Delhi: పాంటింగ్‌ కుటుంబంలో ఒకరికి కరోనా.. ఐసోలేషన్‌లో దిల్లీ కోచ్‌

కరోనా మహమ్మారి దిల్లీ బృందాన్ని వదలడం లేదు. ఇప్పటికే ఆ జట్టు విదేశీ ఆటగాళ్లు మిచెల్‌ మార్ష్‌, టిమ్‌ సీఫర్ట్‌ సహా మొత్తం ఆరుగురు వైరస్‌ బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా తన

Updated : 23 Apr 2022 09:34 IST

 

దిల్లీ: కరోనా మహమ్మారి దిల్లీ బృందాన్ని వదలడం లేదు. ఇప్పటికే ఆ జట్టు విదేశీ ఆటగాళ్లు మిచెల్‌ మార్ష్‌, టిమ్‌ సీఫర్ట్‌ సహా మొత్తం ఆరుగురు వైరస్‌ బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా తన కుటుంబంలోని ఒకరికి కొవిడ్‌ సోకడంతో ఆ జట్టు కోచ్‌ రికీ పాంటింగ్‌ అయిదు రోజులు ఐసోలేషన్‌లో గడపనున్నాడు. శుక్రవారం రాజస్థాన్‌తో దిల్లీ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే ఇలా జరగడంతో ఆ జట్టుపై దెబ్బపడినట్లయింది. పాంటింగ్‌కు నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినప్పటికీ.. పాజిటివ్‌గా తేలిన వ్యక్తికి అత్యంత సన్నిహితంగా ఉండడంతో ముందు జాగ్రత్తగా జట్టుకు దూరం పెట్టక తప్పలేదు. ఇప్పుడు అతని కుటుంబం ఐసోలేషన్‌లో ఉంది. దీంతో రాజస్థాన్‌తో మ్యాచ్‌కు అతను జట్టుతో మైదానంలో కనిపించలేదు. ఓ వైపు వైరస్‌ ఆందోళన కొనసాగుతున్నప్పటికీ.. బుధవారం పంజాబ్‌పై దిల్లీ ఘన విజయం సాధించింది. అందుకు పాంటింగ్‌ మాటలే కారణమని, అతను ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడని అక్షర్‌ వెల్లడించిన విషయం విదితమే. కానీ ఇప్పుడు పాంటింగ్‌ కూడా దూరమయ్యాడు. ‘‘రెండు సార్లు నిర్వహించిన పరీక్షల్లో పాంటింగ్‌ నెగెటివ్‌గా తేలాడు. కానీ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో అతను సన్నిహితంగా మెలగడంతో జట్టు ప్రయోజనాల దృష్ట్యా అయిదు రోజుల ఐసోలేషన్‌లో ఉంచక తప్పదు. జట్టు మేనేజ్‌మెంట్‌, వైద్య బృందం ఈ నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌తో మ్యాచ్‌కు అతను మైదానంలో కనిపించడు. ఈ సమయంలో అతని కుటుంబ గోప్యతను కాపాడాలని ఫ్రాంఛైజీ కోరుతోంది. వైరస్‌ సోకిన వాళ్లు వేగంగా కోలుకునేలా జట్టు దృష్టిపెట్టింది’’ అని దిల్లీ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని