వేటలో నువ్వా నేనా అన్నట్లు ఇరు జట్లు పోటీ పడ్డ మ్యాచ్‌లో చివరికి రాజస్థాన్‌ పైచేయి సాధించింది. మొదట బట్లర్‌ (116; 65 బంతుల్లో 9×4, 9×6) శతకానికి దేవ్‌దత్‌ పడిక్కల్‌ (54; 35 బంతుల్లో 7×4, 2×6), సంజు శాంసన్‌ (46; 19 బంతుల్లో 5×4, 3×6) మెరుపులు తోడవడంతో రాజస్థాన్‌ 2 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం పృథ్వీ షా (37; 27 బంతుల్లో 5×4, 1×6), రిషబ్‌  పంత్‌ (44; 24 బంతుల్లో 4×4, 2×6), లలిత్‌ యాదవ్‌ (37; 24 బంతుల్లో 3×4, 2×6), రోమన్‌ పావెల్‌ (36; 15 బంతుల్లో 5×6) దిల్లీని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆ జట్టు 8 వికెట్లకు 207 పరుగులే చేయగలిగింది. ప్రసిద్ధ్‌ కృష్ణ (3/22) అద్భుత బౌలింగ్‌తో డీసీని దెబ్బ కొట్టాడు. అశ్విన్‌ (2/32), చాహల్‌ (1/28) కూడా రాణించారు.

నాటకీయ ముగింపు: 127/5.. ఛేదనలో 13 ఓవర్లకు దిల్లీ స్కోరిది. పృథ్వీ షా, వార్నర్‌ (28; 14 బంతుల్లో 5×4, 1×6) జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చినా.. పంత్‌ కూడా చెలరేగి ఆడినా.. రాయల్స్‌ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో దిల్లీకి ఇబ్బందులు తప్పలేదు. ముఖ్యంగా 12వ ఓవర్లో ప్రసిద్ధ్‌.. పంత్‌ను ఔట్‌ చేశాక స్కోరు వేగం పడిపోయింది. అక్షర్‌ పటేల్‌ (1), శార్దూల్‌ (10) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఓ ఎండ్‌లో లలిత్‌ యాదవ్‌ పోరాడుతున్నా.. అతడికి సహకరించేవారు కరవయ్యారు. చివరి 3 ఓవర్లలో 51 పరుగులు చేయాల్సి రావడంతో దిల్లీకి మ్యాచ్‌ దూరమైనట్లే అనిపించింది. కానీ ఈ సీజన్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఒక్కటీ ఆడని రోమన్‌ పావెల్‌ ఆఖర్లో అనూహ్యంగా చెలరేగిపోయాడు. బౌల్ట్‌ వేసిన 18వ ఓవర్లో చివరి మూడు బంతుల్లో రెండు సిక్సర్లు బాది డీసీని రేసులోకి తెచ్చాడు. కానీ ప్రసిద్ధ్‌ 19వ ఓవర్లో అద్భుతమే చేశాడు. ఒక్కటంటే ఒక్క పరుగూ ఇవ్వకుండా లలిత్‌ను ఔట్‌ చేశాడు. ఈ ఓవర్లో పావెల్‌కు ఒక్క బంతీ ఆడే అవకాశం రాలేదు. చివరి ఓవర్లో 36 పరుగులు చేయాల్సి రావడంతో దిల్లీ ఓటమి లాంఛనమే అనిపించింది. కానీ పావెల్‌ తొలి 3 బంతుల్లో 3 సిక్సర్లు బాదేసి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చేశాడు. మూడో బంతి నోబాల్‌లా కనిపించినా అంపైర్‌ ఇవ్వలేదు. దీనిపై కాసేపు గొడవ జరిగింది. నిరసనగా తమ బ్యాట్స్‌మెన్‌ను బయటికి వచ్చేయాలని దిల్లీ కెప్టెన్‌ పంత్‌ పిలిచాడు. ఆ జట్టు సహాయ కోచ్‌ ఆమ్రె మైదానంలోకి వచ్చాడు. అంపైర్‌ అతడికి సర్ది చెప్పడంతో మ్యాచ్‌ కొనసాగింది. ఈ గొడవతో పావెల్‌ ఏకాగ్రత చెదిరింది. నాలుగో బంతికి పరుగు రాకపోవడంతో డీసీకి దారులు మూసుకుపోయాయి. అయిదో బంతికి 2 పరుగులు తీసిన పావెల్‌ చివరి బంతికి ఔటైపోయాడు.

దంచుడే దంచుడు: అంతకుముందు రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ ఆద్యంతం ఉరుములు మెరుపుల్లా సాగింది. భీకర ఫామ్‌ను కొనసాగిస్తూ జోస్‌ బట్లర్‌ దిల్లీ బౌలర్లపై విరుచుకుపడిపోయాడు. గత మ్యాచ్‌లో పంజాబ్‌ను 115 పరుగులకే కుప్పకూల్చిన దిల్లీ బౌలర్లను బట్లర్‌ అసలేమాత్రం లెక్క చేయలేదు. మరో ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ సైతం దూకుడుగా ఆడడంతో రాజస్థాన్‌ స్కోరు పట్టపగ్గాల్లేకుండా దూసుకెళ్లింది. తొలి 3 ఓవర్లు ఆచితూచి ఆడాక బట్లర్‌, పడిక్కల్‌ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి షాట్లు ఆడారు. ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో పడిక్కల్‌ హ్యాట్రిక్‌ ఫోర్లు కొడితే.. ఖలీల్‌ ఓవర్లో బట్లర్‌ రెండు సిక్సర్లు బాదాడు. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో పడిక్కల్‌ వరుసగా 6, 4 బాదితే.. తర్వాతి ఓవర్లో కుల్‌దీప్‌కు బట్లర్‌ అదే శిక్ష వేశాడు. వీరి ధాటికి 11వ ఓవర్లోనే రాజస్థాన్‌ 100 దాటేసింది. అప్పటికే అర్ధశతకం పూర్తి చేసిన బట్లర్‌.. తర్వాత మరింత చెలరేగాడు. 15 ఓవర్లకు స్కోరు 155/0కు చేరుకోగా.. బట్లర్‌ 99 మీదికి వచ్చేయడం విశేషం. 11-15 మధ్య 5 ఓవర్లలో బట్లర్‌ 21 బంతులాడి 50 పరుగులు చేశాడు. 16వ ఓవర్లో ఖలీల్‌.. పడిక్కల్‌ను ఔట్‌ చేసినా దిల్లీకి ఉపశమనం లేదు. ఈ ఓవర్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న బట్లర్‌ కొంచెం శాంతించగా.. శాంసన్‌ క్రీజులోకి వచ్చీ రాగానే చెలరేగిపోయాడు. అతడి ధాటికి రాజస్థాన్‌ సీజన్లో అత్యధిక స్కోరు నమోదు చేసింది.


బట్లర్‌కు వరుసగా ఇది రెండో సెంచరీ. మొత్తంగా సీజన్లో మూడోది. తన చివరి టీ20 లీగ్‌ల్లో అతను నాలుగు శతకాలు సాధించడం విశేషం. ఒకే సీజన్లో అత్యధిక శతకాలు సాధించిన రికార్డు కోహ్లి (2016లో 4) పేరిట ఉంది.


222
రాజస్థాన్‌ పరుగులు. ఈ సీజన్లో ఇదే అత్యధిక స్కోరు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని